Jun 13,2022 07:55

కవులూ కళాకారుల్లోనూ ఇంత అమాయకులు ఉంటారన్న మాట. ఇది శీలా వీర్రాజు గారిని నేను మొదటిసారి చూసినప్పుడు అనుకున్న మొదటి మాట. దాదాపు పది కథా సంపుటాలు, పది కవితా సంపుటాలు, నాలుగైదు నవలలు ప్రచురించిన తెలుగు వారి ఇష్టమైన చిత్రకారుడు. అంతే కాదు, కవిత్వంలో కథలు, ఆత్మకథలు, నవలలు రాసిన తొలి ప్రయోగశీలి (బహుశ చివరి కూడా) శీలావీ. మరి ఆయనెంత ఆర్భాటం పోవాలి? తల ఆకాశం వైపు తప్ప భూమ్మీద దాని నీడ కూడా పడకుండా ఎంత గర్వపోవాలి? అబ్బే ఆయనేం నేర్చుకోలేదల్లే ఉందిక్కడ. ఇది నా రెండో ఇంప్రెషన్‌. వచన కవితా పితామహుడు కుందుర్తి పేరు మీద ఇచ్చే అత్యంత ప్రతిష్టాకరమైన ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు ఆయన చేతుల్లోనే ఉంది. సాహిత్య అకాడెమీ అవార్డు దాని ముందు గాడిద గుడ్డు అని కవులంతా అనుకునే రోజులున్నాయి. మరలాంటి మంత్ర దీపంలాంటిది తన అధీనంలో పెట్టుకుని ఎన్ని మంత్రాంగాలు సాగించవచ్చు? కానీ ఈయనేం చేశాడు? ఆ పురస్కార నిర్ణయాన్ని న్యాయంగా న్యాయమూర్తులకు వదిలేసి కేవలం అవార్డు మెమెంటో మీద అందంగా తన చేత్తో పురస్కార గ్రహీత నామాన్ని చెక్కే పని మాత్రమే తన చేతుల్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత సభాకార్యక్రమ తంతునంతా నడిపించే బస్తాల భారాన్ని తన నెత్తికి ఎత్తుకున్నాడు. తలుచుకుంటే కవిలోకాన్ని తానుంటున్న వీధినంతా ఊడ్చమంటే ఎంచక్కా ఊడ్చి పెట్టే వారే. అబ్బే అంత తెలివి లేదు. ఇది ఆయన మీద నా మూడో కామెంట్‌. కవుల్ని ఇంత లోకువ చేసి మాట్లాడుతున్నానని నా మీద ఆగ్రహించకండి సుమా! కొందరెప్పుడూ మినహాయింపే కదా. సాధారణీకరించినప్పుడు అసాధారణ వ్యక్తులు అందులో చేరరు.

నా మూడో కవితా సంపుటి నాన్నచెట్టుకు నూతలపాటి గంగాధరం అవార్డు వచ్చింది. అప్పుడు గానీ కవిత్వానికి అవార్డులిస్తారని, అవి అందుకుంటే వచ్చే కిక్కు, ప్రపంచంలో ఏ పురాతన ఫ్రెంచి మద్యానికీ సాధ్యం కాదని అర్థం కాలేదు. అదేదో ముందే తెలిస్తే అసలు పుట్టకముందే ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌కి అర్జీ పెట్టుకునేవాడిని. అన్యాపదేశంగా నా మనసులోని మాట ఆయనకు అందే వుంటుంది. ఏ పుణ్యాత్ముడో న్యాయమూర్తిగా ఆయనకు నా పేరు చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. అందుకే నా నాలుగో కవితా సంపుటి పూలండోరు పూలు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డుకి ఎంపికైంది. శీలా వీర్రాజు గారు కథల కోసం కలం ఝళిపించిన కాలానికి నేను కన్ను కూడా తెరవలేదు. ఆయన మొదటి కథాసంపుటి వచ్చిన ఏడాదే నేను ఈ భూమ్మీదకు రావడం జరిగింది. కానీ నేను పుట్టి ఏభయ్యేళ్ళు అయిన తర్వాత మొదటిసారి ఆయన్ని చూశాను. ఇది దుర్మార్గం. నిజంగా ఆయన్ని ఇంతకాలం నేను చూడలేకపోవడం దుర్మార్గం.

