Apr 18,2022 06:59

పావని ప్రాంగణంలో/ జలతారు తూనీగలు
మబ్బుల పందిరిలో వేడుకగా విహరిస్తున్నై.......
పావని పరిసరాల్లో/ చిలుకా గోరువంకలు
కొమ్మల చాటున కొండాటమాడుతున్నై...
అంటూ స్పందించిన కవి హృదయం హనుమారెడ్డి గారిది. నీరే జగతికి ఆధారమనీ, సకలమానవాళికి నిజమైన జీవితాధారమని గుర్తెరిగిన హనుమారెడ్డి ప్రకృతిలో లభించే నీటి గురించి పావని పేరిట పెద్ద గ్రంథమే రాశారు. గురుగ్రహంలో నీరున్నట్లు 2000 సంవత్సరంలో నాసా ప్రకటించింది. చంద్ర మండలంలో నీరుందని ఇస్రో ధృవీకరించింది. 75 వేల ఏండ్ల నుంచీ మానవుడు నీటిని ఉయోగించుకుంటున్నాడని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఏయే కాలాల్లో నీరు ఏ విధంగా ఉపయోగపడిందీ, ఏయే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో ఎలా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నదీ చాలా విపులంగా, సోదాహరణంగా వివరించారు హనుమారెడ్డి. మానవజాతి వికాసానికి నీరెలా దోహద పడిందీ కూలంకషంగా కళ్లకు కట్టారు పావని గ్రంథంలో. భూమితల్లి అక్షయ పాత్ర అనీ, పావనిది సంరక్షణ పాత్రంటూ నీటికి సరికొత్త నిర్వచనమిచ్చారు ఆయన.

తెలుగు వాళ్లంతా మహాకవిగా కీర్తించే శ్రీశ్రీని మహాకవి అనడం కంటే వర్గకవిగా పిలవడం సమంజసమని సోదాహరణంగా పరిశోధించారు. నైరూప్య, సారూప్య, అవ్యక్త కవితాదృశ్యాల ద్యారా కవిత్వపు విశ్వరూపాన్ని దర్శించినవాడు శ్రీ శ్రీ అని కొందరంటారు. విస్తారమైన కవిత్వ పరిధినీ, దార్శనికతనూ, భాషావైదుష్యాన్నీ, శైలీ విన్యాసాన్నీ సొంతం చేసుకున్నాడు శ్రీశ్రీ. అందుకే శ్రీ శ్రీ కవిత్వం కాలతీతమైనదంటారు. అందుకే కవిత్వంలో శ్రీశ్రీ మార్గం అనితర సాధ్యమంటారు. వర్గకవి శ్రీశ్రీ అనే విమర్శనా గ్రంథంలో తొమ్మిది ప్రతిపాదనల్ని చర్చించి, సామాజిక పరంగానూ, సాంస్కృతిక పరంగానూ, సాహిత్య పరంగానూ, శ్రీశ్రీని శ్రామిక వర్గం పక్షాన నిలిపాడు హనుమారెడ్డి. ఈ గ్రంథం ఎంతో ఆసక్తికరంగానూ, అధ్యయన శీలతతో నిండి, విశ్వవిద్యాలయ పరిశోధనా ప్రమాణాలతో నడిచింది. 18 వ శతాబ్దం దాకా భారతదేశాన్ని పట్టి పీడించిన కన్యాశుల్కం, సతీసహగమనం లాంటి దురాచారాల్ని వ్యతిరేకిస్తూ స్త్రీ విమోచన కోసం ఆనాటి సంఘ సంస్కర్తలు చేసిన రచనల గురించి కూలంకషంగా వివరించారు. మనుస్మృతిలో సతి ఆచారాన్ని చెప్పలేదని సహేతుకంగా వివరించారు. కానీ సతి ఆచారం రానురాను ఒక అమానుష చర్యగా పరిణమించిందనీ, ఈ పరిస్థితుల్లో బెంగాలులో రాజా రామ్మోహన్‌ రాయ్  1818లో సతికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాల ఫలితంగా 4-12-1829 లో సతిని నిషేధిస్తూ ఆ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సును తీసుకువచ్చిందని వివరించారు. చట్టం చేయకుండా కేవలం ఆర్డినెన్సు మాత్రమే తీసుకు రావడానికి కారణం భారతీయుల్లో వ్యతిరేకత వస్తుందని భయపడి ఉంటారన్నారు. అలా చట్టం తీసుకు రాకపోవడం వల్ల రూప్‌ కన్వర్‌ ఉదంతం దాకా అడపాదడపా సతి సంఘటనలు జరుగుతూనే వచ్చాయి. అందువల్ల 1987లో కమిషనర్‌ ఆఫ్‌ సతి యాక్ట్‌ తీసుకువచ్చిందని అంటారు. ఈ చట్టం ప్రకారం సతీసహగమన ప్రయత్నం చేస్తే శిక్ష, సతిని ప్రోత్సహిస్తే శిక్ష, సతిని కీర్తిస్తే సంవత్సరానికి తక్కువ కాకుండా శిక్ష అని పేర్కొనబడింది. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలన్న సామెతను అబద్ధం చేసిన మహిళలు ఈ భారత గడ్డపై చాలామంది ఉన్నారంటూ రుజువు చేసిన ధీరోదాత్త మహిళల్ని గురించి ప్రస్తావించారు హనుమాన్‌ రెడ్డి తన మహిళ గ్రంధంలో.

