Apr 11,2022 06:54

పాశ్చాత్య నాగరికత, సంస్కృతి, ప్రభావాలతో ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన అనేక నూతన ప్రక్రియల్ని ప్రయోగాల్ని తెలుగు జాతికి పరిచయం చేసిన ఘనత కందుకూరి వీరేశలింగంకే దక్కుతుంది. తెలుగులో మొదటిసారిగా ప్రహసనాలు రాసిన ఘనత ఆయనదే! తన రచనల ద్వారా సమాజంలో మార్పు సాధించాలని కోరుకున్నారు. ప్రహసనం దృశ్యరూపకం. ఇందులో హాస్యం ప్రధానరసంగా వుంటుంది. దీన్ని ఆంగ్లంలో 'రెస్టోరేషన్‌ డ్రామా' అని అంటారు.
       ప్రహసనాలు, సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి. అక్కడనుంచే తెలుగులోకి వచ్చాయి. సంస్కృతంలో జుగుప్సాకరమైన, అశ్లీల మైన ప్రసనాలు ఉండేవి. సంస్కృతంలో మొదటి ప్రహసనం 'భగవదజ్జుకం'లోని ఇతివృత్తం బౌద్ధుల్ని పరిహసించడం. కందుకూరి సంఘ సంస్కరణకోసం మాత్రమే ప్రహసనాలు రాశారు. తన కాలంనాటి సమాజాన్ని కళ్లకు కట్టినట్లు ప్రహసనాల్లో చక్కగా వర్ణించారు. అవినీతి, అక్రమాలు, లంచగొండుతనం, కుటిలత్వం, దుర్మార్గాలు, దౌర్జన్యాలు... ఆనాటి కాలంలో సర్వసాధారణమైన విషయం. వీటి నన్నింటిని ధైర్యంగా ఒక్కడే నిలబడి ఎదుర్కొన్న మొనగాడు వీరేశలింగం. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కొంచెం కఠినంగా చెప్పారు ఆయన. సూటిగా చెప్పారు. వ్యంగ్యంగా, హేళనగా చెప్పారు. బాహాటంగా చెప్పారు. అదే కందుకూరి రచనల్లోని విశిష్టత కూడా.
      కందుకూరి ప్రహసనాల్లో పీఠాధిపతుల దౌర్జాన్యాల్ని తీవ్రంగా ఖండించారు. మఠాధిపతులు ఆగడాల్ని నిరసించారు. పురోహిత వర్గం వారి ఆరాచకాల్ని, ప్రదర్శనను నిరసించారు. భక్తి ముసుగులో, విశ్వాసాల పేరుతో, మూఢ నమ్మకాల పేరుతో భగవంతున్ని అడ్డు పెట్టుకొని, మోసం చేసేవారిపై కందుకూరి ధ్వజం ఎత్తారు. సంఘంలోని పెద్ద మనుషులుగా చెలామణి అయిన వారి మోసాల్ని, పాపాల్ని, దౌర్జన్యాల్ని, ఆగడాల్ని, ఎండ కట్టారు. కొన్ని ప్రహసనాలు రాసినందుకు కందుకూరి మీద కొంతమంది పెద్దలు కోర్టులో కేసులు కూడా వేశారు. అంటే వారి ప్రహసనాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉండేవో మనం గమనించిచ్చు.
