''ఇంకా నీకు సందేహమేనా!?
రహదార్ల మీద ఉద్యమాలతో ఆమెకి ఏం పని ఉన్నదో అని?''
ఈ వాక్యాలు కవయిత్రి వైష్ణవిశ్రీ చూపును పట్టిస్తున్నాయి. తాజాగా ఆమె అటుగా వంగిన ఆకాశం కవితా సంపుటి వెలువరించారు. స్త్రీలు ఏమి చేస్తారో మనకు తెలుసు. ఏమి చేయగలరో తెలుసు. ఇవాళ వారు అవమానాల నుంచి విమానాల వరకు వ్యాపించారు. జాకెట్టు కుట్టే దగ్గర నుంచి రాకెట్ ప్రయాణం వారి సమస్త శక్తికి నిదర్శనం. అన్ని భయాలను పటాపంచలు చేయగల రోజులు. కంచెలు దాటి సరిహద్దులు చెరిపేయగల రోజులు. కూర బాలేకుంటే ఎగిరి గుండెల మీద పడిన గిన్నెలను ఓపికగా భరించిన దృశ్యాలను చూసాన్నేను. ఆయన స్నానానికి పోవా లంటే బకెట్‌తో నీళ్ళు పెట్టి, అవి చల్లార్చి, సబ్బురుద్ది, తుడిచి బట్టలందించిన, అందిస్తున్న స్త్రీలను కూడా చూసాను. ఇదంతా భర్త పోస్ట్‌కి ఉన్న గౌరవం అంటారు కొందరు. పతివ్రత లక్షణం కూడా అంటారు. సరే మరి! పురాణాల్లో సతీవ్రతలు ఎందుకు లేరు? ఇవాళ్టికీ ఇవి ఉన్నాయి. కావాల్సినంత హింస ఉంది.
''సంకెళ్లను ఇంకెన్నాళ్లు మోస్తావ్
నిన్ను నువ్వే పక్షి రెక్కలా నిమురుకుని ఎగరేసుకోవాలి/కుంగినప్పడల్లా ఆకాశాన్ని నిగడతన్ను''
ఈ వాక్యాలు వైష్ణవి శ్రీ అంటే ఏంటో చెప్తున్నారు. వంటిల్లు గురించి వచ్చిన కవిత మనకు తెలుసు. కానీ కరోనా కాలంలో వైష్ణవి రాసిన కవిత ఒక కొత్త చూపుతో వచ్చిన కవిత. అందరికి లాక్డౌన్ కానీ స్త్రీకి వంటిల్లు నిత్యం ఐసోలేషన్ సెంటర్ అనడంతో, ఆమె ఆలోచన విభిన్నం అని తెలుస్తుంది.
''పిల్లలకి పాలిచ్చే అమ్మలందర్ని
భూమధ్య రేఖ మీద వరుసగా నిలబెట్టండి
ఈ దేశం గాలిని శ్వాసిస్తున్న
నా ఊపిరి మీద ఒట్టు
సమస్త భూగోళమూ పాలు తాగే పసిగుడ్డుగా
మారుతుందని నాది హామీ''
ఇవి ఆమె కవిత్వానికి ప్రాణం లాంటి వాక్యాలు. ఇందులో కుండపోతగా కురిసే వాక్యాలు ఉన్నాయి. ఆమె సంతకం అనే కవిత వైష్ణవి కవిత్వానికి సిలబస్. సముద్రాలను మోసుకు తిరిగే చీరకొంగుల కన్నీళ్లు ఉన్నారు. చాలా అమాయకంగా కడుపుకోతకు మందు అడిగే ఈ కవయత్రికి మొహమాటం లేకుండా రాయడం తెలుసు. అమ్మ చనుబాలంత స్వచ్ఛమైన మనిషి కోసం ఈమె అన్వేషణ అడుగడుగునా కనిపిస్తుంది.
''నాగేటి చాళ్ళన్నీ నట్టేట మునిగిన
అప్పు సముద్రాలు''
ఇక్కడ ఉ తీసి అ పెట్టడంలో ఆమె ప్రతిభ బయట పడుతూ ఉంది. తన కవిత్వంలో స్త్రీలు, రైతులు, పసిపిల్లలు ఎక్కువగా కనిపిస్తారు. సంఘటనాత్మక కవిత్వం ఉన్నప్పటికీ అది సమర్ధ వంతంగా కవిత్వీకరించడం వల్ల ఇబ్బంది అనిపించదు. ఆవేశం కనిపిస్తుంది కానీ అందులో అర్థం ఉంది. శిల్పం పట్ల కొంత సంయమనం అవసరమేమో అనిపించింది. అవాస్తు కవిత విభిన్నమైనది.
