న్యూయార్క్ : త్వరలో టెస్లా కార్యకలాపాలను భారత్‌లో ప్రారంభించనున్నట్లు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన న్యూయార్క్‌లో టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీతో భేటీ అద్భుతంగా జరిగిందని, ప్రధాని అంటే తనకు అమిత ఇష్టమని అన్నారు. ఈ సందర్భంగా మోడీపై ప్రశంసలు కురిపించారు. ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. భారత భవిష్యత్‌పై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. భారత్‌పై ప్రధాని మోడీకి చాలా శ్రద్ధ ఉందని, దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మోడీ కొన్ని సంత్సరాల క్రితం తమ ఫ్యాక్టరీని సందర్శించారని అన్నారు.
భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, దీనిపై త్వరలో ప్రకటన వెలువడుతుందని మస్క్ స్పష్టం చేశారు. మస్క్‌తో భేటీ గొప్పగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇంధనం నుంచి ఆధ్యాత్మికత వరకు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వివిధ రంగాల్లో సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి మస్క్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో అవకాశాలను అందింపుచ్చుకోవాల్సిందిగా మస్క్‌ని ఆహ్వానించినట్లు తెలిపారు. 2015లో ప్రధాని మోడీ మస్క్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాలిఫోర్నియాలోని టెల్సా ఫ్యాక్టరీని సందర్శించారు.










