అమరావతి : ఈ నెల 19 వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో సాధారణ ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా ఆగిన ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు.. దాదాపు 16 నెలల తర్వాత తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. ఇంతవరకు ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్ కోసం మాత్రమే రైళ్లను నడిపారు. ఇప్పుడు 82 సాధారణ రైళ్లను పునరుద్ధరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమయింది. వాటిలో... 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ... ప్యాసింజర్ రైలులో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇవ్వనున్నారని చెప్పారు. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్ రూల్స్‌ను పాటించాలని స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలోనూ కోవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకులు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని పేర్కొన్నారు.










