ఈతరం కవుల్లో కవిత్వం తరిగిపోయిందని, సాంఘిక మాధ్యమాల వెల్లువలో వాక్యం పలచబడిపోయిందని, లైకులు -కామెంట్ల మోజులో కొత్త పాళీ కొట్టుకుపోతుందని నిరాశపడే నిన్నటి తరం ఇక నిశ్చింతగా ఉండొచ్చు. ఈ తరంలోనూ చిక్కని కవిత్వాన్ని రాసే నాగజ్యోతి శేఖర్ లాంటి కలాలున్నాయి. కవిత్వంలో కవిత్వం కోసం ఇక వెతుక్కోనక్కర్లేదు. ఆమె తొలి కవితా సంపుటి 'రెప్పవాల్చని స్వప్నం' రేపటికి వాగ్దానం.
నిజానికి ఆమె ఇప్పటి అక్షరం కాదు. రెండు దశాబ్దాల కిందటే మొలకెత్తిన కవిత్వపు చెట్టు. డాక్టర్ కావలసిన జ్ఞానం దిశ మార్చుకుని అక్షరాల ప్రవాహం కావడం వల్ల సాహిత్యానికి మేలే జరిగింది. అడుగడుగునా వివక్షరోగంతో బాధపడే సమాజానికి కవిత్వ వైద్యం చేయగలుగుతోంది. ఇరవై ఏళ్ళ కృషిని పుస్తకం చేసి.. 'రెప్పవాల్చని స్వప్నం'గా మన ముందుకొచ్చింది.
అర్ధశతకానికి సరిగ్గా ఒక్క కవిత తక్కువున్న పుస్తకాన్ని చదువుతుంటే, దట్టమైన కవిత్వపువనంలోకి ప్రవేశిస్తున్నట్టు ఉంటుంది. ఎక్కడా పొడివాక్యం అనే ఎండు చెట్టు కనబడదు. నిండుగా మెటాఫర్ల పువ్వులతో కళకళలాడే పచ్చని చెట్లే కనబడతాయి. వాన నక్షత్రాలు, చీకటి పిట్టలు పొడిచిన మాంసపు ఉదయాలు, సాయంత్రపు పిట్టలు, రాత్రి చెట్లు, పట్టుదల చీరలు, దేహపుష్పాలు, భయం తెడ్లు.. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక చిత్రాన్ని చెక్కి రంగులద్ది గోడలకు వేలాడదీసిన తడి ఆరని దృశ్యాలు.. మెత్తగా మనలోకి నడుచుకొచ్చి మనలోని మనిషిని తడిమి వెళతాయి. ఆమె స్వప్నం మనల్నీ రెప్పవాల్చనివ్వదు.
రెప్పవాల్చని స్వప్నం ప్రధానంగా స్త్రీకేంద్రక కవిత్వం. 'నిన్ననే పలకరించిన ఉదయాలను ఉరేస్తుంటే/ మొన్నటి ఉమ్మనీట్లో చీకటి రాత్రులే/ సురక్షితమన్న నమ్మకం/ గడప దాటాలంటే వణికే ఆకాశంలో సగం' (నేనో అనామిక) అని వాస్తవాన్ని చిత్రిస్తారు. 'నిద్ర కూడా ఓ కలే నాకు/ ఒక్కసారైనా/ పని సూరీడు చొరబడని విశ్రాంతి చీకటిని/ కనుపాపుల్లో నింపుకోవాలి' (నిశి దోచిన స్వప్నాలు) అని తనను తాను ఓదార్చుకుంటారు. 'ఒక్కసారైనా/ వంటింటి చెప్పుల్ని విడిచి/ నగపాదాలతో పచ్చని పచ్చికలో పరుగులు తీయాలి' అన్నప్పుడు ఆమెది ఒంటరి గొంతులా అనిపించదు. కోట్ల గొంతుల ప్రతినిధిగా కనిపిస్తారు.
