కవీ నీ గళ గళన్మంగళ
కళా కాహళ హళా హళిలో
కలిసిపోతిని! కరిగి పోతిని!
కానరాకే కదిలి పోతిని!
శ్రీ శ్రీ రాసిన స్విన్ బర్న్ కవికి అనే ఈ కవితను మొట్ట మొదటిసారి కడియాల రామమోహనరాయ్ గారి నోటి నుంచి విన్నాను. అది శ్రీశ్రీ గురించో, తెలుగు కవిత్వం గొప్పదనం గురించో చెప్పే సందర్భం కాదు. 1983లో డిగ్రీ ఫస్టియర్ జనరల్ తెలుగు క్లాస్ జరుగుతోంది. వెనక బెంచీలో కూర్చున్న కొందరు మాట వినకుండా అల్లరి చేస్తున్నారు. సాధారణంగా అయితే అల్లరి చేసేవాళ్లను బయటకు వెళ్ళమని చెప్పో, లేదా వాళ్ళని అలా వదిలేసి వినేవాళ్ల కోసం తన మానాన తాను పాఠం చెప్పడమో చేసేవారు రాయ్ గారు. కానీ ఎందుకో ఆయనలో ఆరోజు కోపం తారాస్థాయికి వెళ్లి పోయింది. 'వెధవల్లారా.. కవిత్వమంటే ఏమనుకుంటున్నార్రా! తెలుగు సాహిత్యాన్ని మహౌన్నత స్థాయిలో నిలబెట్టిన ఎందరో మహానుభావులున్నార్రా! పుస్తకాలు చదవండ్రా!' అంటూ ఈ కవితను అప్పటికప్పుడు చెప్పారు. అంతటి ఉగ్రరూపం ఆయనలో మరి ఎప్పుడూ నేను చూడలేదు.
సాధారణంగా చాలా మదు స్వభావి. మాటలు ఎప్పుడూ పెళుసుగా ఉండేవి కావు. కఠినంగా, పరుషంగా మాట్లాడటం ఆయన స్వభావం కాదు. మూడు సంవత్సరాల డిగ్రీ సమయంలో ఆయన మాకు జనరల్ తెలుగు, స్పెషల్ తెలుగులో సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం, భాషాశాస్త్రం లాంటి అంశాలు బోధించేవారు. పాఠం చెప్పడంలో ఆయనకు తనదైన ప్రత్యేక శైలిని ఉండేది. పైగా సాధారణ విద్యార్థికి అనాసక్తిగా ఉండే భాషాశాస్త్రం అంశాలు బోధించేటప్పుడు కూడా విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చెప్పేవారు. దేవీప్రియ, పాపినేని శివశంకర్, సుశీలమ్మ, వాసిరెడ్డి మల్లీశ్వరి లాంటి ఎందరో ఆయనకు ప్రత్యక్ష శిష్యులు. నాకు తరగతి గదిలో పాఠాలు చెప్పడం మాత్రమే కాక స్టాఫ్‌రూమ్‌లో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేర్పారు . రెండేళ్ల పాటు ఆయనతో సహ అధ్యాపకుడుగా ఉండటం నాకు కలిగిన గొప్ప అదష్టంగా భావిస్తాను.
1989లో అనుకుంటా. ఓపెన్ యూనివర్సిటీ స్పాట్ వాల్యూషన్ కోసం మాష్టారుతో పాటు హైదరాబాద్ వెడితే ఖాళీ సమయాల్లో ప్రముఖుల దగ్గరకు తీసుకువెళ్లే వారు. అలా ఆయనతో కలిసి గోల్డెన్ త్రెషోల్డ్‌లో ఉన్న ఆరుద్ర గారి దగ్గరకు వెళ్ళాము. ఆ తరం కవుల్లో నేను చూసిన మొదటి కవి ఆరుద్ర. ఒక సాయంత్రమంతా ఆయనతో గడపటం ఒక మంచి జ్ఞాపకం.
రామ్మోహన్ రాయ్ నిత్య పాఠకుడు. క్లాసు ఉంటే చెప్పడానికి వెళ్లేవారు. లేదంటే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవారు. సాధారణంగా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు పింగళి లక్ష్మీకాంతం గారి తెలుగు సాహిత్య చరిత్ర, కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వతత్వ విచారము, కందుకూరి వీరేశలింగం ఆంధ్రకవుల చరిత్ర, గోపాల కృష్ణమూర్తి అర్థ శతాబ్ది ఆంధ్రకవిత్వం లాంటి గ్రంధాలు ఒక క్రమపద్ధతిలో తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసే గ్రంథాలుగా ఉన్నాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు నారాయణరెడ్డి గారి ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు- ప్రయోగములు పుస్తకాన్ని కరదీపికగా భావిస్తుంటారు. అయితే దీనికి అనుబంధంగా లేదా కొంత కొనసాగింపుగా కడియాల వారి తెలుగు కవితా వికాసము (1947- 1980) ఉంటుంది. నిజానికి ఈ గ్రంథం 1947 నుంచి 80 వరకు కొనసాగిన వివిధ సాహిత్య ధోరణులను పరిచయం చేసేదే అయినప్పటికీ 1910 నుంచి 1947 వరకూ కొనసాగిన జాతీయోద్యమ, ఆంధ్ర రాష్ట్రోద్యమం, భావ, అభ్యుదయ, సాహిత్యోద్యమాలను కూడా నవ్య కవిత్వం- అవతరణ వికాసాలు పేరుతో పరామర్శించారు రాయ్ గారు. 47 తర్వాత వెలువడిన సాహిత్యాన్ని స్వాతంత్య్ర భానూదయం - తెలుగు కవుల ఆనంద గీతాలు, బాపూజీ నిర్యాణం - కవుల బాష్పాంజలి, తెలంగాణ పోరాటం - హృదయ వేదన, స్వాతంత్య్రానంతర సాహిత్యంలో సంప్రదాయ కవిత్వ స్వరూపం, భావ కవితా సౌరభం, అభ్యుదయ కవిత్వం, వచన కవితా వికాసం, దిగంబర కవుల తిరుగుబాటు, విప్లవ కవిత్వం- ప్రారంభం అభివృద్ధి అనే అంశాలుగా విభజించి వర్తమాన సాహిత్య చరిత్రను పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కవిత్వం రాస్తున్న యువ కవులకు ఆధునిక యుగ సాహిత్యం పట్ల అవగాహన కల్పించడం కోసం కరదీపికగా 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని పేర్కొనవచ్చు.
