Mar 28,2022 07:48

    తెలుగు జర్నలిజాన్ని పరిపుష్టం చేసిన తాపీ ధర్మరావే తెలుగు ఫిల్మ్‌ జర్నలిజానికి కూడా ఆద్యులే. అయితే తెలుగు జర్నలిజం అర్థవంతంగా, సమగ్రంగా పరిణమించకముందే సినిమా పెట్టుబడికి ప్రసార సామగ్రిగా మారిపోయింది. సినిమా విమర్శ పూర్తిగా కనుమరుగై, సినిమా సమీక్ష అంటే సినిమా సమాచారమే అన్నంతగా తయారైంది. న్యూస్‌ టెలివిజన్‌ వచ్చిన తర్వాత సినిమా వార్తలు మెయిన్‌ స్ట్రీమ్‌ వార్తలుగా మారిపోయి, సినిమా ఆధారిత కార్యక్రమం వైద్యమూ, వ్యవసాయం వంటి విభాగాలకన్నా ఛానల్‌ యజమానులకు ఆకర్షణీయంగా మారిపోయింది. గంటల తరబడి వార్తల కార్యక్రమాలు రద్దు చేసి సినిమా ఫంక్షన్లను లైవ్‌ గా ఇచ్చే పరిస్థితిని ప్రేక్షకులు కూడా తప్పు పట్టడం లేదు !
    తెలుగు న్యూస్‌ టెలివిజన్‌ వచ్చిన వేళ ప్రచురింపబడినది (2004) డా. ఎం.వి. రమణారెడ్డి గారి 200 పేజీల పుస్తకం 'తెలుగు సినిమా స్వర్ణయుగం'. ఈ వ్యాసాలన్నీ గతంలో 'ఆంధ్రభూమి' దినపత్రిక సినిమా అనుబంధం 'వెన్నెల'లో వెలుగు చూసాయి. 1950-65 మధ్యకాలపు తెలుగు సినిమా కళాఖండాలను విశ్లేషించి వివరించడానికి స్వర్ణయుగం అనే భావనను స్వీకరించారు రచయిత. మల్లీశ్వరి, పాతాళభైరవి, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, బంగారు పాప, మాయాబజార్‌, జయభేరి- ఈ ఎనిమిది సినిమాలను ఈ వ్యాస సంపుటిలో విశ్లేషించారు. 1951-1959 మధ్యకాలంలో విడుదలైన కె.వి.రెడ్డి (3), బి.ఎన్‌.రెడ్డి (2), పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలివి. నిజానికి జయసింహ, మిస్సమ్మ, తోడికోడళ్ళు, శ్రీకృష్ణార్జున యుద్ధం, పూజాఫలం చిత్రాలను కూడా విశ్లేషించి వుండివుంటే తన ప్రణాళిక సమగ్రమైనదేనని, విస్తరణ విధితో ఆ పనికి పూనుకోలేదని రచయితే ఈ పుస్తకంలో మనవి చేస్తారు.
     అయిదు అనువాదాలు, నాలుగు భాగాల ప్రపంచ చరిత్ర మాత్రమే కాకుండా, రాయలసీమ కన్నీటి కథ అనే వ్యాస సంపుటి, పరిష్కారం అనే కథల సంపుటి, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ జీవిత చరిత్ర, తిక్కన మహాభారతం ఆధారంగా తెలుగు ఇల్లాలిగా ద్రౌపదిని చిత్రించిన రచన, అలాగే వ్యాకరణం గురించి రచనలు చేసిన రమణారెడ్డి గారి పుస్తకాల్లో చాలా విభిన్నమైనది, విలక్షణమైనది ఈ సినిమా సంబంధిత రచన. వైద్య శాస్త్రం, న్యాయ శాస్త్రం చదివిన వ్యక్తిగా, జర్నలిజమూ రాజకీయం పాటించిన వ్యక్తిగా మనకు తెలిసిన రచయిత ఈ సినిమా రచనలో కూడా చాలా సమగ్రంగా, ఎంతో విలక్షణంగా కనబడతారు.
