Jun 13,2022 07:08

నీ మీసం నీ కోపం నీ ప్రతాపం
అంతా సహజాతి సహజం
నా రోషం నా అసహనం నా పలుకు
అంతా గర్వాతిశయం

లోకం పదే పదే కోడై కూస్తూ
నీకు మరికొన్ని కొత్తకోరలను కొమ్ములను
మొలిపిస్తుంటుంది
ఎన్ని యుగాలుగానో
సమాజం వల్లె వేయించిన
కొన్ని కొలతలకు తగ్గట్టు
నన్ను నేను కుదించుకుంటూ
సందర్భాలకు తగ్గట్టు
మనసును మడుచుకుంటూ ...
నీతిశాస్త్రాలలోని నిర్వచనాలన్నీ
నీ మైదానంలోని బంతులే
నువ్వెటు తంతే అటు ఎగిరిపడుతూ నేను

కార్యేషుదాసి మహారాణై
కాగితాలపైనే నడుస్తుంది
వంటిళ్ళూ మసిగుడ్డలూ
సంకెళ్ళై నన్ను వెనక్కి లాగుతుంటే
నీ కళ్ళు ఇప్పటికీ నవ్వుతూనే
నా ముఖంతో సహా
పాదాలు ఎప్పటికీ పాతాళంలోనే!

- పద్మావతి రాంభక్త
9966307777