ప్రజాశక్తి - మైలవరం (ఎన్‌టిఆర్) : పాలు, పాల పదార్థాల వంటి నిత్యావసర వస్తువులపై కేంద్రం విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వజ్రాల ధనలక్ష్మి డిమాండ్ చేశారు. కేంద్రం విధించిన పాలపై జిఎస్‌టిని తగ్గించాలని కోరుతూ గురువారం మండలంలోని మంగాపురం పాల కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని కేరళ తరహాలో జిఎస్‌టిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. 50 శాతం సబ్సిడీపై పాడిగేదెలకులోన్లు ఇవ్వాలని, అమూల్‌కి ఇచ్చిన విధంగానే అన్ని పాల డైరీలకు సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రాల వెంకట్ రెడ్డి, రైతులు నక్కన బోయిన జయమ్మ, ఆదిలక్ష్మి, నాగేశ్వరరావు, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










