Jun 25,2023 13:25

మాస్కో   :  రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 'వాగర్‌ గ్రూప్‌' చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ రోస్తోవ్‌ నగరాన్ని విడిచి బెలారస్‌కు వెళ్లిపోయాడు.  ఆయన రోడ్డు మార్గం గుండా రోస్తోవ్‌ను వదిలి బెలారస్‌కు వెళ్ళిపోతున్న చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.  రష్యా దక్షిణ ప్రాంత నగరమైన రొస్తోవ్‌ అన్‌ డాన్‌లో యెవెగిన్‌ ప్రిగోజిన్‌ నాయకత్వంలోని వాగ్నర్  ప్రైవేట్‌ మిలిటరీ గ్రూపు శుక్రవారం సాయుధ తిరుగుబాటుకు యత్నించిన సంగతి తెలిసిందే. ప్రిగొజిన్‌ చర్యను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగర్‌ చర్యను 'వెన్నుపోటు', 'ద్రోహం' గా అభివర్ణించారు. ఆ మరుసటి రోజునే వాగర్‌ గ్రూప్‌ బెలారస్‌కు కేవలం 24 గంటల వ్యవధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
 వాగ్నర్   గ్రూపుతోపాటు ఆయనపై నమోదైన కేసులను రష్యా అధికారులు తొలగించారు. మరోవైపు కిరాయి సైనిక దళాలు రొస్తోవ్‌-ఆన్‌-డాన్‌ను వీడి తిరిగి సరిహద్దుల్లోని వాటి స్థావరాలకు వెళ్లాయని ఆ ప్రాంత గవర్నర్‌ పేర్కొన్నారు. బెలారస్‌ రాయబారంతో  వాగ్నర్   గ్రూప్‌ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో రష్యాలోని కీలక రహదారులపై విధించిన ఆంక్షలను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఫెడరల్‌ రోడ్‌ ఏజెన్సీ ధ్రువీకరించినట్లు టాస్‌ న్యూస్‌ వెల్లడించింది.

యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ రోస్తోవ్‌ నగరంలోని మిలిటరీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి వాహనంలో వెళ్లిపోతున్నారని రాయిటర్స్‌ తెలిపింది. ప్రిగోజిన్‌ రష్యా నుంచి బెలారస్‌కు వెళ్ళిపోతున్నారని, రక్తపాతాన్ని నివారించడానికి ఆయనతో పాటు వాగర్‌ దళాల మీద ఉన్న అభియోగాలన్నింటినీ అధికారులు ఉపసంహరించుకున్నారని రష్యా ప్రభుత్వ మీడియా కూడా ప్రకటించింది.