మానవ సమాజం ఇపుడున్న దశకు చేరటానికి చేసిన మహాప్రస్థానంలోని వివిధ మజిలీల్లో చోటు చేసుకున్న పరిణామాలేమిటో చెప్పాలంటే ఎంతో నిజాయితీ ఉండాలి. అంతకుమించి ఓర్పు ఉండాలి. అలాంటి నిజాయితీ, అంత ఓర్పు ఉన్నవాడు మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్. ఆయన జయంతి సందర్భంగా 09 -04 -22 శనివారం నాడు కాకినాడ దంటు కళాక్షేత్రంలో రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య, సాహితీ స్రవంతితో పాటు వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో కలిసి రాహుల్ సాంకృత్యాయన్ జీవిత సాహిత్యాలపై ఒక రోజంతా సెమినార్ జరిగింది. ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినవారు రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు గౌరవ్, విశ్రాంతాధ్యాపకులు కట్టా కృష్ణారావు, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గనారా.
ఆరోజు ఉదయం 9.30 గంటలకు ప్రజానాట్యమండలి వారి చైతన్య గీతాలతో సభ ప్రారంభమైంది. అనంతరం డాక్టర్ చెలికాని స్టాలిన్ రాహుల్జీని గురించిన ముందు మాటలతో సభా ప్రారంభం చేశారు. లంచ్ వరకూ రెండు, తరువాత రెండు విభాగాలుగా మొత్తం 4 సభలు జరిగాయి. సుమారు 300 మంది శ్రోతలు వక్తల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు.
మొదటి సభలో తెలుగులో రాహుల్జీ సాహిత్యం - ఆలూరి భుజంగరావు కృషి గురించి మాట్లాడారు. ఈ సభకు విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ భారతలక్ష్మి అధ్యక్షులుగా, భుజంగరావు గారి అమ్మాయి కవిని ప్రధాన వక్తగా వ్యవహరించారు. యాత్రా సాహిత్యానికి సాహిత్యంలో ఒక స్థానాన్ని కల్పించినవారు రాహుల్ సాంకృత్యాయన్ అని సభాధ్యక్షులు భారతలక్ష్మి అన్నారు. రాహుల్ ప్రయోజనకరమైన యాత్రా సాహిత్యాన్ని రచించారని అన్నారు. ప్రధాన వక్త కవిని ఆలూరి మాట్లాడుతూ ... సుమారు 150 వరకు ఉన్న రాహుల్ గ్రంథాల్లో 20 వరకు తెలుగులోకి అనువాదం అయ్యాయని, అందులో 1.ఋగ్వేద ఆర్యులు, 2. విస్మృత యాత్రికుడు, 3. ఓల్గా సే గంగ, 4. జయ యౌధేయ, 5. మధుర స్వప్నం, 6. దివోదాసు, 7. వైజ్ఞానిక భౌతికవాదం, 8. దిగ్దర్శన్ (భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనం) గ్రంథాలను ఆలూరి భుజంగరావు అనువదించారని అన్నారు. మూల రచయిత భావాన్ని యథాతథంగా స్వీకరిస్తూ, భుజంగరావు గొప్పగా అనువదించారని ఆమె అన్నారు. 'చారిత్రక నవలను పాఠకుల్ని రంజింపజేసేటట్లు రాయటం సామాన్య విషయం కాదు. రాహుల్జీ అలా రాసారు. 95% యథార్థాన్ని, 5% కల్పనల్ని జోడించి రాశారు. మధుర స్వప్నంలో చెప్పిన అనేక భావాలు ఇప్పటికీ కమ్యూనిస్టుల భావజాలాల ముందు నిలబడతాయి. స్త్రీలపట్ల అణచివేత ఉండకూడదనే భావం ఇందులో కనిపిస్తుంది. లోకసంచారం అనేది మనిషిని ఉన్నతుడిని చేస్తుంది. బుద్ధుడూ ఇదే చెపుతాడు. ఇప్పటి యువతరం కంప్యూటర్లకూ, సెల్ ఫోన్లకూ అతుక్కు పోతున్నారు. వారు సంచారతత్త్వాన్ని అలవరచు కోవాలి. అప్పుడే అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది' అన్నారు కవిని.
