Jul 14,2021 21:20

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నల్ల చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాలో బిజెపి ప్రభుత్వం దేశద్రోహం, హత్యాయత్నం కేసులు బనాయించింది. ఈ నెల 11న సిర్సాలోని హర్యానా డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వాను రైతులు అడ్డుకున్నారు. బిజెపి నాయకుల సామాజిక బహిష్కరణలో భాగంగానే వారు ఈ చర్య తీసుకున్నారు. దీనిపై సిర్సా పోలీసులు సెక్షన్‌ 124 ఎ (దేశద్రోహం)తో పాటు 307 (హత్యాయత్నం), 186 (ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వర్తించడంలో ప్రభుత్వోద్యోగులను అడ్డుకోవడం) వంటి క్రూరమైన సెక్షన్ల కింద కేసులు బనాయించారు. రైతు నేతలు హరిచరణ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌తో పాటు వంద మందికి పైగా అన్నదాతలపై కేసులు పెట్టారు.. సిర్సా సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అర్పిత్‌ జైన్‌ మాట్లాడుతూ, ఇప్పటివరకు, ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. ఈ నెల 11న డిప్యూటీ స్పీకర్‌ అధికారిక కారును సిర్సాలో రైతుల బృందం నినాదాలు చేస్తూ, నల్ల జెండాలు ఊపుతూ అడ్డుకుంది. ఈ ప్రదర్శన సందర్భంగా రైతులు రాళ్లతో వాహనాల విండ్‌ స్క్రీన్‌ను పగులగొట్టారని బిజెపి ఆరోపిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేవు.
రైతులను రెచ్చగొట్టడానికే దేశద్రోహం, హత్య కేసులు : దర్శన్‌పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) సీనియర్‌ నాయకుడు దర్శన్‌ పాల్‌ మాట్లాడుతూ ఇలాంటి చర్యలు తీసుకొని రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ''దేశద్రోహ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం రైతులను రెచ్చగొడుతోంది. వాహనం విండ్‌స్క్రీన్‌ పగిలితే దేశద్రోహం, హత్య కేసులు ఎలా పెడతారు?'' అని ప్రశ్నించారు. రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేయడం దేశద్రోహ నేరమా?, వారిపై కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''బిజెపి, జెజెపి, చట్టాలకు మద్దతు ఇచ్చే స్వతంత్రులతో సహా అందరు శాసన సభ్యులను శాంతియుతంగా బహిష్కరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని మేము ఇప్పటికే ప్రకటించాం'' అని దర్శన్‌ పాల్‌ అన్నారు.
తీవ్రంగా ఖండించిన ఎస్‌కెఎం
హర్యానా బిజెపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా భయానక వ్యూహాలను ప్రయోగించడం కొనసాగిస్తోందని ఎస్‌కెఎం విమర్శించింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వంద మంది రైతులపై సిర్సా పోలీసులు తీవ్రమైన దేశద్రోహ అభియోగంతో కేసు నమోదు చేయడం దారుణమన్నారు. హర్యానా రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వ సూచనల మేరకు రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను ఎస్‌కెఎం తీవ్రంగా ఖండించింది. 2020 నవంబర్‌లో హర్యానాలో రైతులు ఢిల్లీ వెళ్లకుండా నీటి ఫిరంగులు, టియర్‌ గ్యాస్‌, బారికేడ్లు, ముళ్ల తీగలతో దాడికి పాల్పడిందని గుర్తు చేసింది. తాజా కేసును కోర్టులో సవాల్‌ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ ఎస్‌కెఎం సహాయం చేస్తుందని పేర్కొంది.