 

                                                     ఈ ఉటంకింపులను చూడండి :

''... బ్రోమైడ్‌ ఫిల్మ్‌లో అంచులు నిశితంగా వుండవు కాబట్టి బొమ్మ అలికినట్టు కనబడేది. లోతు (డెప్త్‌) ఉండేది కాదు. శబ్దగ్రాహ పరికరాలు కూడా పరిణితి చెందినవి కావు. ప్రతి పలుకు విడివిడిగా విరిస్తే తప్ప రికార్డింగులో ముద్దయిపోతుంది. అందుకే 20వ శతాబ్దం మధ్యకాలం వరకూ నిర్మించిన తెలుగు చిత్రాల్లో సంభాషణ నిదానంగా, మాటలు ఈడ్చినట్లుగా వుంటుంది...' కేవలం సైన్సు బాగా తెలిసిన రచయిత మాత్రమే ఇలాంటి విషయాలు వివరించడానికి సిద్ధపడతారు.
     ''... సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా చిత్రం రూపకల్పనలో ఇప్పటివారు బహు కొద్దిమంది మాత్రమే అప్పటి వారికి సాటిరాగలరని చెప్పక తప్పదు. ప్రేక్షకులనాకర్షించడానికి హాస్యం, శృంగారం మొదలైన మసాలాలను కలిపి పాకం చెయ్యడం 1960కి ముందు రోజుల్లో అంతగా కనబడదు...'' అని అనగల సమదృష్టి, విజ్ఞత ఈ రచనలో పుష్కలంగా కనబడతాయి.
    ''...అనుబంధం ఆత్మీయతలు పాత్రల ప్రవర్తన ద్వారా వెల్లడవుతాయి తప్ప మాటల ద్వారా కాదు. మనసులోని భావాన్ని మాటలతో చెప్పడం తేలిక. తెరమీదకి ఎక్కించడం కష్టం. ఎందుకంటే కెమెరాకు కొన్ని పరిమితులున్నాయి... '' అని వివరించాలంటే మాధ్యమాల కళా రసాయనిక ధర్మాల మీద రచయితకు పట్టు వుంటే తప్ప సాధ్యం కాదు.
   ''... సమాజంలో రైతు పని, నేత పని ప్రధానమైన వృత్తులుగా నిలిచాయి. రైతులది మోటు పని. దీనికి అలవాటు పడ్డ మనుషులు కూడా మోటుగా వుంటారు. నేతపని సున్నితమైంది. యంత్రాలు రాకపూర్వం నేత కుటుంబాలు చాలా సంపన్నంగా వుండేవి. సంపదతో పాటు నాగరికత కూడా ఉన్నతంగా వుండేది...'' అని రచయిత విశ్లేషించాలంటే వారి చారిత్రక దృష్టికి తీక్షణత, సమదృష్టి ఎంతో వుంటే గానీ సాధ్యం కాదు.
      ''... దేవులపల్లి వారి కవితా లాలిత్యంలో స్త్రీ స్వభావం కనిపిస్తుంది. మల్లాది కవితా మనోజ్ఞతలో మగటిమి కనిపిస్తుంది...'' అని 'జయభేరి' సినిమా గురించి రాసిన రమణారెడ్డి అదే వ్యాసంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి 'మల్లీశ్వరి' సాహిత్యాన్ని మామిడిపండులాగానూ, మల్లాది రామకృష్ణ శాస్త్రివారి జయభేరి సాహిత్యాన్ని జుంటి తేనెగా పోలుస్తారు. మల్లీశ్వరి సినిమా గురించి రాస్తూ 'భానుమతి గొంతు గంభీరమైంది. కంచులా మోగుతుంది. గుర్రంలా తుళ్ళిపడుతుంది. కుసుమంలా మెత్తబడదు...' అని అంటారు. మల్లీశ్వరి సినిమా గురించే ఇంకోచోట 'నాగరాజు కత్తి దూస్తాడు. మూర్ఖుడా కత్తి దింపు అనగానే కత్తి దింపేస్తాడు. నాగరాజుగా నటించిన ఎన్‌.టి.రామారావు, కత్తి చేతిలో వుండి తిప్పకుండా వదిలేసిన సంఘటన బహుశా ఇదొక్కటేనేమో...' అంటారు. మరోచోట '... కథ మాటలు గొప్పగా వుంటే చాలదు. మాటలను భావం చెడకుండా ఉచ్ఛరించే దక్షత (మాడ్యులేషన్‌) పాత్రధారులకుంటేనే చిత్రం రక్తికడుతుంది...' అంటారు. 'చిత్రాతిచిత్రమైన గమనంతో సాగే కథ 'దొంగరాముడు'. దీన్ని తీర్చిదిద్దడానికి డి.వి. నరసరాజు అనుకరించిన శిల్పం అద్వితీయమైంది. చిత్రసీమలోనే కాకుండా దీనికి దీటైన శిల్పం తెలుగు సాహిత్యంలోనే అరుదు...' అని కూడా పరిశీలన చేస్తారు.