శ్రీశ్రీ అంటే మాస్టారికి తరగని ప్రేమ. ఆ కారణంగానే 'తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం' విమర్శనాత్మక గ్రంథం, 'శ్రీశ్రీతో ముఖాముఖి' పుస్తకాన్ని ప్రచురించారు. 'తెలుగు కవితా వికాసము'కు కొనసాగింపుగా 'ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వం' ప్రచురించారు. దాదాపు ఈ రెండు కవిత్వ విమర్శ గ్రంథాల వల్ల పాఠకుడు కానీ లేదా సాహిత్య విద్యార్థి ఆధునిక కవిత్వం పట్ల సమగ్రమైన అవగాహన ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది.
రాయ్ గారికి తెలుగుతో పాటు ఆంగ్ల భాష మీద కూడా సాధికారికత ఉంది. 1997లో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన భారతీయ భాషల్లోని 13 ఉత్తమ కథల సంకలనం అందుకు ఉదాహరణ. ఈ కథా సంకలనంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కథకులైన అనంతదేవవర్మ, సత్యజిత్ రే, రస్కిన్ బాండ్, భీష్మ సహాని, త్రివేణి, గురు బక్ష్ సింగ్, సుందర రామ స్వామి వంటి వారి కథలు ప్రచురితమయ్యాయి. భారతీయ ఇతర భాషల కథలను తెలుగులోకి అనువదించేటప్పుడు రాయ్ గారు తెలుగు నుడికారాన్ని జాతీయాలను ఉపయోగిస్తూ తెలుగుదనానికి దగ్గరగా అనువాదాలు చేశారు. 'సహృదయ వ్యాససంపుటి', 'తెలుగు పద్యం సమగ్ర పరిశీలన' లాంటి విమర్శ గ్రంథాలు, 'మన తెలుగు నవలలు'లాంటి పరిశోధనాత్మక గ్రంథాలు ఆయన ప్రచురించారు.
కవిత్వం పట్ల లోతైన అవగాహనతో పాటు వర్తమాన కవిత్వంపై కూడా ఎంతో అనురక్తి కలిగి ఉండేవారు కడియాల. వందకుపైగా సాహిత్య వ్యాసాలు, 600కు పైగా గ్రంథ సమీక్షలు, వందకు పైగా రేడియో ప్రసంగాలు చేసిన ఈయన దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రతి సంవత్సరం వివిధ పత్రికల్లో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటులను విశ్లేషణ చేస్తూ వ్యాసాలు రాశారు. ఆయన వ్యాసాల్లో తమ కవితలను ప్రస్తావిస్తే అంతకుమించిన గుర్తింపు అవసరం లేదని భావించే యువతరం ఉండేది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన భారతీయ సాహిత్య విజ్ఞాన సర్వస్వం గ్రంథంలో సుమారు 28 వ్యాసాలు రామమోహనరాయ్ రచించారు.
రచయిత పట్ల రాగద్వేషాలతో కాక రచనను ఆమూలాగ్రం పరిశీలించి తన అభిప్రాయాలను తెలియజేసే ఒక సహృదయ విమర్శకులు రామమోహనరాయ్. 'తెలుగు సాహిత్యంలో కషి వలన జీవనం' అనే అంశం మీద నాగార్జున యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. దీనికి గానూ ఆయనకు తూమాటి దోణప్ప బంగారు పతకం లభించింది. మాటలలో సున్నితత్వం, విమర్శలో కూడా తాను చెప్పదలుచుకున్న కటువైన అభిప్రాయాలను కూడా మెత్తగా చెప్పడం, నవ్వుతూనే తన భావాలను నిష్కర్షగా చెప్పడం ఆయన స్వభావం. ఆయన రచనలను ఈనాటి తరానికి అందుబాటులోకి తీసుకురావడమే ఆయనకు అందించే నివాళి. అందులో భాగంగానే 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని, 13 ఉత్తమ కథల సంకలనాన్ని ఈనెల 20వ తేదీన ఆయన సంస్మరణ దినం నాటికి విజయవాడ సాహితీమిత్రులు తీసుకువస్తున్నారు.
- బండ్ల మాధవరావు 88976 23332