''తల్లీ రేపటి రోజున న్యాయదేవత
ఆకలితో గుక్కపట్టి ఏడ్చినా పాలు పట్టకు
స్కిన్ టు స్కిన్ టచ్ లోపాయికారీ తీర్పుల్లో
టచ్ మీ నాట్ లా ముడుచుకు పోవాలంతే''
ఎన్నో యుగాల వేదన ఈ వాక్యాల్లో కనబడుతుంది. అనేక గొంతుల సంవేదన ఈ కవయిత్రి వినిపిస్తుంది. ఈమె కవిత్వంలో సౌందర్యం కూడా ఉంది. భావన బలం ఉంది. ఊహాశక్తి ఉంది.
''ఆకాశం భూమిని ముద్దాడుతుంటే
చినుకు ముత్యాలతో
ఒడి నింపుకున్న మల్లెపందిరి''
పిచ్చుకలు తనకు కవిత నేర్పాయి అంటుంది ఓ చోట. గింజలు తినే పిచ్చుకని చూసి, అది నక్షత్రాలను తింటున్న అనుభూతని ముచ్చట పడుతుంది. పసివాసనను జ్ఞప్తికి తెచ్చిన పిచ్చుకలను మనసారా హత్తుకుంది. సగం చంద్రుడికి చక్కిలిగింతలు కూడా పెట్టి ఏటి మేటి వాగుల్లో నవ్వించే చలాకీతనం ఉంది.
ఆడవాళ్ళని బానిసలుగా చూసే మగవాళ్లను, మాంసఖండాలుగా చూసే కాముకులను, పసిబిడ్డలను చిదిమే రాక్షసులను నిలదీసిన కవయిత్రి, తన జీవితంలో తన నాన్నకి ఒక పేజీ ఉంచుతాను అని ప్రకటించింది. ఆ నాన్న ఎంత మంచి మనిషి అయి ఉంటాడు. తన హదయం గెలుచుకున్న నాన్నని కవయిత్రి అపురూపంగా చెప్పుకుంది. తమ కుటుంబాన్ని సీతాకోకచిలుకను చేసిన నాన్నను చెమట చుక్కల సౌధంగా రికార్డు చేసింది.
''కాలం కాన్వాస్‌పై
నిండు జీవితాన్ని కుమ్మరించి
నన్నో బతుకు చెట్టును చేసి
మోడుగా మిగిలినవాడు
నాన్నను గుండెల్లో ఉంచుకుని ఊరుకోను
తనకోసం ఎప్పుడూ
ఒక పేజీ తెరిచే ఉంచుతాను''
నాన్నంటే గొప్ప భావన ఉంది కనుకనే నాన్న లేని దేశంలో అనే కవిత రాయకలిగింది. మెహందీ మహల్లో బందీలుగా ఉన్న నెత్తుటి పావురాల వేదన వైష్ణవి శ్రీ తట్టుకోలేక పోయింది. వాళ్ళను నగదేశం కన్న బిడ్డలు అంది. వారికి మనిషి వాసన దొరకలేదని తీవ్ర ఆవేదనతో ...
''కాంక్రీట్ దేశం గుండెల మీద
తమ చితిని తామే పేర్చుకున్న వాళ్ళు
ఇప్పుడు ఆ నెత్తుటి పావురాళ్లకు
హత్తుకునే తండ్రి ప్రేమ కావాలి
అవును వాళ్ళకిప్పుడు నాన్న కావాలి
పుట్టడానికే కాదు
గౌరవంగా బతకటానికి నాన్న కావాలి..''
ఇలాంటి వైవిధ్యమైన ఆలోచనలు ఈమెను సమకాలీన కవిత్వంలో నిలబెడుతున్నారు. నిత్యం శిశిరమై రాలిపడుతున్నా పెరిగే గర్భసంచుల ఎడతెగని ద్ణుఖభారాన్ని నిజాయితీగా రాస్తున్న వైష్ణవికి అభినందనలు. అటుగా వంగిన ఆకాశం ఇటుగా వంగాలి అనే ఆకాంక్షను చాలా బలంగా సమర్థిస్తున్నాను. అక్కడక్కడ కొన్ని నినాదాల లాంటి వాక్యాలు ఉన్నారు. అవి అలానే చెప్పాలని తన ఆకాంక్ష కావొచ్చు. ఇందులో ఆమె సంతకం స్పష్టంగా ఉంది. ప్రతులకు కవయిత్రి (80742 10263)ని సంప్రదించవొచ్చు.
- సుంకర గోపాల్ 94926 38547










