Apr 04,2022 06:57

తాజా ఉదయాలను దోసిళ్ళతో
బొట్టుబొట్టుగా తాగుతూ
ప్రతిదినం మొదలవుతుంది

అప్పుడే పిట్టలు
రెక్కలు విదిలిస్తూ పైకెగసి
ఆకాశాన్ని పాటలతో పలకరిస్తాయి
నగరం నిద్ర దుప్పటిలోంచి
ముఖం బైటపెట్టి
కాళ్ళను కూడదీసుకుంటూ ఉంటుంది
శ్రమదేహాలు పనిలోకి అడుగు మోపుతాయి

మధ్యాహ్నపు వేడిసెగలను ఊదుకుంటూ
ఆలోచనలను పొదుగుతూ
అస్తవ్యస్తమైన గదులకు క్రమశిక్షణ నేర్పుతాను
నగరం అప్పటికి నడకలోంచి పరుగుల్లోకి
పయనమైపోతుంది
పని లోతుల్లోకి పయనించిన దేహాలు
స్వేదాన్ని వర్షిస్తుంటాయి

సాయంకాలపు పల్చని నీడలను
పరికించి చూస్తూ
వాకిలికి చూపులను తోరణాలను చేస్తాను
నగరంతో పాటు దేహాలు కాళ్ళీడ్చుకుంటూ
వెనుకకు మరలుతుంటాయి
పిట్టలు గూట్లో మౌనాన్ని హత్తుకుంటాయి

చీకటిని తరిమేస్తూ దీపాల వెలుగులు
దేదీప్యమానంగా నవ్వుతుంటాయి
నక్షత్రాలు మెట్లెక్కుతూ
చందమామతో చేతులు కలుపుతాయి
అలసి ముడుచుకున్న దేహాల వెన్ను నిమురుతూ
రాత్రి నిశ్శబ్దంగా ఒళ్ళు విరుచుకుంటుంది
నలిగి కమిలిన దేహాలు
కునుకులోయలోకి జారతాయి

కాలం చేతిలో కరిగిన క్షణాలను
బేరీజు వేసుకుని
లోపలి కాంతిని తోడుకుంటూ
ఊహలను పద్ధతిగా పేర్చడంలో నిమగమవుతాను

నగరం కనురెప్పలకు జోలపాడుతున్నపుడు
హృదయపుకొలనులో చిగురులు తొడుకుతూ
తలెత్తిన శ్రమవాక్యం
పురిటికందై ఒడిని నింపుతుంది!
- పద్మావతి రాంభక్త
99663 07777