లోకం విసిరిన చీకట్లను ఛేదిస్తేనే
తూరుపు వాకిట ఆశల పొద్దు పొడిచేది!
తీరం చేరే కెరటపుటంచుల్లోనే
ఆవేశం పట్టుదలై ప్రభవించేది!
మున్నీటి మౌనం
కన్నీటి గుండెల్ని బద్దలు చేసిన నాడే
బతుకున అర్థం ధ్వనించేది!
శోకం తీర్చగ ఏకం కాగలిగిన నాడే
కోర్కెల శిశిరం వసంతమై చిగురించేది!
పోరాట వీచిక అభ్యుదయ
రాగమాలికయై పల్లవించగా
ఆశయ సాధనతో శృతి కలప వేల?
నియంతృత్వ నీడల్లో స్వేచ్ఛను కోల్పోయి
నిరాశల పంజరాన ఆ.... దైన్యం నీకేల?
భూషణ కాంతుల మధుర స్వప్నం
సత్యదూరం కాదంటూ ధైర్యంగా కదలి రావేల?
రాజ్యాంగ పుటలను
సైకత శిల్పాలుగా నిత్యం కూల్చేస్తూ
స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య దేశాన
అప్రజాస్వామిక విధాన
కాదేదీ అమ్మకానికి అనర్హమంటూ
దేశమాత దేహాన
శోభించే ఆస్తుల ఆభరణాలను సైతం
ఒక్కొక్కటిగా అమ్మేస్తూ
అదే 'దేశ భక్తి'యని నమ్మకంగా నమ్మిస్తూ
భావి తరాలను ప్రపంచీకరణ భూతానికి
త్రికరణశుద్ధిగా బలి చేస్తూ
కార్మిక- శ్రామిక శ్వాసనే నిస్సిగ్గుగా నియంత్రిస్తూ
'విధ్వంసకర' విత్తుల్ని మొలకెత్తిస్తుంటే
అలసత్వమదియేల?
రా! కదలి రా! అంటూ సమర శంఖం పూరిస్తూ
పోరుబాటలో నినదిస్తూ చైతన్యమై ప్రజ్వరిల్లుతూ
వేయి ప్రశ్నల వెల్లువై
నియంతల వెన్నులో వణుకు పుట్టించవేల?
చేయి చేయి కలిపి ఒకరికొకరై నిలిచి
సామూహిక శ్రమైక నదిగా
జన జలపాతమై ప్రవహిస్తే-
కడలే కలవరపడదా?
పగలే వెన్నెలై జగమే సంబరపడదా?
(సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా)
- నాగభూషణ్ పాఢ
86887 78228










