గాంధీనగర్ : గుజరాత్‌లో కొత్తగా ఎన్నికైన 17 మంది మంత్రుల్లో 24 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలోని ముఖ్యమంత్రితో సహా మంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లపై విశ్లేషణ ఆధారంగా గుజరాత్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) పేర్కొంది. కొత్తగా ఎన్నికైన 17 మంది మంత్రుల్లో నలుగురిపై క్రిమినల్ కేసులు ఉండగా, ఒక మంత్రి తనపై తీవ్రమైన క్రిమినల్ కేసు ఉన్నట్లు ఎడిఆర్ పేర్కొంది. 17 మంది మంత్రుల్లో 16 మంది కోటీశ్వరులని తెలిపింది. 17 మంది ఆస్తుల సగటు విలువ రూ.32.7 కోట్లు. 372.65 కోట్ల ఆస్తులతో సిధ్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మంత్రి బల్వంత్ సిన్హా చందన్ సిన్హా రాజ్‌పుత్ మొదటిస్థానంలో ఉన్నారు. కాగా, 92.85 లక్షల ఆస్తులతో దేవగఢ్ బారియా నియోజకవర్గానికి చెందిన ఖబద్ బచుభారు మగన్ భారు అత్యల్ప ఆస్తులు కలిగిన మంత్రి.
ఆరుగురు మంత్రులు (35 శాతం) తమ విద్యార్హతలు 8వ తరగతి మరియు 12 వతరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, ఎనిమిది మంది (47 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిఉన్నట్లు ప్రకటించారని ఎడిఆర్ పేర్కొంది. ముగ్గురు మంత్రులు (18శాతం) డిప్లొమా హోల్డర్లుగా తెలిపింది.