        ప్రహసనాల్లో కొన్ని చోట్ల వీరేశలింగం తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఆ కోపంతో మోటు హాస్యం, కరుకైన వ్యంగ్యంతో నిరసన తెలియజేశారు. అప్పటికైనా, కొంతమంది వ్యక్తులు బాగుపడతారని అలా రాశారు. కందుకూరి పరమ ఈశ్వర భక్తుడు. ధార్మిక విశ్వాసాలకూ, సాంస్కృతిక విలువలకూ ఆయన ఏనాడూ వ్యతిరేకి కాదు. దేవుడు పేరు చెప్పి, మోసాలు చేసే వారిపై ఆయన తిరగబడ్డారు. 'గోదావరి మండల' సభలో వీరేశలింగం చేసిన అధ్యక్షోపన్యాసంలో భారతదేశ సంస్కృతినీ, మత విశ్వాసాన్నీ కొనియాడారు. మతం పేరిట జరిగే మారణహౌమాన్ని ఖండించారు. మతాధిపతులు, పీఠాధిపతులు నిరంకుశంగా సమాజంలో కొన్ని పనికిమాలిన నియమ నిబంధనలు నియమించి, ఆమాయక ప్రజల్ని బలిచేసి, దానికి కర్మ సిద్ధాంతాన్ని జోడించడాన్ని వీరేశలింగం సహించలేకపోయారు.
       ఆకాలం నాటి వేశ్యావృత్తిపై వీరేశలింగం ఒంటికాలిపై ధ్వజమెత్తారు. వేశ్యావృత్తి నిర్మూలనపై ఎన్నో ప్రహసనాలు రాసి సమాజాన్ని చైతన్యం చేశారు. వేశ్యావృత్తి సాంఘిక హౌదాగా ఆకాలంలో గుర్తింపు పొందడాన్ని వీరేశలింగం జీర్ణించుకోలేక పోయారు. బాల్య వివాహాలు వల్లే వేశ్యావృత్తి ఎక్కువైంది. ఎంతోమంది వితంతువుల జీవితాలు మోడులుగా మారిపోయాయి. కొందరు దొడ్డిదారిన పురుషులతో సంబంధాలు పెట్టుకొనేవారు. కుటుంబ సభ్యులు కూడా చూసీ చూడనట్లు ఉండేవారు. పండితులం, విద్యావంతులం, మేధావులం అని అనుకునే బ్రాహ్మణుల్లోనే ఈ జాడ్యం ఎక్కువగా వుండేది. చదువు ఎక్కువైతే మతిపోతుందంటే ఇదే. బ్రాహ్మణుల వివాహంలో మొదటినుంచి చివరి వరకు జరిగే పెళ్ళితంతును విడమరచి, బట్టబయలు చేసి, లోపాల్ని ఎండకట్టారు వీరేశలింగం. తాను రాసిన ప్రహసనాలు చదివి ప్రజలు చైతన్యవంతులు అవుతారని ఆయన కలలు కన్నారు.
      కందుకూరి ప్రహసనాల్లో కొన్ని గ్రంథాలుగా వచ్చాయి. 44 ప్రహసనాల్ని మూడు భాగాలుగా 'హాస్య సంజీవిని' పేరుతో ప్రచురించారు. కందుకూరి ప్రహసనాల్లో ఆశించిన లక్ష్యం వేరు. ప్రయోజనం వేరు. దానికోసం జీవితాంతం కష్టపడ్డారు. పురుషులవలె స్త్రీలు కూడా విద్యావంతులు కావాలి. సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా వుండాలని కాంక్షించారు. తన సామాజిక నిబద్ధత కోసం ఎంతోమందితో గొడవలు పెట్టుకున్నారు వీరేశలింగం. సంఘంలోని అన్యాయాల్ని అక్రమాల్ని ఎదురొడ్డారు. పెద్ద వాళ్ళతో విరోధం పెట్టుకుంటే మీకు చాలా నష్టం జరుగుతుందని మిత్రులు చెప్పినా పట్టించుకోనేవాడు కాదు. ఆ క్రమంలో ఆయనకు ఎన్నో కష్టాలు, నష్టాలు వచ్చాయి. అయినా కందుకూరి తన పద్ధతిని మార్చుకోలేదు. తాను ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ అధికారుల అవినీతిని 'వివేకవర్ధిని' పత్రికలో తీవ్రంగా విమర్శించారు. బ్రిటీష్‌ ఉద్యోగుల్ని కూడా వదిలిపెట్టలేదు. ఓసారి రామకృష్ణయ్య అనే మిత్రుడు కందుకూరికి ఇలా ఉత్తరం రాశారు : ''మీ పత్రికలో పెద్దపెద్ద వాళ్లను ఖండిస్తూ మీరు వ్రాసిన వ్యాసాల్ని చూస్తే నాకు చాల ఆందోళన కల్గుతుంది. మీకు శత్రువుల ఎక్కువవుతున్నారు. మీరు న్యాయధికారులతో, జడ్జిలతో తగవు పెట్టుకోవడం మంచిది కాదని నా సలహా''. ఆయనా కందుకూరి తన వైఖరిని మార్చుకున్నది లేదు.
