ఎందుకు అమ్మలెప్పుడూ ఇలా
అర్ధాంతరంగా అంతర్థానమై
జీవితంలో గరుకును
గమనంలోకి తెస్తారు..?
అమ్మలున్నప్పుడు జీవితానికి..
అమ్మలు లేనప్పుడు జీవితానికి..
గుండె కొట్టుకోవడానికి
గుండె పట్టుకున్నదానికి
ఉన్నంత తేడా వుంది
అమ్మ వున్నప్పుడు చెప్పాలనుకొని
గొంతులో పెనుగులాడిన వాక్యం
అమ్మ లేకపోయినప్పుడు
ఆ వాక్యం కొక్కేనికే
గుండెచేప చిక్కుకొని గిలగిలలాడుతుంది!
అమ్మలెంత ప్రేమిస్తారో
అంతగా ఏడిపిస్తారు కూడా..!
రెక్కలొచ్చిన పక్షిని
గూడులోంచి గెంటేసినట్టు..
కొన్నేసిసార్లు అమ్మలు
మనల్ని బయటకు గెంటేస్తారు
అమ్మ కళ్లలో
సంతోష తడిబింబమై తేలడానికి
మనం ఈ ముళ్లకిరీట లోకంలో
మునిగి తేలిరావాలి
అమ్మ చిరునవ్వును గెలవడానికి
అగాధ అనుభవ సముద్రాలను దాటి రావాలి
ఒకింత కుదురుకొని.. ఒకింత సదురుకొని..
ఒకింత మనిషిలో మనిషిని
సరికొత్తగా దిద్దుకొని..
ఎదురేగుదాం అనుకునేలోపు
అమ్మలెందుకు ఎప్పుడూ ఇలా
అర్ధాంతరంగా అంతర్థానం అవుతారు?
ఎన్ని అడుగులు వేసినా
అమ్మ అడుగు తగలడం లేదు
అమ్మ మనసు తెలుసనుకున్నానే..
అమ్మ డొక్కల నీడల్లో ముడుచుకొని
జీవితం దాటేద్దామనుకున్నానే..
ఇలా ఎందుకు అమ్మలెప్పుడూ
అర్ధాంతరంగా అంతర్థానమవుతారు..?
అమ్మచెట్టు కూలిపోతే
కాళ్లూ, కళ్లూ దు:ఖాగ్నిలో కాలతాయని
బంధు ప్రేమపిట్టలు ఎగిరిపోతాయని
దారంతా ఎదురుగొప్పులతో వుంటుందని..
జీవితాన్ని జీవితాంతం
శిలువలా మోయాల్సుంటుందని
చెప్పడానికి గామోసు..!
రాలినా పరిమళించే పూవులా
బతకమని గామోసు..!
అర్ధాంతరంగా అమ్మలు అదృశ్యమయినా
వాళ్లెక్కడికి వెళ్తారు..?
భూమీ, ఆకాశం వున్నంతవరకు
ఇక్కడి తప్త హృదయాల్లోనే వాళ్లు
మొలిచే తడివిత్తనాల్లా
మెలకువగానే వుంటారు!
(తమ్ముడు తంగిరాల సోని తల్లి మేరమ్మ స్మృతిలో )
- పి.శ్రీనివాస్ గౌడ్
99494 29449