రెండవ సభలో భారతదేశంలో బౌద్ధవ్యాప్తి- రాహుల్జీ పాత్ర గురించి చర్చించారు. ఈ సభకి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోస్యుల కృష్ణబాబు అధ్యక్షత వహించగా, బుద్ధ భూమికి చెందిన బుర్రా గోవర్ధన్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. ''రాహుల్జీ హిందూ మతాభిమానిగా జీవితాన్ని ప్రారంభించి, తరువాత హేతువాదిగా మారి, ఆపై మార్క్సిస్టుగా జీవనయానం సాగిస్తూ, బుద్ధిజం వైపు అడుగులు వేసారని, బౌద్ధునిగా విస్తృత యాత్ర సాగించారని...'' కృష్ణబాబు అన్నారు. ప్రధాన వక్త బొర్రా గోవర్ధన్ తన ప్రసంగాన్ని 1. రాహుల్ బుద్ధిజంలోకి వచ్చిన నేపథ్యం. 2. రాహుల్ బౌద్ధ గ్రంథాలు, 3. బాబా సాహెబ్ అంబేద్కర్‌ని గురించి రాహుల్ సాంకృత్యాయన్ చెప్పిన అంశాలు... అనే మూడు విభాగాలుగా చేసుకొని మాట్లాడారు. ''రాహుల్ తన 29వ యేట బౌద్ధంలోకి వెళ్ళారు. అంబేద్కర్ గాని, రాహుల్ గాని బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించారు గాని ఏ ఒక్క బ్రాహ్మణుడినీ విమర్శించలేదు. గాంధీజీతో కొన్ని విషయాల్లో విభేదించినా ఆయన్ని గౌరవించేవారు. గాంధీ మరణ వార్త విని సిగరెట్ కాల్చటం పూర్తిగా మానేసారు.'' అని చెప్పారు. రాహుల్ దృష్టిలో అంబేద్కర్ 'భారత సద్ధర్మ భాగ్యజ్యోతి' అని, మతోన్మాదులకు ఎదురు నిలబడి సమర శంఖాన్ని పూరించిన విరాట్ స్వరూపుడు' అని గోవర్ధన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రపంచానికి బుద్ధుడు, ఆయన ధర్మాలు అవసరమయ్యాయని అన్నారు. అనంతరం రాహుల్ సాంకృత్యాయన్‌పై గౌరవ్ సంపాదకత్వంలో, 25 మంది పరిశోధక విమర్శకులు రాసిన వ్యాస సంకలనాన్ని జెవివి రాష్ట్ర నాయకులు జి.మురళీధర్, సమతా మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు పి.రాధారాణి తదితరులు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని లెనిన్‌బాబు పరిచయం చేశారు.
మూడవ సభలో 'భారతీయ తాత్త్విక చింతన- రాహుల్జీ ప్రాసంగికత..' పై మాట్లాడారు. అధ్యక్షునిగా అద్దేపల్లి ప్రభు వ్యవహరించగా, ప్రధాన వక్తగా వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ప్రసంగించారు. 'రాహుల్ ఒక ఐంద్ర జాలిక రచయిత. ఆయన అక్షరాల వెంట మన కళ్ళు పరుగులు పెడుతుంటే మనకు మైకం కమ్ముకొంటుంది. ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. ఈ సంఘ పరివార్ పాలనలో రాహుల్ రచనలు మనకు మరింత అవసరం. ఆయనను ఎంత పరిచయం చేసినా సరిపోని అసాధ్యమైన మనిషి. 'మేరీ జీవన యాత్రా' అనే శీర్షికతో ఆయన స్వీయ చరిత్ర రెండు విభాగాలుగా వచ్చింది. మూడు వేల పేజీలతో, 5 సంపుటాలలో విస్తరించిన ఆయన జీవితాన్ని ఒక్క గంటలో పరిచయం చెయ్యటం అసాధ్యం. బండ్ల పల్లె ఓబుల్ రెడ్డి 'మహౌన్నత మానవుడు రాహుల్ సాంకృత్యాయన్' అనే పేరుతో 187 పేజీల్లో రాహుల్ జీవిత చరిత్రను వివరించారు. ఆయన జీవన తాత్త్వికత ఇవ్వాళ్టికీ అనుసరించవలసి అవసరం చాలా ఉంది. ఆయన రచనల్లో ఎక్కువ భాగం జైల్లో ఉండే రాసారు. 1942 నాటికి దేశంలో గతి తార్కిక భౌతికవాదంపై స్వతంత్ర రచన లేదు. రాహుల్ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని 3 అధ్యాయాలతో ఒక పుస్తకం రాసారు. ఇవ్వాళ సంఘపరివార్ ఏ వాదనలు చేస్తోందో వాటినన్నిటినీ రాహుల్ చెప్పారు. రాజదండన కూడా పనిచెయ్యనంత కట్టుదిట్టంగా ప్రజల్ని అణచి ఉంచటానికి మతం పని చేస్తుందని రాహుల్ అంటారు. 'దర్శన్ - దిగ్దర్శన్' గ్రంథంలో పునర్జన్మవాదం అనేది బౌద్ధంలోకి బ్రాహ్మణ్యం ప్రవేశ పెట్టిందంటారు రాహుల్. పరలోక వాదం కంటే పునర్జన్మ వాదం సమాజానికి మరీ నష్టాన్ని కలుగజేస్తుందంటారు. పునర్జన్మ వాదం, కర్మ సిద్ధాంతం ఈ రెండూ దేశానికి పట్టిన చీడలుగా భావిస్తారు. తత్త్వశాస్త్రం ప్రశ్నించటం నేర్పుతుంది. మతం ప్రశ్నించటాన్ని చంపేస్తుందంటారు. ఇవ్వాళ కులాల, మతాల పాలన జరుగుతున్న వేళ... మతం పట్ల, కులం పట్ల మనం తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలు రాహుల్ గ్రంథాల్లో కనిపిస్తాయి. ఆయన ఈనాటికీ ఆయన ప్రాసంగికుడిగా ఉన్నాడు' అని వివరించారు వేణుగోపాల్.
