Sep 12,2023 16:10

న్యూఢిల్లీ :  ఇటీవల నుహ్ లో  మత ఘర్షణలకు పాల్పడిన గోగూండా మోనూ మానేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు. బజరంగ్‌ దళ్‌ కార్యకర్త అయిన మానేసర్‌ రాజస్తాన్‌లో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మానేసర్‌ను సమాచార సాంకేతిక చట్టం (ఐటి యాక్ట్‌) లోని బెయిలబుల్‌ సెక్షన్స్‌ కింద మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాయంత్రంలోగా అతనికి బెయిల్‌ లభించే అవకాశం ఉందని, జంటహత్యల కేసులో రాజస్తాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. మోనూ మానేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసులు సమాచారమిచ్చారని, వారి చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే, తాము నిందితుని అరెస్ట్‌ చేస్తామని రాజస్తాన్‌ పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జులైలో హర్యానాలోని నుహ్ లో జరిగిన మత ఘర్షణల్లో సుమారు ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. జులై 31న నుహ్ లో  విశ్వహిందూ పరిషత్‌ చేపట్టిన బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక్‌ యాత్రపై బజరంగ్‌ దళ్‌ రాళ్లు రువ్వడంతో గురుగ్రామ్‌ సహా పలు ప్రాంతాలకు మత ఘర్షణలు వ్యాపించాయి. రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకి చెందిన జునైద్‌ (35), నాసిర్‌ (25)లను అక్రమంగా ఆవులను తరలిస్తున్నారంటూ గోగూండాలు ఫిబ్రవరి 15న అడ్డుకున్నారు. మరుసటి రోజు హర్యానాలోని బివానీలో నిప్పటించిన కారులో వారిద్దరి మృతదేహాలను గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ  మోనూ మానేసర్‌ ప్రధాన సూత్రధారి.