Feb 28,2023 19:14

రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న జెవివి నాయకులు

ప్రజాశక్తి-వాల్మీకిపురం: జన విజ్ఞాన వేదిక 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్రభుచరణ్‌ మాట్లాడుతూ సమాజంలో పాతుకుపోయిన మూఢవిస్వాసాలను నియంత్రించడంతో పాటుగా నిరక్షరాస్యత నిర్ములన, మద్యపాన నిషేధం, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి లక్షణాలతో జనవిజ్ఞాన వేదిక ఏర్పడిందన్నారు. పూర్వ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సైన్సు ఫలితాలు ప్రజలకు చేకూరాలని సైన్సు ప్రజల జీవితాలలో విజ్ఞాన దీపిక కావాలని కోరుకునేవారందరూ ఒక గొప్ప ఆశయానికి శ్రీకారం చుట్టారని ఈ సమిష్టి కృషి ఫలితంగా 1988 ఫిబ్రవరి 28న విజయవాడలో జనవిజ్ఞన వేదిక ఆవిర్భవించిందన్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు చెకుముఖి పోటీలు నిర్వహించడం, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచడం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫైరోజా బేగం, డాక్టర్‌ శ్రీలక్ష్మి, సిబ్బంది గోవిందమ్మ, రజిత, లావణ్య, భాస్కర పాల్గొన్నారు.