నాల్గవ సభ 'రాహుల్జీ జీవన స్ఫూర్తి - ఈనాటి తరాలకు దిక్సూచి' అంశంపై సాగింది. ఈ సభకు డాక్టర్ కాళ్ళకూరి శైలజ అధ్యక్షత వహించగా, సాంస్కృతిక కార్యకర్త దేవి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ రాహుల్ జీలా ప్రశ్నించటం, కష్టపడటం, భద్రపరచటం నేటి యువత అలవరచుకోవాలని అన్నారు. ప్రధాన వక్త దేవి... రాహుల్ నేటి యువతకు ఎలా దిక్సూచో ఉదాహరణలతో వివరించారు. 'రాహుల్‌ని చదివాక ఎవ్వరైనా అతనితో ప్రేమలో పడకుండా ఉండలేరు. జీవితంలో మనం ఎదురుదెబ్బలు తిన్నప్పుడు, దు:ఖం నుంచి కోలుకోవాలనుకొన్నప్పుడు రాహుల్‌ని చదవాలి. ఆయన చారిత్రక నవలల్లో చరిత్ర నుంచి వైదొలగిపోయేంతటి కాల్పనికత ఉండదు. జయ యౌధేయలో తండ్రి కొడుక్కి చెపుతున్నట్లుగా ... ''నువ్వు వేటకి వెళ్ళినపుడు నీ బాణానికి ఒక మృగం చనిపోతే నువ్వు అందర్నీ పిలిచి చెప్పాలి. గెలిచింది, పడగొట్టింది నువ్వే కావొచ్చు, కాని వందమంది వేటగాళ్ళు ముందుగా దాన్ని అలవగొట్టేరు. కాబట్టి నువ్వు కొట్టగలిగావు...' అన్న భావజాలాన్ని యువతకు ఎక్కిస్తాడు. జీవితాన్ని ప్రేమించడం నేర్పాలంటే రాహుల్జీని చదవాలి. ఏ యువతరం అయితే పక్క మతం మీద దాడి చెయ్యాలన్న భ్రమలో కొట్టుకుపోతోందో అటువంటి యువతరాన్ని మంచివైపు మలచటం కోసం రాహుల్జీని చదవాలి.' అని దేవి వివరించారు.
ప్రసంగానికీ ప్రసంగానికీ మధ్యలో కొందరు రాహుల్ అభిమానులు రాహుల్జీని గురించి తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. వారిలో మార్ని జానకి రామ చౌదరి, వేణుగోపాల వర్మ, బెందాళం కృష్ణారావు, డాక్టర్ చల్లా రవికుమార్, కెఎంఎం ఆర్.ప్రసాద్, ఎమ్‌ఎస్‌విఎస్‌పి.వర్మ, గనారా తదితరులు ఉన్నారు. చివరిగా రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు గౌరవ్ మాట్లాడుతూ.. మూడు వేల పేజీలతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆత్మకథ రాసిన మహౌన్నత వ్యక్తి రాహుల్జీ అన్నారు. కట్టా కృష్ణారావు వందన సమర్పణ చేస్తూ.. చినుకూ చినుకూ కలిసి ప్రవాహం కావాలి అన్న ఉద్దేశంతో అన్ని సంస్థల్ని కలుపుకొని ఈ బృహత్కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చెయ్య గలిగామని అన్నారు. విశ్వశ్రేయస్సే పరమావధిగా భావించిన రాహుల్జీ నేటి సమాజానికి, సమస్యలకీ వెలుగు దారి చూపే దీపస్తంభం. ఆయన జీవిత సాహిత్యాలకు ఈ సాహిత్య సదస్సు అద్దం పట్టింది.
- డాక్టర్ జోస్యుల కృష్ణబాబు,
98664 54340










