Jun 13,2022 07:27

ఆ మధ్య అమెరికాలో ఉన్న మా పిల్లల దగ్గరకు వెళ్లినప్పుడు తానా వారి పుస్తక మహౌద్యమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. అదో సదవకాశంగా భావించి, నా బాధ్యతగా నాలుగు మాటలు చెప్పాను. కార్యక్రమం ముగిశాక, అక్కడి తెలుగువారి పెద్దలకూ పిల్లలకూ 'తానా' కొన్ని పుస్తకాలను ఉచితంగా అందజేసింది. నాకూ కొన్ని బహూకరించారు. వాటిల్లో... నాకు చాలాకాలంగా మిత్రుడైన ఎమ్వీ రామిరెడ్డి కథాసంపుటి 'స్పర్శవేది' నా చేతుల్ని ఆత్మీయంగా స్పర్శించింది. ఏదో పులకరింత. ఆ వెంటనే పలకరింత. ఆ కథలన్నీ నేరుగా నాతో మాట్లాడాయి. పాత్రలు ప్రత్యక్షంగా నిలబడి పరామర్శించాయి. నిజంగానే, 'స్పర్శవేది' ఓ గొప్ప రసవేది. ఏ కథ చదివినా వర్తమానం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. సంఘటనలు పుటల మధ్య కదలాడుతున్నాయి. సన్నివేశాలు సజీవంగా మెదలుతున్నాయి.

జీవితానుభవాన్ని సామాజికానుభవంతో రంగరించకపోతే, ఇంత మంచి కథలు రాయడం సాధ్యం కాదు. 'పెదపరిమి' పొలాల్లోని నల్లరేగడి నవ్వినట్లుగా కథలన్నీ జీవంతో తొణికిసలాడాయి. కృతకత్వం మచ్చుకైనా లేదు. కల్పనలు తప్పవు. వాటి ప్రభావం వస్తువు మీద స్వల్పమే!

'స్పర్శవేది' కథ చదివి, రచయిత వెలిగించిన మానవతాదీపాన్ని చూసి, పుటలు తిప్పుతూ కంటతడి పెట్టుకున్నాను. రాజమ్మ, రావుడు (రాముడు కాదు) మన తోబుట్టువులే. పరిశుభ్రత ముఖ్యమే కాని, ప్రాణం కంటే గొప్పది కాదు. డాక్టరు గారి ప్రాణాలు కాపాడేందుకు భుజాలు మోపిన రాజమ్మ, రావుణ్ణి చూస్తే భూభారం మోసే ఆదిశేషుడు గుర్తుకొచ్చాడు. చాలా గొప్ప కథ. సజీవమైన కథ. శిల్పం, టెక్నిక్‌, నేటివిటీ, నేరేషన్‌- ఇలాంటి వాటితో గుండెల్ని కదిపే కథలకు పనిలేదని రచయిత నిరూపిస్తారు.

'గుండె చెరువై' కథ గోపీచంద్‌ గారి గల్పిక 'అర్రు కడిగిన ఎద్దు'ను గుర్తు చేస్తుంది. చెరువు చేత మాట్లాడించటం, చెరువు తన గురించి తాను చెప్పుకోవడం సరికొత్త చేతనాశిల్పం. చెరువు- అచేతనం.. అది మాట్లాడటమూ పులకరించటమూ చేతనత్వం. చెరువుగట్టున ప్రేమికులు కౌగిలించుకున్నారు. ముద్దులాడుకున్నారు. నవ్వారు. ఏడ్చారు. చివరి రెండు మాటలెందుకు? అదే కథ. సమర్థుడైన కథకుడి వాక్య నిర్మాణం అలాగే ఉంటుంది.

'యాసిడ్‌ టెస్ట్‌' కథలో భర్తలు ఎంతగా నటించగలరో, ఆ నటనను వాస్తవం ఎందుకు భరించలేదో అద్భుతంగా చిత్రించారు. వస్తువు పాతదే. కథనం కొత్తది. పాత్రలూ పాతవే. వాటి స్వభావాలు కొత్తవి. యాసిడ్‌ దాడికి గురైనప్పుడు హాస్పటల్లో పడిన నరకయాతన కంటే రేష్మలో అంత:సౌందర్యాన్ని చూస్తున్నానని చెప్పి దగ్గరైన రణధీర్‌ చీటికిమాటికి తన ప్రవర్తనతో రేష్మ గుండెల్లో నిప్పులు రగిలించాడు. 'అజిత్‌ గాడికీ, నీకూ తేడా లేదు. వాడు నిండు జీవితాన్ని నిమిషంలో తగలబెట్టగలడుబీ నువ్వు రోజూ కొంత వంతున జీవితాంతం తగలబెట్టగలవు. అంతే'- పాత్రలో పరకాయ ప్రవేశించి, మాట్లాడించడం అంటే ఇదే! రచయితకు ఒక 'వ్యూ' ఉండాలి. దాన్ని తనదైన కోణం నుంచి ఆవిష్కరించుకుంటూ పోవాలి. అప్పుడు కథ నెమలిపింఛంలా విప్పారుతుంది. 'స్పర్శవేది'లో కథలన్నీ ఇంద్రచాపాల్లాంటివే.

'నాగలి గాయాల వెనక'- అందరూ రాయగలిగే కథ కాదు. మట్టివాసన, రైతు కష్టాలు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టే రామిరెడ్డి సమర్థంగా రాయగలిగాడు. ఉదరు ప్రభుత్వోద్యోగం మానేసి, అక్కడి దుర్గంధాన్ని భరించలేక వ్యవసాయంలో దిగాడు. ఉద్యోగం లేదు కనుక అది వృత్తి.. ప్రవృత్తి కాదు. బంతిసాగుకు దిగిన ఉదరు మొహంలో కొత్త ఉత్సాహం ముద్దబంతిలా విప్పారడం బాగుంది. 'మనం సెన్సిటైజ్‌ చేయాల్సింది హాలికుల్ని కాదు, పాలకుల్ని'- గొప్ప ముగింపు.

'కురు'క్షేత్రం' గొప్ప శీర్షిక. కథానాయిక కష్ణవేణి. కష్ణ'వేణి' కురులు పెద్దవి కావడం, ప్రియుడు వాటినే ఇష్టపడటం- మన పల్లెల్లో పొడవైన జడ ఉండే అమ్మాయిని లక్ష్మీదేవి అవతారంగా పోలుస్తారు. గుంటూరు ప్రాంత భాష అన్ని కథల్లోనూ అంతర్లీనంగా ప్రవహించింది. ఉజ్జాయింపుగా, లాభం గూబలోకి రావడం, పత్తిగుబ్బలతో చేనంతా వెన్నెల కాయడం, గాడిపొయ్యి సెగ, సన్నాసోడు, వాడి కాళ్లుచేతులు పడిపోనూ, పొంత, దుక్కి, దరిద్రం ఎప్పుడూ అలాగే మొదలవుతుంది- ఇవన్నీ సజీవమైన పలుకుబళ్లు.

అరుణారుణం, మాధవసేవ, శివతాండవం, చీపురుపుల్ల వగైరా కథలు నన్ను తమ ప్రాంగణంలోకి లాక్కున్నాయి. మన 'వెంట వచ్చునది' ఏదీ అంటే, మనమూ మన కథలూ కవిత్వమూ! భావన గ్రాఫిక్స్‌ బ్రహ్మం పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్ది, కథల విలువను పెంచారు. రచయిత ఎమ్వీ రామిరెడ్డికి హార్దిక అభినందనలు.
 

- డాక్టర్‌ బీరం సుందరరావు
63034 43302