Jan 24,2023 22:00

ఫ్లెక్సీ యంత్రం

           హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరీరక్షణలో భాగంగా గురువారం నుంచి సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధంను అమలు చేయనుంది. ఇందుకోసం గతేడాది జీవో నెంబర్‌ 65, 75లను తీసుకొచ్చారు. జీవోకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 26వ తేదీ నుంచి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఎక్కడా ప్లాస్టిక్‌ బ్యానర్లను తయారు చేసేందుకు వీల్లేదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా నిర్ణయం తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఫ్లెక్సీలు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువుల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం దొరికే వరకు సమయం పొడగించాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం రేపటి నుంచి ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేదించాలని నిర్ణయం తీసుకుంది.
గత రెండు దశాబ్ధాల నుంచి డిజిటల్‌ బ్యానర్ల వాడకం విరివిగా పెరిగింది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీటినే వాడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ అందంగా ఉండడం వల్ల ఫ్లెక్సీలకు అనతికాలంలోనే డిమాండ్‌ పెరిగింది. ప్రధాన నాయకులు వస్తే ఈ ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఆ ప్రాంతంలో దగదగలాడుతుంటాయి. వినియోగం పెరగడంతో చాలా మంది ఈ రంగంలోకి వెళ్లి అందులో స్థిరపడ్డారు. పట్టణాల్లో ఫ్లెక్సీల తయారీ, ప్రింటింగ్‌ ఒక పెద్ద ఉపాధి రంగంగా మారింది. చాలా మంది బ్యాంకుల్లో ఋణాలను తీసుకుని ప్లాస్టిక్‌ బ్యానర్‌ల తయారీ యంత్రాలను పెట్టుకుని ఉపాది పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 100 పైగా ఫ్లెక్సీ సెంటర్‌లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్‌ బ్యానర్ల తయారీ నిషేధంతో వీరంతా ఉపాధికి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఉపాధిపై దెబ్బ
ఫ్లెక్సీ సెంటర్లలో ఒక్కో దాంట్లో 10మంది దాకా వర్కర్లు ఆధారపడి జీవిస్తున్నారు. యజమానులు ఒక్కొక్కరు రూ.10లక్షలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వచ్చే ఆదాయంలో కంతులకు కట్టుకుని, ఇతరులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలనూ పోషించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఫ్లెక్సీ ప్రింటింగ్‌లను ఆపేయాలని నిర్ణయం తీసుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపించే వరకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు.
కాటన్‌ బట్టలతో తయారు చేయాలి
మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు

హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ తయారీదారులు అందరు ప్లాస్టిక్‌తో కాకుండా కాటన్‌ బట్టలతో బ్యానర్‌లను తయారు చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. తయారీ దారుల కోరిక మేరకు గడువు పెంచారు. ఈ గడువూ ముగిసిన నేపథ్యంలో ఈనెల 26 నుంచి నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. దీనిని ఉల్లగించిన వారికి ఒక అడుగుకు రూ.100 చొప్పున జరిమాన విధించడంతో పాటు శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.
ప్రత్నామ్యాయం కల్పించాలి
ఎం.ఇంతియాజ్‌ సిపిఎం జిల్లా కార్యదర్శి

ప్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆధారపడి చాలా మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం ఈ రంగం కార్మికులతో మాట్లాడాలి. వీరికి ప్రత్యామ్నాయం దొరికే వరకు ప్లాస్టిక్‌ నిషేధాన్ని వాయిదా వేయాలి. ఎటువంటి ప్రత్యామ్నాయ అవకాశాలు చూపకుండా నిషేధం తీసుకువస్తే ఆ రంగంపై ఆధారపడిన ఉత్పత్తిదారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల స్థానంలో క్లాత్‌ బ్యానర్లు ప్రింట్‌ వేసుకోవడానికి వీలుగా మిషనరీని అప్‌డేట్‌ చేసుకోడడానికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి సంవత్సరం గడువు ఇవ్వాలి.