బీహారులో ఉద్యోగం కారణంగా చాలామంది గొప్ప కవులూ రచయితలూ కళాకారులూ పేర్ల ద్వారానే నాకు పరిచయం కానీ, వారిని దర్శించుకునే భాగ్యం నాకు దక్క లేదు. ఒకసారి శివారెడ్డి గారు తీసుకు వెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. అప్పుడు నేను హైదరాబాద్‌లో టీవీ మీడియాలో ఉన్నాను. అప్పటికి నేను నాలుగు కవితా సంపుటాలు తీసుకు వచ్చాను. ఆయన్ని, ఆయన సహచరి సుభద్రాదేవి గారిని చూశాను. బీహార్‌లో ఉండగా నలందా వెళ్ళినప్పుడు, బుద్ధ విగ్రహాలను చూసినప్పుడు కలిగినంత మానసిక నైర్మల్యం కలిగింది. పుణ్య దంపతులంటే వీరే కాబోలు అని అనుకున్నాను. సుభద్ర గారిని అక్కా అని పిలవాలనుండేది. కానీ అంత ధైర్యం చేయలేదు. అందుకు నాకు అర్హత కూడా కావాలి కదా. తర్వాత ఎప్పుడో నేను వాళ్ళింటికి టెన్‌ టీవీలో ఇంటర్వ్యూ కోసం కెమెరా హంగూ ఆర్భాటంతో వెళ్ళాను. వారితో మాట్లాడుతున్నంత సేపూ ఏ దేవతా మూర్తులతోనో ముచ్చటిస్తున్నట్టు లోపలేదో భయం అణకువ మర్యాద గౌరవం భక్తి. ఆ తర్వాత కొన్నిసార్లే వారింటికి వెళ్లాను. మధ్య మధ్యలో ఫోన్లు ఎలానూ ఉన్నాయి కదా.

2019 ఆగస్టు 1న నా అరవయ్యో పుట్టినరోజు నా సాహితీ మిత్రుల సమక్షంలో సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాను. నా సెలెక్టెడ్‌ పోయెమ్స్‌ పుస్తకం, నా తొలి కథా సంపుటి, నా మీద సాహితీ మిత్రులు రాసిన వ్యాసాల పుస్తకం ఆరోజే విడుదల చేయాలనుకున్నాను. ట్రెడిషనల్‌ ఆవిష్కరణ కాకుండా ఏ ఉపన్యాసాలూ లేకుండా పెద్దల చేతుల మీదుగా వాటిని విడుదల చేయాలనుకున్నాను. ఇంటికి వెళ్ళి ఆ ఆదర్శ దంపతుల్ని ఆహ్వానించాను. వీర్రాజు గారు కష్టపడి వచ్చి వేదిక మీద కూర్చుని రెండు ముక్కలు నా పుట్టిన రోజు అభినందనలు చెప్పి ఇది సిక్స్టీ పూర్తి అని చమత్కరించి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఆ తర్వాత రెండేళ్ళు కరోనా కల్లోలం ఎవరికి ఎవరులే అన్నంత వైరాగ్యం సృష్టించింది. ఆ సమయంలోనూ నేను అప్పుడప్పుడూ ఎక్కువగా సుభద్ర గారికే ఫోను చేసి వారి ఆరోగ్యం ఆరా తీసేవాడిని. చూడ్డానికి వెళ్ళలేదు అది నా దౌర్భాగ్యం.

నాకు తెలిసి తెలుగులో బుచ్చిబాబు, గోపీచంద్‌ సరసన నిలబెట్టాల్సిన రచయిత, కవి శీలావీ. వాస్తవంగా ఆయన ఆ స్థానాన్ని పొందారా? అది పరిశోధకులే తేల్చాలి. చిత్రకారుడిగా అనేక వేల పుస్తకాల ముఖచిత్రాల్లోనే ఆయన మిగిలిపోయారా లేక ఇంకెక్కడో ఉండాల్సిన కళాకారుడు అక్కడ లేకుండా పోయాడా? ఇదీ భావితరాలు తేల్చాలి. అన్నింటికంటే ఆయన వ్యక్తిత్వమే ఆయన పేరు ప్రఖ్యాతులకు అడ్డంకిగా మారిందా అన్న సందేహం కూడా కొంచెం లేకపోలేదు. వ్యక్తిత్వం అంటే కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడే దిగజారుడుతనం లేని వ్యక్తిత్వం. ఏ కాలంలో ఉన్నామో ఆ కాలజ్ఞానాన్ని అకాల జ్ఞానం అనుకునే అమాయకత్వం. కళకు కళే పురస్కారం అని నమ్మే కళాతత్వం. అతి నిరాడంబరత్వం.