ఒక కవిని గానీ, రచయితను గాని అంచనా వేయాలంటే అది ఆయన రచనల ద్వారానే. హనుమ రెడ్డి గారిని అంచనా వేయాలంటే ఆయన రచనల్ని పూర్తిగా చదవాలి. ఏ విషయాన్నైనా సునిశిత, పరిశోధనాత్మక అధ్యయనం చేసిన తర్వాతనే గ్రంథస్తం చేయడం ఆయన అలవాటు. భారతదేశంలో అమలులో వున్న నిమ్న కులాల రిజర్వేషన్ల మీద కూడా హనుమారెడ్డి గారికి నిశ్చితాభిప్రాయ ముంది. క్రీమిలేయర్‌ ప్రక్రియను అమలు చేయకుండా నిమ్న వర్గాల అభివృద్ధి సాధ్యం కాదంటారు. 70 ఏళ్లుగా దేశంలోని ఎస్సీ వర్గాల్లోని ఉన్నత శ్రేణిలో రిజర్వేషన్‌ ఫలాలు పొంది అభివృద్ధి చెందినవారే మళ్లీ మళ్లీ రిజర్వేషన్లు పొందడం వల్ల అట్టడుగున ఉన్న మిగతా కులాల వారు అభివృద్ధిని సాధించలేకపోతున్నారనేది ఆయన వాదన. మొదట 10 సంవత్సరాల వరకేనని ప్రారంభించిన ఈ రిజర్వేషన్ల ప్రక్రియ 7ఏ ఏళ్లుగడిచినా పూర్తి అభివృద్ధి జరగలేదని చెబుతూ.. క్రిమిలేయర్‌ నిర్ధారణకు కమిషన్లను వేయమని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన సూచనలను ఉదహరించారు.

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో వెంకటాపురంలో 1941 ఏప్రిల్‌ 24వ తేదీన మామూలు వ్యవసాయ కుటుంబంలో రాఘవరెడ్డి, శేషమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు హనుమారెడ్డి. స్వశక్తితో ఎదిగి ఒంగోలులో లాయర్‌గా ప్రాక్టీసు ప్రారంభించి, సుదీర్ఘ కాలం తిరుగులేని క్రిమినల్‌ లాయర్‌గా ఉన్నారు. వృత్తిలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయనిది. ఆయన రాసిన 'మావూరు మొలకెత్తింది' దీర్ఘకవితలో తన ఊరికి సంబంధించిన అన్ని విషయాల్ని స్పృశించారు. ఒకనాడు రాగద్వేషాల్లేకుండా సాగిన గ్రామీణ చిత్రాలు, ఆ తరువాత ఉప్పెనలా వచ్చి పడ్డ పాశ్చాత్య ధోరణీ, ప్రపంచీకరణ పోకడల వల్ల ఎలా ఛిద్రమైపోయాయో కూలంకషంగా వివరించారు. సుమారు 55 సంవత్సరాల న్యాయవాద వృత్తి నేర్పిన అనుభవంతో నిలువెత్తు పుస్తకాల్ని రచించారు. 1999లో ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైన తొలినాళ్లలో ఆయన సాహిత్య సృజన తక్కువే. అనతికాలంలోనే వెన్నెల పువ్వు, పల్లెకు దండం పెడతా, మావూరు మొలకెత్తింది, గుజ్జనగూళ్ళు, వీక్షణం, వెన్నెల గీతం, మూన్‌ లైట్‌ మెలోడీస్‌ (అనువాదం) లాంటి రచనల్ని చేసి ప్రచురించారు. కవిగా ఒక స్థాయికి చేరుకున్న తరువాత పావని, వర్గకవి శ్రీశ్రీ, మహిళ, విద్యార్థి రాజ్యాంగం, రిజర్వేషన్లు, రెడ్డి వైభవం, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, అంతర్వాహిని (నా కథ) లాంటి 14 గ్రంధాల్ని వెలువరించారు. తనలో ఉన్న కవి హృదయాన్ని, సమాజం పట్ల ఆయనకున్న దృక్పధాన్ని ఈ పుస్తకాలు మనకు పట్టిస్తాయి. ఇటు సాహిత్యాన్నీ, అటు వృత్తి ధర్మాన్నీ సమాన దృష్టితో చూస్తూ వచ్చిన సవ్యసాచి హనుమా రెడ్డి ... తనకెంతో ఇష్టమైన ప్రకాశం జిల్లా రచయితల సంఘం మహాసభలు జరుగుతున్న సమయంలోనే (19-01-2020) వేలాదిమంది సాహిత్య మిత్రులను ఉదు:ఖంలో ముంచి హఠన్మరణం చెందారు. వారి నిష్క్రమణ తెలుగు సాహిత్యానికి తీరని లోటు.
 

(ఏప్రిల్‌ 24 : హనుమారెడ్డి జయంతి)
- ఆవుల వెంకట రమణ
94940 88110