Jul 16,2021 17:44

వాషింగ్టన్‌ : అమెరికాలో ఓ రెస్టారెంట్‌లో తయారుచేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. అదేంటీ.. గిన్నీస్‌ రికార్డుకెక్కేంత ప్రత్యేకత ఆ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌కి ఏముంది అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య చాలామంది ఇష్టంగా తింటున్న ఆహార పదార్థాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కూడా ఒకటి. అందుకే న్యూయార్క్‌లోని సెరెండిపిటి 3 అనే రెస్టారెంట్‌ సిబ్బంది జూలై 13న నేషన్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ డే సందర్భంగా వినూత్నంగా ఓ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను తయారుచేశారు. అదెలాగంటే.. కేవలం 23 క్యారెట్ల బంగారపు డస్ట్‌తో దాన్ని రూపొందించారు. అమెరికన్‌ డాలర్లలో దీనివిలువ 200 డాలర్లు కాగా.. భారత కరెన్సీలో సుమారు దీని విలువ 15 వేల రూపాయల వరకు ఉంటుంది. అందుకే ఇంత ఖరీదైనది కాబట్టే.. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌కు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది.