Sep 10,2023 16:25

ఢిల్లీ : భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక సూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్‌ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గోన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృంద అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు ఉండటం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు. 'గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాలను వెల్లడించారు. సూచనలు, అనేక ప్రతిపాదనలు అందించారు. వాటిని నిశితంగా పరిశీలించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని' మోడీ పేర్కొన్నారు.