Jan 24,2023 09:42

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో కలెక్టర్‌ బసంత్‌కుమార్‌తో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

          పుట్టపర్తి రూరల్‌ : అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గిరిజనుల భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, తక్షణం దీనిని అడ్డుకుని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం వద్ద ఎరుకుల కులస్తులకు చెందిన భూమిని కబ్జాకు యత్నిస్తున్న ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక ఆర్డీవో, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్ద అధ్యక్షతన జరిగిన ధర్నాలో ముఖ్య అతిథిగా ఇంతియాజ్‌ పాల్గొని మాట్లాడారు. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం సర్వే నెంబర్‌:99లో ఏడు ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని ఎరుకుల కులానికి చెందిన పేదలు పట్టాలు పొంది తాతల కాలం నుంచి సాగులో ఉన్నారన్నారు. ఇటీవల ఈ భూమిని అక్రమ కొనుగోలు పేరుతో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డిలు కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. తమ భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ గిరిజనులు దాదాపు మూడు నెలల నుంచి అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు లేరన్నారు. గిరిజనులకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాలు నిలిచాయన్నారు. అధికారులు దీనిపై స్పందించాలని కోరారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గిరిజనులు వారి సమస్యను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ వారి వద్దకొచ్చి సమస్యను తెలుసుకున్నారు. గిరిజనుల భూ సమస్యపై జిల్లా ఉన్నత స్థాయి అధికారితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల అక్రమ కేసులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అవసరం అనుకుంటే వివాదాస్పద స్థలం వద్ద 144 సెక్షన్‌ అమలు చేసేలా తహశీల్దార్‌కు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇక సోమందేపల్లిలో ఇటీవల మృతిచెందిన పందులకు సంబంధించి వాటి యజమానులకు పరిహారం అందేలా చూస్తామని హామ ఇచ్చారు. కలెక్టర్‌ హామీతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు పైపల్లి గంగాధర్‌, బాబా, గౌస్‌లాజం, జానపద కళాకారుల సంఘం జిల్లా నాయకులు నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.