ప్రజాశక్తి- బొబ్బిలి : గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలని కోరుతూ సిపిఎం చేపట్టిన పాదయాత్రను గురువారం సాలూరు పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎం.కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయం వరకు చేపట్టే ఈ పాదయాత్ర రామభద్రపురం మీదుగా గురువారం సాయంత్రానికి బొబ్బిలికి చేరుకుంది. పాదయాత్రకు బొబ్బిలిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి వేణు ఆధ్వర్యాన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనారోగ్యం పాలైతే అంబులెన్స్, ఇతర వాహనాలు వెళ్లడం లేదని, డోలీల మోతతో సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు సీదరపు అప్పారావు, మర్రి శ్రీనివాసరావు, బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి.శంకరరావు, మండల కార్యదర్శి ఎస్.గోపాలం, గిరిజన సంఘం నాయకులు హిమరక జానకి, నూకరాజు, సురేష్, మున్నా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, వెంకట్ పాల్గొన్నారు.










