అలసట చెందిన కాయం
శయనమందిరానికి చేరినప్పటికి
ఆలోచనల జడి జ్ఞాపకాల తడిని ఆరనివ్వట్లేదు..
నిద్ర కరుణించకపోయినా
మెలకువ భుజంపై చెయ్యేసి
నేనున్నా ఏం పర్లేదని ధైర్యాన్నిస్తోంది..
మరీ అంతగా గాకపోయినా
ఓ మోస్తరుగా వణికిస్తున్న చలిని పారదోలడానికి
రేయి చీకటి దుప్పటిని తనపైకి లాక్కొంటోంది..
చంద్రుడు చుక్కల మధ్య
కొలువుదీరి వెన్నెల మంత్రమేసి
విరహ వేదనను తట్టిలేపుతూ
నవ హృదయాల నడుమ చిచ్చు రేపుతున్నాడు..
కాలం కన్నీరై కరిగిపోతున్నప్పటికి
చెదిరిన హృదయంలో
చెదరని స్వప్నం చెక్కుచెదరక
ఇంకా అలాగే నిలిచి ఉంది
రాత్రి క్రమంగా చుక్కల చూరును పట్టుకుని
మెల్లిగా కిందికి కారిపోతోంది..
ఉదయం రేయిని మింగడానికి
రాహువై సమీపిస్తోంది..
సాకారం కాని స్వప్నం
ఆకారం దాల్చని అభిలాషని
పదిలంగా పట్టుకున్నందున
నిద్ర దరికి చేరక దూరపు కొండల్లోకి దూరిపోయింది
- సర్ఫరాజ్ అన్వర్
94409 81198










