Apr 11,2022 06:37

అక్కడ దేవుళ్ళెవరు ఆకాశంలోంచి పుట్టలేదు
అక్కడ దేవతలెవరికీ పంచభక్ష్య పరమాన్నాలక్కరలేదు
ఊరి నడిబొడ్డునో, పొలిమేర మర్రిమాను దగ్గరో
నిర్భయంగా నిలబడి ఊరిని కాపలా కాస్తున్న వాళ్ళు
బీరతీగలా ఊరి మట్టితో
ఆత్మీయ బంధాలను అల్లుకున్నవాళ్ళు
భూసామ్యం బుసలు కొట్టినప్పుడల్లా
చేతుల్ని బరిసెల్లా మార్చుకున్నవాళ్ళు
అడవి ఎదపై ఉక్కు పాదాలు మోపినప్పుడల్లా
వెదురు కర్రలై ఆకాశానికి ఎగబాకినవాళ్ళు
పప్పు, నెయ్యి తిన్ననోళ్ళు వెర్రి కూతలు కూసినప్పుడల్లా
మీ 'సంగతేందని' నిలదీసిన
ఆకుపచ్చని అడవి గొంతుక వాళ్ళు
నీళ్ళు తాకితే 'మైల' అంటుకుంటుందని మీరన్నప్పుడల్లా
బావి తవ్వి గంగమ్మ ఒడిలో పులకించిన దేహాలవాళ్ళు
అవును, అడవి మనుషులే
అడవిని నమ్ముకున్న బతుకుతున్న ఒట్టి మట్టి మనుషులే
మీరెన్ని తొర్రి కూతలు కూసినా
అడవికి అంటరానితనం పులిమినా
అక్కలపై, అమ్మలపై అవమానపు రాళ్ళను విసిరినా
మీరు సమర్పించే చక్ర పొంగలి, దద్దోజనం కోసం
మీ కాస్మిక్‌ దేవుడు లొట్టలేసుకుని ఆబగా చూస్తుంటాడు
తెరవెనుక మీరెన్ని కుయుక్తులు పన్నినా
అందమైన అడవి సంస్క ృతి దాడి చేసినా
అక్కలను, అమ్మలపై అవమానపు రాళ్లు విసిరినా
సుగంధ, మంగళ స్నానాల కోసం
మీ కాస్మిక్‌ దేవుడు ఎదురుచూస్తుంటాడు
ఎర్ర పంచలు కప్పుకుని, మత దండాన్ని భుజానేసుకుని
దేశానికి ఊర్ధ్వ పుండ్రాలను దిద్దే మీకు
ఆదివాసుల నమ్మకాలెలా గుర్తుంటాయి?
అడవి శరీరంలోని కదిలే ఆత్మ వేదనలు
ఎలా తెలుస్తాయి?
పాచి పట్టిన మీ నాలుకను
ఏపుగా పెరిగే వేప పుల్లతో రుద్దుకోండి
వాళ్ళు వేపలా చేదుగానే ఉంటారు
వేప పుల్లలా చీలుతూ ఉంటారు
చీలిన వేప పుల్ల
ఏ మందపాటి నాలుకనైనా ప్రేమగా శుభ్రపరుస్తుంది!

- రేకందార్‌ గాంధీ
88972 21982