    ఇంతవరకు ఉటంకించిన విషయాలను పరిశీలిస్తే ఈ రచయితకున్న విలక్షణ విభిన్న సామర్థ్యాలు, కోణాలు మనకు తారసపడతాయి. ఇంతలోతుగా పరిశీలిస్తూనే ఉపోద్ఘాతం అధ్యాయంలో', 'ఆనాటి సినిమాల్లో దాగున్న కళాత్మక విలువలను పరిశోధించడం ఒక యజ్ఞం లాంటిది. ప్రతి చిత్రాన్ని లోతులకు దిగి పరిశీలించి రాయడానికి ఒక రచయితా చాలడు, ఒక పుస్తకమూ చాలదు' అని ఎంతో నమ్రతగా అంటూ కళా మాధ్యమంగా మంచి సినిమాకుండే స్థాయిని మనకు తేటతెల్లం చేస్తారు. రమణారెడ్డి గుంటూరు మెడికల్‌ కాలేజీలో విద్యార్థిగా వుండే రోజుల్లో 'ఆంధ్రపత్రిక'లో వి.ఎ.కె. రంగారావు రాసిన 'సరాగమాల' చదివి, సినిమా రంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. తెలుగు సినిమా సంగీత సాహిత్యాలను పునరుద్ధరించడానికి పూనుకున్న వైతాళికుడుగా వి.ఎ.కె. రంగారావు గారి కళాతపస్వి కృషికి చిరు కానుకగా తన 'తెలుగు సినిమా స్వర్ణ యుగం' పుస్తకాన్ని అంకితమిచ్చారు. సినిమా పట్ల చాలామందిలో కనిపించే తేలిక భావాన్ని పోగొట్టడానికి ఒక ప్రేక్షకునిగా తను చేసిన చిన్న ప్రయత్నంగా ఈ పుస్తక ప్రయత్నాన్ని అభివర్ణించారు.

రచయితకు సినిమాల సంబంధించి చాలా లోతైన, తీక్షణమైన పరిశీలన ఉంది అనడానికి ఈ విషయాలు గమనించవచ్చు.
''... కొంతమంది వెంట లేకపోతే కె.వి.రెడ్డి పనిచేయలేడేమోనని నా అనుమానం. సంగీతానికి పెండ్యాలో, ఘంటశాలో వుండాలి. రచనకు పింగళి వుండాలి. జానపద సినిమా తీస్తే ఒక ఎలుగుబంటి వుండాలి. ఇలాంటివేవేవో కొందరి నమ్మకాలు...''.
''... కొన్ని సాంఘిక చిత్రాల్లో పాటలు సంగీతం బాగా అతికిపోతుంది. అలా అతకడానికి బహుశ ప్రేమ అనే జిగురు అవసరమేమో...! కాకపోతే 'దేవదాసు' పాటలు 50 ఏళ్ళుగా మరుగున పడకుండా నిలుస్తాయా...''
''బెంగాలీ శరత్‌ బాబుది కథబీ బెంగాలీ హిందీ సినిమాల నిర్మాణానికి పి.సి.బారువా గారు రూపొందించింది స్క్రీన్‌ ప్లే. తమిళుడైన సుబ్బరామన్‌ గారు కూర్చి పెట్టినది సంగీతం. నటులు తప్ప ఇందులో తెలుగు వాసనే లేదు...''
