Mar 28,2022 07:03

కాలాన్ని కాళ్ళకు కట్టుకుని పరిగెత్తే
మనుషుల మధ్య
ఆమె.. భారంగా మేల్కొనే ఉదయం
ఒంటికాలితో కొండనెక్కే కుటుంబాలకు
ఎప్పుడెప్పుడు దించేసుకుందామా
అనిపించే బరువు

ఒక పలకరింపై తాకిన ప్రతి చేతికీ
బతుకు మీద ఆమెకు మిగిలిన చిట్టచివరి ఆశ
పుప్పొడిలా అంటుకుంటుంది
జీవితానికి రాజీనామా చేసేసినా
చావుతో కుదుర్చుకున్న
రోజువారీ ఒప్పందం రద్దు కాదు
అవయవాల సంచీలోంచి
జారిపోయిన ప్రాణాలకై
రక్తశుద్ధి యంత్రం కళ్ళతో
రోజు విడిచి రోజొక వెదుకులాట
తిరిగొస్తానని పులికి మాటిచ్చిన ఆవులా
ఏ గంటకాగంట పొడిగించబడే ఆయుస్సు

గదిలోకి అడుగు పెట్టీపెట్టగానే
ఖాళీ బెడ్డుపైన దర్జాగా కూర్చొని
మరణం
ఆమెకు మాత్రమే వినబడేలా సంభాషిస్తుంది
ఆ యంత్రం
తన ప్రాణచిలకను దాచుకున్న మర్రి తొర్ర
శరీరాన్ని తూట్లు పొడిచే సూదులతో
భరించలేని నొప్పులతో
తప్పక కొనసాగించాల్సిన ప్రేమ

ప్రతి రాత్రీ గడపలో కొచ్చి
కేకేసి పిలుస్తుంటుంది మృత్యువు
ఎంత బతిమలాడుకున్నా
నిద్రలోకి జారుకోవు కళ్ళు
గుల్లబారిన ఎముకలు
సలపరింతలై గొంతెత్తుతాయి
అటు తిరిగీ ఇటు తిరిగీ
చావు పొలిమేరలోనే
కూలబడిపోతాయి ఆలోచనలు
ప్రతిరోజూ చీకటిలో కలిసిపోయే ప్రార్ధనలు
ఏదో రోజు ఫలిస్తాయి
శూన్యంలోకి మోరెత్తి మొరిగే కుక్క
ఇంటిమీద వాలిన
నిద్రపిట్టను తరిమే వేళకు
ఆమె మౌనం చెప్పులేసుకుని
ఏ జ్ఞాపకాల్లోకో నడిచెళ్ళిపోతుంది
క్షణం తీరుబడి లేని కాలం
దొర్లిపోతూనే ఉంటుంది వడివడిగా..

(రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతూ వెళ్ళిపోయిన మా అత్తమ్మకు నివాళిగా)

- సాంబమూర్తి లండ.
96427 32008