'శకలాలైన/ ఆమె ఉనికి గ్రహం/ కన్నీటి కృష్ణబిలాల లోలోతులకి జారిపోయి/ జాడలేకుండా పోయింది' (ఇప్పుడో గ్రహణం కావాలి) అని తేల్చేస్తారు. 'అయినా/ నీకూ నాకూ పోలికే లేదు/ నీది స్త్రీ పురుషులుగా విడిపోయిన బేధ ప్రపంచం/ నీ పెదవంచులు మాత్రమే ఉచ్చరించే/ ఆకాశంలో సగానికి అచ్చంగా సమానత్వ భాగమిచ్చే/ స్వచ్ఛపు మూడో ఆకాశం నేను' (మూడవ ఆకాశం). అమ్మతనాన్ని పీల్చే రుధిరముళ్ళను విరిచి/ నువ్వొచ్చిన గర్భాలయం ఎదుట/ ఒక చిన్ని సంస్కార దీపం వెలిగించు చాలు (ఒకానొక బాధిత గేయం) అని ఆకాంక్షిస్తారు.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే వివక్ష, సమస్యలు, సవాళ్ళూ చిత్రించడంతోనే ఆగిపోకుండా గురి తప్పని ప్రశ్నల్నీ సంధించారు. 'యుద్ధం నాకేం కొత్తకాదు గానీ/ భూమి నీది నాది అయినప్పుడు/ నేను మాత్రమే/ మొలకెత్తేందుకు పోరాడడమేమిటి / ఆకాశం నీది నాదీ అయినప్పుడు/ నేను మాత్రమే ఉదయించడానికి/ పెనుగులాడడమేమిటి? (అనివార్యం) అని సూటిగా అడుగుతారు. 'అనివార్యం' ఒక సమగ్ర కవిత. వర్తమాన మహిళ అనుభవిస్తున్న ప్రతి కష్టాన్నీ ఏకరువుపెట్టి, సమాజాన్ని నిలదీసి, తనను తాను సమాళించుకుని, చివరికి ఒక హెచ్చరికతో కవితను ముగిస్తారు. 'యుద్ధం నాకేం కొత్తకాదు/ కానీ/ ముగింపుపేజీపై నా సంతకం పాతబడేదెప్పుడనీ/ యుద్ధవస్త్రాలు విడిచి/ నన్ను నేను ధరించేది ఇంకెప్పుడని/ ఇన్నాళ్ళూ/ నీకు/ నీతి నేర్పితే చాలనుకున్నాను/ తప్పదు/ కాలం పుస్తకంలో/ కొత్త వాక్యమొకటి/ రాసుకోవాలని తెలుసుకున్నాను/ ఇప్పుడే/ 'నిర్భయంగా'/ నా 'దిశ'ను మార్చుకుంటున్నా!// ఇప్పుడు యుద్ధం ఎవరిదో/ తేల్చుకో!' అంటారు. ఈ కవితలో అన్ని దినుసులూ ఉన్నాయి. సుతిమెత్తగా మొదలుపెట్టి దృశ్యం తర్వాత దృశ్యాన్ని చూపెడుతూ ... ఒకానొక తీవ్రతతో కంపించజేసి, ముగింపు ముంగిట వదిలిపెట్టే ప్రసాదమూర్తి కవిత్వంలా అనిపిస్తుంది.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద రుగ్మత కులం. కవయిత్రి కులం మూలాల్లోకి పోయి ప్రకటించిన కవిత - 'ఆ ఒక్కటే'. ' అవును!/ నీ బలమంతా నీ పుట్టుకలోనే ఉంది/ పుడుతూనే అహం నీ కోట/ అణచివేత నీ మొదటిమాట/.... నీ బలం/ ఆకలిని చెట్టుకు కట్టేసి చంపుతుంది/ నీళ్ల చెరువుని గొయ్యితీసి పాతేస్తుంది/... నీ బడ్డుతాడు కోసిన దాసీ/ నిన్నెత్తుకున్న నిరుపేద భుజాలు/ నీ సంపద పెంచిన నెత్తుటి చుక్కలు/ నీ దాహం తీర్చిన దేహాలూ/ పుట్టుకలోనే బలహీనమవ్వడం/ నీ బలమైంది/ అవును నీ బలమంతా కేవలం/ పుట్టుకలోనే ఉంది.' ఈ కవిత చదివాక ఆత్మవిమర్శ మొదలవుతుంది. కొందరికి ఎండ్లూరి సుధాకర్ గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవ్వాళ ప్రాణానికి మించిన అనిశ్చితి మరేదీ లేదు కానీ, ఈ కవిత మాత్రం వందేళ్లు బతుకుతుంది.
రైతు తరపున వాక్యం రాయడం ప్రతి కవి/ కవయిత్రికి ఒక అనివార్యత. కనీస కృతజ్ఞత. 'సంతాప సభ', 'ఎరుపెక్కిన మట్టి' కవితలలో ఆకలి తీర్చిన మట్టివేళ్ళకు కవయిత్రి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. 'కిక్కిరిసిన మీ అభివృద్ధి ఇళ్ల మధ్య/ గుప్పెడు మట్టితడి కనిపిస్తే చెబుతారా/ లోకం ఆకలితీర్చే సేద్యపు పాటకటి నాటి వెళతా/ ఎన్నటికీ వాడని మట్టిచిగుళ్ల/ గేయమొకటి మీటి పోతా' అంటూ ఆకుపచ్చ కవిత్వం రాస్తారు.
'లిపి చెరపబడ్డ భాష' ఒక అస్తిత్వపోరాట గీతం. 'ఎవరికీ చూపని కొన్ని అక్షరాలున్నాయి/ వాటి నగదేహాల నిండా సమ్మెటపోట్లు/ ఎవరూ చూడని కొన్ని/ వెలేసిన వర్ణమాలలు ఉన్నాయి/ వాటి శ్వాసల నిండా దహనమైన స్వప్నాల కమురుకంపు' .... 'నిషేధించబడ్డ జీవిత పుస్తకాల్లో/ ఎవరూ స్ప ృశించని కొన్ని ఒంటరి అక్షరాలున్నాయి/ లిపి చెరపబడ్డ భాషా గోసలున్నాయి' ... 'నిన్నూ, నన్నూ నిత్యప్రశ్నలై దహించే/ రగులుతున్న కోట్ల గుండెకాగడాలున్నాయి'.
