నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణం
ఉక్కు పరిశ్రమ పనులు మొదలు కాలేదు
పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రజాశక్తి - కడప అర్బన్ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనీలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ఎంఎల్‌సి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంఎల్‌సి ఎన్నికలు వచ్చాయని పేర్కొన్నారు. సహజంగా పోటీలు చేసే ఆశావాహులు ఉంటారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరూ ఉండకూడదు, కేవలం వైసిపి అభ్యర్థులు మాత్రమే ఉండాలను కోవడం దుర్మార్గమైన ఆలోచనన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులు కూడా వైసిపి వారు మాత్రమే ఉండాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎంఎల్‌సి ఎన్నికులు సెమీఫైనల్స్ అని మంత్రి ధర్మానప్రసాద్ అన్నారని పేర్కొన్నారు. ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకుండా పోలీసులు ద్వారా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అభ్యర్థులు మారువేషాలలో వెళ్లి నామినేషన్లు వేసి దుస్థితినికి రాష్ట్రంలో తీసుకువచ్చిన సిఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏకగ్రీవం కోసం నామినేషన్లు వేసిన వారికి ప్రపోజల్స్‌గా సంతకాలు చేసిన వారిని పోలీసులు బెదిరించి సంతకాలు మావికావు ఫోర్జరీ చేశారని చెప్పించడం సిగ్గుచేటన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి పోటీలలో గతంలో ఏ పార్టీ వాళ్లు వారి అభ్యర్థులను నిలబెట్టలేదని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు పార్టీ తరపున పోటీ పెట్టలేదని గుర్తిచేశారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు పట్టభద్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి రూ.2 వేలు, రూ.5వేలు డబ్బులు ఇవ్వనున్నారని చెప్పారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదన్న రీతిలో ప్రజాస్యామ్యానికి పాతర వేస్తున్నారని విమర్శించారు. వైసిపి తీరును అడ్డుకునేందుకు మేధావులైన డాక్టర్లు, ఇంజినీర్లు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు ఓటువేసి,వేయించి గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సిపిఐ పాదాయాత్ర ప్రారంభించిందని, వాతావరణం అనుకూలించక ఒక్క రోజు మాత్రమే చేశామన్నారు. సిఎం జగన్ ఆఘమేఘాలమీద జిందాల్ కంపెనీ వారి చేత శంకుస్థాపన చేయించారని తెలిపారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నాలుగు సార్లు శంకుస్థాపనకులు చేశారని చెప్పారు. మొదట వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తరువాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి రెండు సార్లు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. పనులు ఒక్కఅడుగుకూడా ముందుకు పడలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే సకాలంలో పరిశ్రమ పూర్తి చేయాలని డిమాండ్ లేశారు. లేదంటే ఎన్నికల్లో వైసిపికి ఓటు అడగకూడదని పేర్కొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి, సిఎం జగన్ చిన్నాని వివేకానందరెడ్డి హత్యకు గురై 4 సంవత్సరాలు అవుతున్నా దోషులు ఎవరూ అనేది నేటికి రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ తేల్చకపోవడం ప్రభుత్వం, సిబిఐ పై ప్రజలకు ఏమి విశ్వాసం ఉంటుందన్నారు. దీనికి సిఎం, సిబిఐ సమాదానం చెప్పాలన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను ఓడించి పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెనిన్ బాబు, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌సన్ బాబు, కార్యదర్శి శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి వెంకటశివా, నాయకులు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, మద్దిలేటి పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ










