Oct 03,2020 23:52
ఇల్లొదిలి..ఐపిఎల్‌లోకి..

లక్ష్యం ఉండాలేగానీ... అసాధ్యమైనా.. సుసాధ్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే పట్టుదల, కృషి తప్పనిసరి. అలాగే ఈ కుర్రోడు తన కలను సాకారం చేసుకోవాలని ఇల్లు వదిలి పెట్టాడు. ఎలాగైనా ఐపిఎల్‌లో ఆడాలన్నదే అతని లక్ష్యం. అతనే ప్రస్తుతం ఐపిఎల్‌లో ఆడుతున్న పద్దెనిమిదేళ్ల యశస్వి జైస్వాల్‌. అతని స్ఫూర్తి కథనంలోకి వెళితే..

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు స్టీవ్‌స్మిత్‌, జోఫ్రా ఆర్చర్‌, జోస్‌ బట్లర్‌ వంటివారితో కలిసి దుబాయిలోని విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్నాడు. దాదాపు ప్రతిరోజూ తన క్రికెట్‌ హీరోలను కలుస్తున్నాడు. గత వారం ఎంఎస్‌ ధోనీకి మైదానంలో ఈ కుర్రాడు నమస్కారం పెట్టాడు. ఆ తర్వాత ట్విటర్‌ మొత్తం ఆ ఫొటోలు, వీడియోలే. కట్‌ చేస్తే.. గొప్ప క్రికెటర్‌ కావాలన్న లక్ష్యంతో పదేళ్ల వయసులో ఇల్లొదిలి వచ్చేసిన యశస్వి జైస్వాల్‌ మొట్టమొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. యశస్విది ఉత్తరప్రదేశ్‌. ఇల్లొదిలి వచ్చిన తరువాత ఎన్నో ఇబ్బందులుపడ్డాడు.
''నేను క్రికెట్‌ ఆడాలని నిజంగా అనుకున్నాను. కానీ, భారత్‌లో.. అందులోనూ ఒక గ్రామం నుంచి వచ్చినవారు అవకాశాలు పొందడం అంత సులభం కాదు'' అని ఐపీఎల్‌ పాడ్‌కాస్టలో చెప్పాడు.


''నువ్వు క్రికెట్‌ ఆడాలంటే ముంబయి వెళ్లాలని నా సీనియర్లు చెబుతుండేవారు. అది బుర్రలో అలాగే ఉండిపోయింది. మా అమ్మతో మాట్లాడేటప్పుడంతా ముంబయి వెళ్లాలి అంటుండేవాడిని.. నిద్రలో కూడా ఆ మాటే అనేవాడిని.''
ప్రపంచంలోనే అత్యంత జనాభా గల నగరాల్లో ఒకటైన ముంబయిలో తన కలలకు పునాదులు వేసుకోవాలని గట్టిగా అనుకున్నాడు. అంతేకాకుండా ఏదైనా సాధించేవరకూ తిరిగి ఇంటికి వెళ్లకూడదనీ నిర్ణయించుకున్నాడు యశస్వి. అందుకు నాలుగేళ్ల సమయం పట్టింది.


కష్టాలొచ్చినా..
ప్రపంచ ప్రఖ్యాత అజాద్‌ మైదాన్‌లో రోజంతా ప్రాక్టీస్‌ చేస్తుండేవాడు యశస్వి. ఫార్వర్డ్‌ డిఫెన్సులో తనను తాను మెరుగుపరుచుకుంటూ, ర్యాంప్‌ షాట్లు ఆడుతుండేవాడు. 25 ఎకరాల సువిశాల అజాద్‌ మైదాన్‌లో పదులకొద్దీ క్రికెట్‌ ఫీల్డ్స్‌ ఉంటాయి. సచిన్‌ టెండూల్కర్‌, ప్రస్తుత భారత ఓపెనర్‌ పృథ్వి షా వంటివారిని అందించిన మైదానం అది.
ముంబయిలో బతకడం కోసం యశస్వి చాలా కష్టాలు పడ్డాడు. డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఒక దుకాణంలో పనిచేసేవాడు. కానీ.. రోజంతా క్రికెట్‌ ఆడి, వచ్చాక అక్కడ పనిచేస్తుండడంతో అలసిపోయి పనిపై దృష్టి పెట్టలేకపోవడంతో యజమాని అతడిని తీసేశాడు.
''కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వండి'' అని ప్రాధేయపడ్డానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు యశస్వి.
''ఆ మరుసటి రోజు నా కోచ్‌కు ఫోన్‌ చేశాను. ఆయన వాళ్లింటికి వచ్చేయమనడంతో అక్కడ రెండు, మూడు నెలలు ఉన్నా'' అని చెప్పాడు యశస్వి. ''ఆ తరువాత క్రికెట్‌ క్లబ్‌లో గ్రౌండ్‌మెన్‌తో కలిసి ఒక టెంట్‌లో ఉన్నాను. మా టెంట్‌లో ఉండాలంటే స్కోర్‌ వేయాలి అని వారు చెప్పారు.. అది నాకు బాగానే అనిపించింది. అక్కడే ఉంటే పొద్దున్నే లేచి ప్రాక్టీస్‌ చేసుకోగలను.. స్కోర్‌ వేయగలను, అంపైరింగ్‌ చేయగలను.. ఆ డబ్బు నాకు బతకడానికి పనికొస్తుందనుకున్నాను'' అని చెప్పాడు.


తన సంపాదన పెంచుకోవడం కోసం యశస్వి పండగల సమయంలో వీధుల్లో తినుబండారాలు విక్రయించేవాడు. కానీ, ఆటగాడిగా మంచి ఆహారం తీసుకోవడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. అన్నం, పిండి, బంగాళదుంపలు తినేవాడు.. వారంలో ఒక్క ఆదివారం చికెన్‌ తినేవాడు. ''ఆదివారాల కోసం వేచి చూసేవాడిని'' అని యశస్వి గుర్తు చేసుకున్నాడు. తాను కలిసి నివసించే గ్రౌండ్‌మెన్‌తో తిండి కోసం పోరాడే కంటే ఏమీ తినకుండా నిద్రపోయేవాడు చాలాసార్లు.


యశస్వికి అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చేది.. ''1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిని గట్టిగా వాటేసుకోవాలని ఎన్నోసార్లు అనిపించేది. భావోద్వేగాలు బలహీనతలుగా మారుతాయని అనిపించి ఆ ఆలోచనలను దగ్గరకు రానిచ్చేవాడిని కాదు. అమ్మ గుర్తొచ్చినప్పుడు ఏడుపొచ్చేది. నేను పడుతున్న కష్టాలు ఇంట్లో చెప్పేవాడిని కాదు. నాకు తెలుసు.. నేను ఇబ్బంది పడుతున్నానని చెబితే ఇంటికి వచ్చేయమంటారు'' అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం
ఇప్పుడు యశస్వి తన కోచ్‌, చాలాకాలంగా మెంటార్‌గా ఉన్న జ్వాలాసింగ్‌తో కలిసి ఉంటున్నాడు. అజాద్‌ మైదాన్‌లో తన కంటే పెద్దవాళ్లు, సీనియర్లు బౌలింగ్‌ చేస్తుంటే సునాయాసంగా ఆడుతున్న యశస్విని చూశాడు. ఆయన. యశస్విలోని ప్రతిభను గుర్తించిన జ్వాలాసింగ్‌ అప్పటి నుంచి అతనికి తర్ఫీదు ఇచ్చారు.


ఈ ఏడాది 'అండర్‌-19 ప్రపంచ కప్‌'లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడం.. దేశవాళీ వన్డే క్రికెట్‌లో 71 పరుగుల సగటు ఉండడంతో ఐపీఎల్‌లో యశస్వికి డిమాండ్‌ ఏర్పడింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడితో రూ.2.4 కోట్లకు ఒప్పందం చేసుకుంది. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన తరువాత కామెంటేటర్లు, క్రికెట్‌ పండితుల నోట్లో యశస్వి పేరు నిత్యం నానుతుండడంతో త్వరలో టీమిండియాలో చోటు దొరుకుతుందనీ అంచనా వేస్తున్నారు.


ముంబయి తరఫున 17 ఏళ్ల వయసులో ఆడుతూ 154 బంతుల్లో 203 పరుగులు చేసి, రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ పోటీలో నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌తో కలిసి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు.
ఎన్నో కష్టాలకోర్చి అనుకున్నది సాధిస్తున్న యశస్వికి టైటానిక్‌ సినిమా అంటే ఇష్టమట. అందులో నటించిన కేట్‌ విన్‌స్లెట్‌ అంటే మరీ ఇష్టమట. ''కేట్‌ విన్‌స్లెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఆమెను కలుస్తాను'' అంటున్నాడీ యువ క్రికెటర్‌. ''నేను చాలా రొమాంటిక్‌.. నాకు సెలీన్‌ డియాన్‌ రాసిన 'మై హార్ట్‌ విల్‌ గో ఆన్‌' పాట అంటే ఇష్టం'' అంటూ తన ఇష్టాయిష్టాలూ చెప్పుకొచ్చాడు యశస్వి. ఆల్‌ ది బెస్ట్‌ యశస్వి!