బాలుడు :
మా నీటిని మాయ చేస్తావు
మా యేటిని యెండబెడతావు
నువ్వెందు కక్ష కడతావు?
నువ్వెందుకు శిక్ష వేస్తావు?
సూర్యుడు :
మీ నీటిని మూటలు కడతాను
మీ యేటికి ఊటలు పెడతాను
వాన కూనలను పంపించి
మీ మేనుకు స్నానం చేస్తాను!
బాలుడు :
మా గొంతులెండిపోతున్నాయి
మా నూతులింకుపోతున్నాయి
మా పంటలెండి పోతున్నాయి
మా వంటలాగి పోతున్నాయి
సూర్యుడు :
మీ చెంతకు మేఘాలొస్తాయి
మీ నూతులు నింపిపోతాయి
మీ పంటలు యింటికి వస్తాయి
కడుపు మంటను చల్లార్చేస్తాయి
బాలుడు :
గొడుగులు చేతికి యిస్తావు
పిడుగులునే కురిపిస్తావు
మాడు పగలగొడతావు
మా గూడు చెదర గొడతావు
సూర్యుడు :
ఎండకు గాలి సుడులు తిరిగినా
చెట్టుకు బిక్ష పెడతాను
పచ్చని పందిరి వేస్తాను
నులివెచ్చని దుప్పటినౌతాను!
బాలుడు :
ఆకాశంలో దీపంగా
ఆరని మారని దీపంగా
దిన సగభాగం కనిపిస్తూ
దోబూచులాడుతావెందులకు?
సూర్యుడు :
అడవులు నాశం చేసారు
ముడిచమురు మంటలను వేసారు
ప్లాస్టిక్కు పదేపది వాడారు
నా కిరణాల శక్తినే పెంచారు
బాలుడు :
నిజమే నిజమే మా తప్పిదమే
నీరు, గాలి కలుషితమే
పర్యావరణం విష సమమే
పాటిస్తామిక జాగృతమే!
- కిలపర్తి దాలినాయుడు
సాలూరు










