- కోనసీమ జిల్లాలో తొమ్మిది మండలాలు జలదిగ్బంధం
- పడవలపైనే ప్రయాణాలు - ఇళ్లలోకి చేరిన ఒండ్రు
- వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
ప్రజాశక్తి - యంత్రాంగం : నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం నాటికి శాంతించినా లంకల్లో ఇంకా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.పి.గన్నవరంలో కనకాయిలంక కాజ్‌వే, అయినవిల్లిలో అయినవిల్లిలంక కాజ్‌వేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో ప్రజలు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుల్లో మత్స్యకారుల గృహాలు నీట మునగడంతో వారు పడవలపైనే జీవనం సాగిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని గొమ్ముగూడెం, కుక్కునూరులోని గణేష్ నగర్, రామాలయం కాలనీ, రజక బజారు, దాసరి బజార్ కాలనీల్లోని ఇళ్లల్లో అడుగు మేర ఒండ్రు పేరుకుపోయి చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. మళ్లీ గోదావరికి వరద వచ్చే ప్రమాదం ఉండటంతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారు ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద బాధితులకు పని లేకపోవడం, ఓ వైపు వర్షాలు కురుస్తుండటంతో ఉన్న డబ్బులు అయిపోవడంతో ఆ నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న తమకు తిండైనా పెట్టండి లేదా పనైనా చూపాలని వేడుకుంటున్నారు. ఆనగార్లంక, పెదమల్లంలంక, అయోధ్యలంకలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతం. రాత్రయిందంటే చాలు కాలు కింద పెట్టలేని పరిస్థితి. ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరికీ భోజన వసతి గాని, చిన్న పిల్లలు, బాలింతలకు కనీసం పాల ప్యాకెట్ కూడా పంపిణీ చేయలేదని వాపోతున్నారు.
- పశ్చిమగోదావరి లంక గ్రామాల్లో ఉధృతి
పశ్చిమగోదావరి లంక గ్రామాల్లో వరద ఉధృతి మరింత పెరిగింది. ముందు జాగ్రత్తగా ఆచంట మండలం కోడేరులో రెండు ఇంజిన్ పడవలను సిద్ధం చేశారు. ఆనగార్లలంక, కోడేరు పల్లిపాలెం, అయోధ్యలంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది.
- గుట్టలపైనే జీవనం
గోదావరి, శబరి శాంతించినా ముంపు మండలాల్లోని వందల గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అల్లూరి జిల్లా విఆర్.పురం మండలంలోని రామవరం పంచాయతీ ప్రజలు ఇంకా గుట్టలపైనే జీవనం సాగిస్తున్నారు. వారం రోజులుగా కరెంట్ నిలిచిపోవడంతో దోమలు, విష పురుగుల మధ్యనే వీరంతా గడుపుతున్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి మండల కేంద్రానికి వచ్చి అక్కడున్న కొద్దిమందిని కలిసి వెళ్లిపోయారని, గుట్టలపైనా, అడవుల్లోనూ ఉన్న వారిని కనీసం పలకరించలేదని, వాకబు చేయలేదని వాపోయారు. ఇప్పటికే తమలో చాలా మంది మలేరియా, టైపాయిడ్, డెంగీ వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు. చింతూరు మండలంలోని ఎజి.కోడేరు, చట్టి, చెడుమూరు, మల్లెతోటల్లో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు.
- నెమ్మదించిన గోదావరి
నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం నాటికి నెమ్మదించింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద సాధారణ స్థితికి చేరుకుంది. ఇక్కడ 39.90 అడుగుల మేర ప్రవాహం ఉంది. దీంతో అన్ని ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉససంహరించారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 14.60 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లో ఉంది. కాటన్ బ్యారేజీ నుంచి 14,24,627 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇదే సమయంలో డెల్టా కాలువలకు 11,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.










