న్యూఢిల్లీ : భారత్ -అమెరికా మధ్య సంబంధాలు గతంలో కంటే మరింత బలంగా, దృఢంగా అయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మొదటి సారి మంగళవారం ప్రధాని అమెరికాకు బయలుదేరారు. ఈ సందర్భంగా అమెరికా మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం తమ భాగస్వామ్యానికి ఓ మూల స్తంభం కానుందని, వాణిజ్యం, సాంకేతికత సహా ఇతరరంగాలకు సహకారం పెరగనుందని అన్నారు. భారతదేశం -అమెరికా మధ్య సంబంధాలు గతంలో కంటే బలోపేతమవడంతో పాటు ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అపూర్వమైన విశ్వాసం పెరిగిందని అన్నారు. భారత్ ఏదేశాన్ని భర్తీ చేయాలని కోరుకోవడం లేదని, ఈ ప్రక్రియతో ప్రపంచంలో భారతదేశం సముచిత స్థానాన్ని పొందాలనుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ను సహజ నేతగా చిత్రీకరిస్తుందని, ఆ దేశాల ఆకాంక్షలను వినిపించేందుకు మార్గం కావాలని అన్నారు.
బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో వాటిని మరింత విస్తృతంగా ప్రాతినిధ్యం వహించడానికి ఐరాస వంటి ప్రపంచ సంస్థలను సమగ్రంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం కల్పించాలని ఆయన కోరుకున్నారు.
ఈ పర్యటనలో అమెరికాతో సుమారు మూడు బిలియన్ డాలర్ల విలువ కలిగిన సాయుధ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రకటన చేయనున్నారు.
అమెరికాలో కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని రెండో ప్రసంగం చేయనున్నారు. అలాగే అక్కడి పారిశ్రామిక వేత్తలు, భారతీయ నిపుణులతో భేటీ కానున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చే విందులో పాల్గొననున్నారు.