     కందుకూరి కన్యాశుల్కం, లోకోత్తర వివాహం, అతి బాల్య వివాహం, విచిత్ర వివాహం, హిందూ వివాహాలు, వేశ్యాప్రియ ప్రహసనం, వేశ్యా విషయ సంవాదం, వినోద తరంగిణి, బహుభార్యత్వం, అపూర్వ బ్రహ్మచర్యం, దంబాచార్యుల భార్య, మూఢ భార్య - మంచి మగడు, నవ నాగరకులు, కులాభిమానం, ఆచారం, శకునములు, జమీందారీ ధర్మ ఖర్చు, కలహప్రియ ప్రహసనం, మహావంచక ప్రహసనం, కలి పురుష శనైశ్చర విలాసం, స్వర్గలోక సుఖం, పారిశుద్ధ్య సంఘ ప్రహసనం, రోగచికిత్స, యఙ్ఞ ప్రయత్నం, శివు పోషణ, హిందూ మహాజనుల మత సభ, అతి బలవంత వివాహ నిర్బంధ వైధవ్యం, కామరూప ప్రహసనం, పెళ్ళి తరువాత పెద్ద పెళ్ళి, భోగ పుత్రికా స్వీకారం, మొదలైన ప్రహసనాలు రాశారు. స్వతంత్రంగా రాసిన ప్రహసనాలు, ఆంగ్లం నుంచి అనువాదం చేసిన ప్రహసనాలు .. మొత్తం డబ్ఛై దాకా ఉండవొచ్చునని వీరేశలింగం సాహిత్యంపై పరిశోధన చేసిన డాక్టర్‌ అక్కిరాజు రమాపతిరావు గారి అభిప్రాయం. ఈ ప్రవాసనాలు అన్నీ వివేక వర్థిని, సతీహిత బోధిని, సత్యసంవర్ధిని, సత్యవాదిని, జనానా, చింతామణి పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
   వీరేశలింగం తన ప్రహసనాల్లోని పాత్రలన్నీ సమాజంలో ఉన్నవే! ఊహ నుంచి వచ్చినవి కావు. మూఢ నమ్మకాల్ని, లంచగొండితనం, వేశ్యాలోలత్వం, పురోహితుల దుష్టప్రవర్తన, మతాచార పరిరక్షకుల అవినీతి... ఇలా ఎన్నో విషయాల్ని ప్రహసనాల్లో రాశారు. ఆ దెబ్బకు కందుకూరిపై న్యాయస్థానాల్లో 'మాననష్టపు' అభియోగాలు, వ్యాజ్యాలు కూడా వచ్చాయి. మూఢ నమ్మకాల్ని, దురాచారాల్ని, తీవ్రంగా ఖండించేటప్పుడు చాలా పరుషమైన భాషను ఉపయోగించారు. నిజం ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా బాధగానే వుంటుంది. సమాజంలో కొంతయినా మార్పు రావాలి. కావాలనే ఆ భాషను కందుకూరి వాడారు. కనీసం ఆ భాషను చదివి అయినా సిగ్గు తెచ్చుకుంటారేమో అని ఆయన భావన. మతోన్మాదం, మూఢత్వం వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కందుకూరి ప్రహసనాల పఠనీయ, ప్రదర్శనా అవసరం నేడు ఎంతైనా ఉంది.

(ఏప్రిల్‌ 16 : కందుకూరి 175వ జయంతి)    - ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న      94406 41617