Mar 28,2022 07:41

నువ్వొక అక్షరాల సముదాయమైతే, రగులుతున్న నీ గుండెలోంచి లావా పెల్లుబికుతుంది కవిత్వమై. అవి ప్రశ్నల చురకత్తులై విచ్చుకుంటాయి. అప్పుడు దోషులు నోళ్లు విప్పాలి. నేరాల్ని ఒప్పుకుతీరాలి. ప్రశ్న తలెత్తటమే పోరాట విజయం. దానికి జవాబు దొరికి తీరుతుంది. జవాబులే సమస్త సమస్యలకు పరిష్కారాలు సూచిస్తుంది. ఆకాశంలో సగమని పదేపదే చెప్పుకున్నా, సగం మనుషులు తలుపు చాటు జీవితాలు గడిపినంత కాలం ఏ సమాజమూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు.
    ఇంత కాలం అదే తమ జీవితమనుకున్నవాళ్ళు, తమను గురించి తాము తెలుసుకోవటమూ, తమను తాము చూసుకోవటమూ మొదలై, కారణాలను నిలేయటం వేగంగా సాగుతోంది. ఎన్ని తిరుగుబాట్లు జరుగుతున్నా స్త్రీల సమస్య మరింత పెరుగుతూనే ఉంది. కొత్త సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు కేవలం స్త్రీల సమస్యలే కావు. అవి సమాజాన్నంతటికీ సంబంధించిన సమస్యలు. అందుకే పోరాటమూ సమష్టిగానే జరగాలి. అశేష ప్రజానీకం ఎదుర్కొనే బాధలకు ఇవి అదనమైనవి. శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక అభివృద్ధి ఎంత జరిగినా, అణగారిన వర్గాల అణచివేత, సంప్రదాయాల పేరుతో మూఢత్వాలను పెంచి దోపిడీ కొనసాగించడం యథావిధిగా కొనసాగుతోంది. అందులో భాగంగానే స్త్రీల మీద మరింత హింస, దౌర్జన్యం పెరిగింది. వివక్ష, మత మౌఢ్యం విస్తరిస్తోంది.
    ఎక్కడ పీడన అణిచివేత వుంటదో అక్కడ తిరుగుబాటు తప్పదు. అందుకనే మహిళలు గొంతు విప్పటమే కాదు, అత్యంత ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. వీటిని సహించలేని శక్తులు తిరిగి మతాన్ని అడ్డుపెట్టుకుని ఉన్మాదపు నిర్బంధాలకు పూనుకుంటున్నారు. స్త్రీలను అణచివేయటానికి పన్నాగాలు పన్నుతున్నారు. మిగతా స్త్రీలందరిలోకి ముస్లిం స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. రాజకీయాలలో, సమాజంలో వుండే వివక్షతలు, అదే విధంగా కుటుంబాలలో అనివార్యంగా విధించబడుతున్న అసమానతలు కలిపి మరింత భారమవుతాయి.
    ఒక మొసమర్లనితనం ఆవరిస్తున్న తరుణంలో స్త్రీలు మట్టి ముద్దల్లా ఎలా వుంటారు? అందుకే గొంతు విప్పుతున్నారు. దానికి ఒక సృజనాత్మక సాధనంగా రచనా ప్రక్రియను యెంచుకుంటున్నారు. అసలు ఈ మధ్య కాలంలో స్త్రీలు ఎక్కువగా రచనారంగంలోకి ముందుకు వస్తున్నారు. దానికి కారణం పెరిగిన అణచివేతనే. తన బాధను తానే పాడటంకాదు. బాధలపై పోరుదారుల్లో చేస్తున్న ఉద్యమకారులతో గొంతు కలిపితే మరింత బలం పెరుగుతుంది. ఆ రకమైన సామాజిక చైతన్యాన్ని కలిగి కలాన్ని ఎక్కుపెడుతున్న నృజనకారిణి సలీమ. ప్రగతిశీల ఉద్యమంలో భాగస్వామి. నిత్యచలన శీలి. కవిత్వం కూడా ఒక పోరాట ఆయుధమే ఆమెకు.జవాబు కావాలి సంపుటి అంతా మహిళావరణమే. ఆవేదనలు, ఆవేశాలు, దు:ఖాలు, బాధలు, ప్రశ్నలు, నిరసనలు, హెచ్చరికలు మొదలైనవన్నీ స్త్రీ అంతరంగంలోంచి విస్తరించడాన్ని చూస్తాము. మహిళ ఎలా చూడబడుతోంది, ఎంత బరువును మోస్తోంది, అనే విషయాన్ని తన అమ్మను చూసే అవగాహన చేసుకుంది. తన అమ్మ హృదయ వేదనే సమాజంలోని అమ్మల వేదనని గ్రహించింది. అందుకే 'మా తుఝే సలామ్‌, గడియారం ముల్లులా తిరుగుతూనే వున్నాను, గోర్కి అమ్మ నాకు ఆదర్శమైతే, నువ్వు నాకు ఆధారమయ్యావు' అని స్పష్టంగా ప్రకటించింది. అమ్మను, అబ్బాను పరిశీలించడంలోంచే స్త్రీ పురుష సంబంధాలను భేరీజు వేసుకుంది. ''కరుకైన అబ్బానోటి నుండి ప్రియమైన పిలుపుకోసం, అమ్మీ కలువ కళ్లు ఎదురు చూస్తూనే ఉంటాయి. కాళ్ళు అరిగేలా, గుండెలు పగిలేలా రోజంతా మిషన్‌తో కుస్తీ పడుతూ నిత్యం తపిస్తున్న అమ్మీ అంటే, అబ్బాకు ఎందుకో జాలే వుండదు'' అన్న కవితా పంక్తులు సాధారణంగానే వుండొచ్చు. కానీ వేలాది ముస్లిం కుటుంబాలలోని మహిళల జీవన దృశ్యాన్ని కళ్ళముందుకు తెచ్చింది. కనీసం జాలి లేదేమని బాధపడింది. ఇది ఎంతటి వాస్తవిక చిత్రం.
