Apr 18,2022 06:54

నిన్నంతా ఒక్క యుద్ధ వార్త కూడా
చదవలేదు
నన్ను నేను చూసుకుంటూ గడిపాను

నేనిప్పుడు నగరాల శ్మశానాల్లోంచి
పరుగు పెడుతున్న శవాన్ని
మైనస్‌ వన్‌ టూ త్రీ ఫోర్‌ ఫైవ్‌..
గడ్డ కట్టిన దేహాన్ని లాగుతున్న
ఊపిరి శకటాన్ని

పది.. ఇరవై.. నలభై.. అరవై
బుల్లెట్‌ వేగంతో మైలురాళ్ళు వెనక్కి..
యుధ్ధ క్షిపణిలా నేను ముందుకి-
భుజం మీద బతుకు భేతాళుడు-
మనీపర్సు ఒక దండగ బరువు
కార్డులన్నీ ఎగరేసినా
ఒక గూగుల్‌ మ్యాపు కొని తేలేవు
నేను 'ఫైన్‌' నోటిఫికేషన్‌ లేదు
టేక్‌ 'కేర్‌' మెసేజ్‌ లేదు
ఊగిసలాడే జీవ లేశాన్ని
కాసేపు ఊపే రింగ్‌ టోన్‌ లేదు
ఆగిపోయిన భూమిలా
మూగబోయిన సెల్‌ ఫోన్‌!
ఎటు చూడు మంచు ఎడారి
ఎంత పెద్ద సమూహమైనా
అదంతా ఒక ఒంటరి బాటసారి!

తడబడినా.. పడినా.. ప్రాణాలు వీడినా
గాలి కూడా పలకరించదు
కాళ్ళకీ.. కళ్ళకీ దిక్కు తోచదు
ఏ సరిహద్దులతోనూ సంబంధం లేని
సామాన్యుడిని
చేతుల్లో ఒక బొమ్మ తప్ప మరే
కలలూ లేని పసి బాలుడిని
విజేతలూ పరాజితులూ చివరి విందులో
ప్రకటించే యుద్ధ విరమణ పత్రంలో
అనంతంగా ఆక్రోశించే
అదృశ్య క్షతగాత్ర హస్తాక్షరాన్ని

ఇప్పుడు భూమి యుద్ధం చుట్టూ తిరుగుతోంది
నా చుట్టూ నేను-
నా డైరెక్షన్‌ రాంగో రైటో
చెప్పడానికి చంద్రుడూ లేడు.. సూర్యుడూ లేడు
నో నెట్‌.. నో హట్‌.. నో హగ్‌.. ఓన్లీ ఫాగ్‌

నిలువునా కప్పేసిన అతి చల్లని నల్లని చావుపొగ
నిన్నంతా అరసెకను కూడా
యుద్ధం గురించి ఆలోచించ లేదు
నేటివ్‌ రెసిడెంట్‌ని.. ఫారిన్‌ స్టూడెంట్‌ని
ఎల్డర్‌ని.. యంగర్‌ని.. అప్పుడే పుట్టినవాడిని..
ఇంకా పుట్టని వాడిని..

నిన్నంతా ఒక్క వార్‌ విజువల్‌ కూడా చూడలేదు
యుద్ధభూమిలో అమ్మ కోసం ఏడుస్తున్న
అనాథ శిశువుని-
బంకర్‌లో ముడతల ముడతల వృద్ధ పశువుని-
ధ్వంసమైన ఆసుపత్రిలో నొప్పులు పడుతున్న
నిండు గర్భిణీని
బడి శిథిలాల్లో నెత్తుటి యూనిఫాంని
నిన్నంతా ఒక్క యుద్ధ వార్త కూడా వినలేదు
కూలిన యుద్ధ విమానాల్లోంచి
కాలి రాలిన కలల శకలాలను ఏరుకుంటున్నాను

ఈ రోజు కూడా యుద్ధ వార్తలు
చూడను.. వినను.. చదవను.
అసలెప్పుడూ ఆ పని చేయను
యుద్ధ విరామ వీణకు దేహాన్ని తీగలా చుడతాను
అతి భయంకర నియంతల కోరలు తీసే
అతి సామాన్య ప్రపంచ ప్రజా సమూహాల కోసం
శాంతి కాముకుల స్వప్నాస్థికలతో
ఒక పాట కడతాను

- ప్రసాదమూర్తి
84998 66699