అతి చిన్నతనంలోనే అతి సామాన్య కుటుంబంలో పుట్టి పొట్ట పట్టుకొని భాగ్యనగరానికి వచ్చి అతను రాసిందాని కంటే అతను చూసిందే అనంతమై వుంటుంది. ఏ రంగుల్ని చూశాడో అవి తన బొమ్మల్లో ఒదిగాయో లేదో. ఏ చీకట్లలో వెలుగుల్ని.. ఏ వెలుగుల్లో చీకట్లనీ చూశాడో అవి తన రచనల్లో ప్రతిఫలించాయో లేదో. మనుషుల మధ్య మృగాలనీ, మృగాల మధ్య మనుషుల్నీ.. ఏ నీడల గోడల మీద తారాడిన సత్యాసత్య దోబూచులాటల్నీ చూశాడో.. అవన్నీ తన రాతల్లో ప్రత్యక్షమయ్యాయో లేదో. అంత చిన్నప్పుడే మైనా లాంటి అంత గొప్ప నవల రాసినందుకైనా కొంతైనా ఈ సాహితీలోకం గౌరవించుకుందా? ఎప్పుడూ సత్యం వైపే, ఎప్పుడూ ప్రజల వైపే, ఎప్పుడూ మంచీ మానవత్వాల వైపే నిలబడ్డ ఒక గొప్ప నిబద్ధత గల ఆజీవన సాహితీ మూర్తిని ఈ లోకం తన నెత్తి మీద పెట్టుకుందా? ప్రశ్నలు ఎవరి మీదా వేయలేం. అయినా పురస్కారాలు కొలమానాలు కాదని నమ్మే నిప్పులాంటి కళాకారుడి గురించి ఇప్పుడీ చప్పుళ్ళు అనవసరం. బుచ్చిబాబు గారు శీలావీ రంగుటద్దాలు కథల సంపుటికి రాసిన ముందు మాట (1963)లో చెప్పిన మాటలు ఎప్పటికీ ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి. అరవై ఏళ్ళ క్రితం రాసిన మాటలు ఆయన అంతిమ ఘడియల దాకా సజీవంగానే ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. అవి ఎప్పటికీ శీలావీని బతికిస్తాయి.

'ఆదర్శం పట్ల ఉద్రేకం రేకెత్తించగల కథకుడు వీర్రాజు. ఆ ఉద్రేకంలో తను కొట్టుకుపోడు. గట్టున నిలబడి కొట్టుకుపోతున్న ప్రవాహాన్ని కారుణ్యంతో తిలకించగలడు. తెలుసుకున్న దాన్ని అందంగా చెప్పగలడు. ఎవర్నీ ఉద్ధరించాలన్న ఉబలాటం లేదు. తనకి నచ్చని వాటిని నరుకుదామని కత్తికి పదును పెడుతూ కూర్చోడు. ఒక్క కథతో సంఘాన్ని మరమ్మతు చెయ్యాలన్న దురుద్దేశం లేదు. కోపగించుకోడు. బాధపడతాడు.'

అదీ వీర్రాజు వ్యక్తిత్వం. చూస్తాడు.. తెలుసుకుంటాడు.. బాధపడతాడు.. చెప్తాడు. మళ్ళీ చూస్తాడు తెలుసుకుంటాడు.. బాధపడతాడు.. చెప్తాడు. అదీ స్థితప్రజ్ఞత అంటే. బుద్ధుడు చెప్పిన శీలం.. సమాధి.. ప్రజ్ఞ అంటే మన ఆధునిక కాలంలో ఆ మూడు లక్షణాలకు ప్రతిరూపంగా శీలావీని చూపించవచ్చు. ఆయన చనిపోయిన రోజున నేను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నాలుగు లైన్లు ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఆయనకు నా నివాళి అర్పిస్తాను.

మనలాగే ఉంటాడు గానీ మౌనిలాంటి వాడు
కవే గానీ కవిత్వం కంటే కాంతిమంతుడు
కథకుడే గానీ కథలను దాటిన పథికుడు
చిత్రకారుడే గానీ ఏ రంగులూ
తనకు అంటనివ్వని ఆదిమ కళాకారుడు
మంచితనం పర్యాయపదాలన్నింటి
పరమార్థంలాంటి వాడు
కాలం కాని కాలంలో పుట్టి
కాలాన్ని నివ్వెరపరచినవాడు
వెళ్ళిపోయాడు మరో కాలంలోకి మౌనంగా
మన మంచి మిత్రుడు.. సచ్చరిత్రుడు
శీలా వీర్రాజు
నివాళులు తండ్రీ..
 

- ప్రసాదమూర్తి
84998 66699