    ''ఎప్పుడూ అదేగాయం, మోయలేనంత దు:ఖపు బరువు, తలుపు చాటున నిలబడి, అతని అనుమతికై దీనంగా చూస్తున్న ఆమె శరీరం, ఎన్ని గాయాలను చవి చూసిందో! కాసంత ఓదార్పు దొరికితే స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది''. మహిళలు తమ అంతరంగాల్లో ఎలాంటి భావనలు కలిగి వున్నాయో, స్వేచ్ఛ కోసం పరితపించటాన్ని మనకు వినిపిస్తుంది. ఇక దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై ఎంతో ద:ఖంతో, ఆకాశంలో అక్షరాలను పేరుస్తుంది. ''మనిషిలో మానవత్వం చచ్చి, భూగోళం బద్ధలౌతుంది, ఓ మనిషీ... ఇకనైనా సిగ్గుపడు'' అంటుంది. దారుణాలను చెబుతూనే హెచ్చరిక కూడా చేస్తుంది. ''వెన్నెలను మించి మనోహరంగా కనిపించిన ఆమె మనసు మండే సూర్యుడయింది, పిల్లి పులవుతుంది, లేడి సింహమవుతుంది జాగ్రత్త''. ఆడైనా మగైనా శ్రమ ఒకటే. శ్రమ సౌందర్యాన్ని తెలిపే కవిత, అదేవిధంగా శ్రామికుల 'బతుకు' తెలిపిన కవిత. ''ఏ దుల్హన్‌ చేతుల్లోనో, ముస్తాబయ్యే తీరొక్క, రంగు గాజులను, దిద్దేందుకు మా చేతులను మసి బొగ్గులను చేశాం, అవి అంతగా మెరిసిపోయేందుకు, మా వెన్నెముకను అరగదీసుకున్నాం!''. శ్రమ చేరిన మీదటే ఆ గాజులకు అంత అందం మరి! కానీ శ్రామికులు మాత్రం బ్రతుకు బండి లాగ లేక కష్టపడుతూనే వుంటారు!
   సంపుటి నిండా విశ్వరూపమెత్తిన మహిళా వివక్షత, అసమానత కనపడుతుంది. స్త్రీల కష్టావధానాలను కళ్ళకు కట్టిస్తుంది. కరోనా కాలంలోనూ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవ చేసిన ఆశా వర్కర్లు, నర్సమ్మల గురించి రాసినా అవి కూడా వాళ్ళూ మహిళలే. మహిళల్లోని ఆత్మ స్థయిర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ''ప్రశ్న మొదలవగానే, ఎదభారం కాస్త తగ్గి మనసులోని భావాలకు, అక్షరరూప మిచ్చింది, తన అసలైన పాత్రను తనే రచించుకుంటుంది''. అనే నిర్భరమైన ధైర్యాన్ని వెల్లడిస్తుంది. అంతేకాదు ఈ సమాజం మార్పుతోనే మహిళల జీవనంలో మార్పు సాధ్యమనే అవగాహనకల కవయిత్రి కావటం వల్ల 'ఈ నిబ్దాన్ని చేదిస్తాను, కొత్తశక్తిని పుట్టిస్తాను, అందమైన మార్పుకై శ్రమిస్తాను' అంటూ ఒక భరోసాను, ఆశను అభివ్యక్తీకరించింది.
     స్త్రీ అసమానతలను, వారి వేదవలను కవిత్వీకరించేపుడు సలీమాలోని ఆక్టివిస్టు ముందుకొస్తారు. జీవితపు వాస్తవిక పరిస్థితులను లోకానికి తెలపటం కూడా పోరాటంలో ఓ భాగమే. అయితే మరింత క్లుప్తత, నూతనత్వంతో చెప్పే ప్రయత్నం చేస్తే మరింత ప్రభావశీలంగా కవిత్వం వుంటుంది. ఏదిఏమైన కవులు కేవలం కవనానికే పరిమితమై పోకుండా, వారు సృజిస్తున్న అంశాల పట్ల, అసమానతల పరిష్కారాల కోసం జరుగుతున్న ఉద్యమంలోనూ పాల్గొనటం నేటి అత్యంత ఆవశ్యకమైన విషయం. అది సంపూర్ణంగా నిర్వహిస్తున్న సలీమ నిజంగా అభినందనీయురాలు. తెలంగాణ సాహితిలో చురుకైన పాత్ర నిర్వహిస్తూ, సాహితి కార్యక్రమాలలో భాగస్వామ్యమవుతూ, ఇప్పుడు ఈ కవితా సంపుటిని తెచ్చిన సలీమాకు హృదయపూర్వక అభినందనాలు.
 

- కె ఆనందాచారి
99487 87660

- కె ఆనందాచారి