కొన్ని కవితలలో కవయిత్రి ఎంచుకున్న కథన పద్ధతి బాగా పడింది. 'పుస్తెలతాడు' కవితలో నిజానికి ఒక కథ రాయడానికి కావాల్సినంత సరంజామా ఉంది. డ్రామా ఉంది. వేదన ఉంది. కేవలం కవితే అయితే పర్లేదు. అది కవయిత్రి జీవితం అయితే మాత్రం అంతకంటే విషాదం మరొకటి ఉండదు. ఆరుగురు విద్యార్థులు గోదారికి బలైన తర్వాత నిర్మించబడిన వంతెన నేపథ్యంలో రాసిన 'స ్మృతిచిహ్నం' కవిత మనసును బరువెక్కిస్తుంది. నోస్టాల్జియా కవితలైనప్పటికీ.. నాన్న పడక్కుర్చీ, పుట్టినిల్లు, ఆమె చేతి నక్షత్రం, తల్లివేరు, అతను - ఆమె వంటి కవితలు ప్రతి పాఠకుడికీ ఎప్పుడోసారి తారసపడిన అనుభవాలే. ఈ వాక్యాలతో తాదాత్మ్యం చెందని హదయాలుండవు.
కొన్ని కవితలలో ఎత్తుగడ వాక్యంతోనే వస్తువును ప్రవేశపెట్టడాన్ని గమనిస్తాం . 'నిశి దోచిన స్వప్నాలు' కవితలో నిద్ర కూడా ఓ కలే నాకు అని ఎత్తుకుంటారు. ఆ ఒక్క వాక్యంతో పాఠకుడు వస్తువు యొక్క స్పృహలోకి వచ్చేస్తాడు. 'కొత్త బారసాల' అన్న కవితలో కూడా అంతే. నా బాల్యం ఎక్కడో తప్పిపోయింది అనే వాక్యం చదవడంతోనే అలర్ట్ అయిపోతాం. మరో కవితలో చినుకు మాట్లాడుతూనే ఉంటుంది (చినుకు మాట) అని మొదలు పెడతారు. చినుకు మాట్లాడడమేమిటి అన్న ఆసక్తితో పాఠకుడు కవితలోకి జరబడతాడు. అయితే వీటికి భిన్నంగా వస్తువు కోసం వెతుక్కుని.. కవయిత్రి కలిగించిన అనుభూతి ప్రకంపనల ద్వారా వస్తువును గ్రహించి.. ఆనందించే కవితలూ ఉన్నాయి. 'నువ్వెళ్ళిపోయాక' కవిత చదువుతున్నంత సేపూ కవయిత్రితో గాఢమైన అనుబంధం ఉన్న వ్యక్తి ఎవరో దూరమయ్యారనే అనిపిస్తుంది. మరోసారి చదివితో తప్ప.. వస్తువు 'పుస్తకం' అని బోధపడదు.
కరోనా మొదటి విధ్వంసకాలంలో దేశానికి గొళ్ళెం పెట్టినప్పుడు... సామాజిక బాధ్యత గల అద్భుత స్పందన - 'అరుదైన సమయం'. రైతు చట్టాల మీద వ్యతిరేకతను ఒక జ్వాలలా వెలిగించిన కవిత - 'సంతాప సభ'. ఈ కవితలో కవయిత్రి అసహనం కట్టలు దాటి, 'నా దేశ పైరుపంటల్లారా రండి/ సామూహిక ఆత్మహత్యాయత్నం చేసి/ అతనికి తోడవుదాం// మెతుకు విలువ తెలియని ఈ జగతికి కన్నీటి సంతాప సందేశం ఒకటి వినిపిద్దాం' అనంటారు.
ఈ సంపుటిలో ఒకసారి పైపైన చదివేసి వదిలేసే కవితలేవీ లేవు. ఆఖరికి నిర్మాణపరంగా అంత గట్టిగా లేని 'వార్తలకావలి వ్యక్తి' కవితలో కూడా.. 'ఏ తండ్రి వెతల్ని భాగించాలని ఆ భుజాలు/ బాధ్యతలకట్టల్ని మోస్తున్నాయో/ ఏ చదువులమెట్లు ఎక్కాలని ఆ పాదాలు/ ప్రతి గడపా ఎక్కి దిగుతున్నాయో' అనే వాక్యాలు కళ్ళను తడిచేస్తాయి. ఈ కవయిత్రి తన కవిత్వంతో ఎంతో భరోసానిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం లేదు. రెప్పవాల్చని స్వప్నం కవిత్వానికి చిరునామా. కొన్ని కవితలలో వాక్యాలు సరైన చోట బ్రేక్ అవలేదు. ప్రూఫ్ రీడింగ్‌లో గోరంత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది. ముఖచిత్రం - నిస్సందేహంగా - ఒక రాయని కవిత. ప్రతుల కోసం కవయిత్రిని 94921 64193 నెంబర్లో సంప్రదించవొచ్చు.
- సాంబమూర్తి లండ
96427 32008