''ఈ సినిమా తీసేనాటికి వేదాంతం రాఘవయ్య గారిలో చెప్పుకోదగ్గ పరిపక్వత కనిపించదు. పరిపక్వతే వుంటే కారక్టరైజేషన్‌ లో పార్వతీ దేవదాసుల బాల్యం అంత ఘోరంగా విఫలం కాదు. బలమైన కారణం లేకుండా స్వభావాలు సులభంగా మారిపోవడం అసాధ్యం. చిన్న పార్వతి కారెక్టరైజేషన్‌ మరీ అధ్వానం. పెద్దదైన తర్వాత పార్వతిలో కనిపించిన స్వభావానికి దీనికి పొంతనే లేదు.... సినిమాను బతికించింది సంగీతమైతే ఆ సంగీతానికి ప్రాణమిచ్చింది ఘంటశాల గాత్రం....'' ఇలా సాగుతుంది 'దేవదాసు' గురించిన విమర్శ. మరోచోట ఇదే సినిమా గురించి రమణారెడ్డి చేసిన మరికొన్ని పరిశీలనలు మనం గమనించాలి. 'వేశ్య నాట్యం కోసం క్షేత్రయ్య కృతిని ఒకదానిని ఇందులో ప్రవేశపెట్టారు. క్షేత్రయ్య సాహిత్యమంతా చివరకు వేశ్యల పాలు కావడం దురదృష్టమే. ఆయన రచనలో కనిపించే తాదాత్మ్యపు సాటిరాగల సాహిత్యం మరెక్కడా దొరకదు.' మరోచోట పార్వతీ దేవదాసు మధ్య సాగిన సంభాషణలు రెండు పేజీలకు మించి ఇచ్చి ఇలా వ్యాఖ్యానిస్తారు రమణారెడ్డి : ''...ఇది గుండెలు పిండే సన్నివేశం. సెంటిమెంటుతో మెదడు మొద్దుబారుతుంది. హృదయం విలపిస్తుంది. కానీ... ఇంత గొప్ప సన్నివేశానికి కూర్చిన సంభాషణ ఎంత ముదనష్టంగా వుండాలో అంతవరకు వుంది...''.
అదే సినిమా గురించే మరో చోట ఇలా వ్యాఖ్యానిస్తారు, ''... ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బండి తోలేవాడుగా నటించిన నటుని గురించి. ఆ కొద్ది సేపూ దేవదాసును స్టేషన్‌ నుండి దుర్గాపురం తీసుకువచ్చినదాకా ఆ చిన్న పాత్రలో అతడు కనబరిచిన సామర్థ్యం అంతా ఇంతా కాదు. నటనలో మొదటి బహుమతికి ఈ చిత్రంలో ఆ పాత్రదారుడే అర్హుడు''.
ఈ పరిశీలనా వ్యాసానికి నిడివి భయం తరుముకు వస్తోంది కానీ, అంతుచిక్కని విమర్శకుడి ప్రతిభ ఉవ్విళ్ళూరిస్తోంది. 'బంగారు పాప' సినిమాలో కోటయ్యపాత్రను రౌడీగా ప్రవేశపెట్టినపుడు విశ్లేషణతో కూడిన పేరాగ్రాఫ్‌ ఈ పదాలతో ముగుస్తుంది. ''...ఇంత మెలకువ పాటించి కూడా ఆ సీనులో కనిపించిన కుక్క సినిమా మొత్తంలో మరెక్కడా కనిపించకపోవడమొక్కటే అంత బావుండలేదు''. మరోచోట ''కులము, కలిమి, సాంప్రదాయాలు, ఆత్మీయులపట్ల వున్న బాధ్యతను దాచివేస్తాయి. అవి లేనిచోట ఆత్మీయతలు స్వయం ప్రకాశకంగా వుంటాయి. అవే మానవతా విలువలు''. ఈ భావనను పదిసార్లు పరిశీలించినా ఆశ్చర్యానికి అంతులేకుండా విశ్లేషణకు దణ్ణంపెట్టాలనిపిస్తుంది !
    రమణారెడ్డి గారు ఏ పుస్తకం రాసినా భాష గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఉదాహరణకు ఈ ఆంగ్లపదాలతో వాడిన తెలుగు పదాలు చూడండి. పాత్రల ప్రకృతి (టెంపర్మెంట్‌), మానసికావస్థ (మూడ్‌), బంధనాలు (లింకింగ్స్‌), కనమలు (ఐడెంటిఫికేషన్‌ మార్క్స్‌), థెరపీ (గ్యాప్‌), వృత్తి నైపుణ్యం (క్రాఫ్ట్‌ మెన్‌ షిప్‌), పాత్రల స్వభావ పోషణ (కారక్టర్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌), ఉచ్ఛరించే దక్షత (మాడ్యులేషన్‌). ఇంతలోతుగా విశ్లేషించిన డా ఎం వి రమణారెడ్డి ఈ పుస్తకాన్ని ఎలా ముగిస్తారు?
''...తెలుగు సినిమా రంగానికి మన పూర్వులు అందించిన అపురూప వారసత్వాన్ని కొంతవరకు మననం చేసుకుందాం. ఆ ఆస్తిని పెంచకపోయినా ఫరవాలేదు కానీ... కనీసం తరగకుండా కాపాడుకోవడం తరువాతి తరాల బాధ్యత..''
 

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
ఆకాశవాణి పూర్వ సంచాలకులు