Jul 15,2021 17:01

జోహెన్స్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా అరెస్టుకు నిరసనగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 72కు చేరింది. ఎక్కడక్కడ దుకాణాల్లో ప్రజలు చొరబడి లూటీకి పాల్పడడంతో భారీ తొక్కిసలాట జరిగింది. గౌటెంగ్‌, వాజులూ-నాటల్‌ ప్రావిన్స్‌ల్లో వేలాదిమంది ప్రజలు చోరీలకు పాల్పడ్డారు. ఆహార దుకాణాలు, విద్యుత్తు పరికరాలు, మద్యం, దుస్తుల దుకాణాల్లో దొంగతనాలు జరిగాయి. పరిస్థితి చేయిదాటడంతో నిరసనకారులపై పోలీసులు రబ్బరు తూటాలు ప్రయోగించారు. 1200 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. గౌటెంగ్‌లో 45 మరణాలపై, వాజులూ-నాటల్‌లో 27 మరణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లర్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2009-2018 మధ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జూమా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దర్యాప్తులో కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో జూమాకు న్యాయస్థానం 15 నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల 8న ఆయనను జైలుకు తరలించిన సంగతి విదితమే.