కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) బహుశా బాగా విజయవంతమయ్యే టీవీ ప్రసార కార్యక్రమాలలో ఒకటి. ఈ నెలలో శుక్రవారం నాడు ప్రసారమైన ఒక ప్రత్యేక ఎపిసోడ్ 'కర్మ వీర్'లో కెబిసి నిర్వాహకుడు అమితాబ్ బచ్చన్ ఒక పోటీదారుడిని, ''డా|| బి.ఆర్. అంబేద్కర్ తగులబెట్టిన పుస్తకం ఏది?'' అని అడిగారు. కెబిసి లో అడిగే ప్రతీ ప్రశ్న చదువుకొనే విధంగా స్క్రీన్ పైన కనపడుతుంది. ఆయన అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ''మను స్మృతి''. ఆ కార్యక్రమానికి అతిథిగా బెజవాడ విల్సన్ కూడా హాజరయ్యారు. విల్సన్ దేశంలోని ప్రముఖ కుల వ్యతిరేక కార్యకర్త. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తి వేసే సఫాయి పని వ్యతిరేక కార్యకర్త.
ప్రేక్షకులలో ఒక వర్గానికి చెందినవారు ఆ ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ఆ ప్రశ్న, హిందూ మతాన్ని అవమానించడంగా భావించి, కోపోద్రిక్తులయ్యారు. అది వారి మనోభావాలను గాయపర్చిందని, దానిలో హిందూ సమాజాన్ని విభజించే ప్రయత్నం కనిపించిందని అన్నారు. 'హిందూ వ్యతిరేకి కానటువంటి అంబేద్కర్‌ను హిందూ వ్యతిరేకిగా చూపించారు...' అని వారి ఆగ్రహాన్ని ఒక ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.
'మనుస్మృతి'లో స్పష్టంగా వివరించిన కుల వ్యవస్థ యొక్క భయంకరమైన స్వభావం పైన, ఆ ప్రశ్న దృష్టి మరల్చినట్లు భావించిన కొందరు ప్రేక్షకులు అభినందించారు. అయినప్పటికీ, కార్యక్రమ నిర్వాహకునికి, ''హిందువుల మనోభావాలను గాయపరచాలని'' ఉద్దేశపూర్వకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారని భావించి కార్యనిర్వాహక అధికారులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆధిపత్య హిందూ జాతీయవాదులు ఒకవైపు అంబేద్కర్‌ను కీర్తిస్తూనే, మరొకవైపు దళితుల సమాన హక్కుల సాధన కోసం ఆయనకున్న ఆలోచనలను, ఆయన పోరాటాలను అణగ దొక్కాలని కోరుకుంటారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుచరులు అంబేద్కర్ వార్షికోత్సవ సంబరాలను ఆనందంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. అలాంటి ఒక కార్యక్రమానికి 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దానిలో తనను తాను గొప్ప 'అంబేద్కర్ భక్తునిగా' వర్ణించుకున్నారు. అంతేకాకుండా అంబేద్కర్‌ను, అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో పోల్చారు.
అయితే, మార్టిన్ లూథర్ కింగ్, ఆ కాలంలో నోబెల్ బహుమతి పొందిన అతి పిన్న వయస్కుడు (అప్పటికి ఆయన 35 ఏళ్ళ యువకుడే). కాగా, దశాబ్దాల తరబడి అమానవీయంగా చేతులతో మానవ మలమూత్రాలను ఎత్తివేయించే పనికి వ్యతిరేకంగా బెజవాడ విల్సన్ కృషి చేస్తున్నారు. 'కర్మ యోగి మోడీ' పుస్తకానికి రాసిన ముందు మాటలో...చేతులతో చేసే పాకీ పనిని ఒక ''ఆధ్యాత్మిక'' అనుభవంగా కీర్తించారు మోడీ. అంటే, ఎవరి మనోభావాలు వాస్తవంగా దెబ్బ తింటున్నాయి?
ఒక వాస్తవ చారిత్రక సంఘటన అయిన, 'మనుస్మృతి దహనం' వలన తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని చెప్తున్న వారు...మహమ్మద్ ప్రవక్తను అమర్యాదగా చూపించే కార్టూన్ల విషయానికి వచ్చేసరికి తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తీవ్ర స్వరంతో సమర్ధించుకుంటారు. ఘోరం ఏమంటే, కార్టూన్లు తమ మనోభావాలను గాయపరిచాయనే కారణంతో మూఢభక్తులు కొందరు ఫ్రాన్స్‌లో నలుగురిని హత్య చేశారు.
అంబేద్కర్ ఒక గొప్ప మేధావి. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కుల వ్యతిరేక, అంటరానితనం వ్యతిరేక ఉద్యమాలలో ఒక దానికి ఆయన నాయకత్వం వహించారు. హిందూ ఆచారాలను విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇతరులకు కోపం వచ్చినప్పటికీ, ఆయన నిష్కర్షగా మాట్లాడేవారు. ఆయన అవగాహనలో, హిందూ మతం అనేది బ్రాహ్మణవాద మతం. పదిహేనవ శతాబ్దపు కవి కబీర్‌ను తన గురువుగా పరిగణించారు. భక్తి, సాంప్రదాయాల పట్ల ఉండే ప్రేమ, స్నేహపూర్వక సంబంధాలను సమర్థించారు. కానీ హిందూ మతంలో ఉన్న అనేక భావాలలో...ఆధిపత్య ధోరణి వున్నది బ్రాహ్మణ వాదానికేనన్న అంబేద్కర్ అభిప్రాయం మనకు ఆయన జీవితం నుండి, రచనల నుండి అర్ధమవుతుంది. అందుకే ఆయన ''హిందూ మతాన్ని బ్రాహ్మణవాద మతం'' అని నమ్మారు.
'మనుస్మృతి'లో కేంద్రీకరించబడిన బ్రాహ్మణవాద విలువల వ్యక్తీకరణను అంబేద్కర్ గమనించారు. అందుకే, అందరూ ఉపయోగించే తాగునీటి బావులలో దళితులు కూడా నీరు తోడుకునేందుకు, దేవాలయాలలో ప్రవేశించే హక్కుల కోసం పోరాటం చేశారు.హిందువులలో ఒక వర్గానికి చెందినవారు పవిత్రంగా భావించే ఆ పుస్తకాన్ని తగులబెట్టే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈరోజుల్లో 'మనుస్మృతి'ని చదివి, అనుసరించే వారు ఎవరు? అని మీరు ఆశ్చర్యంగా అడగవచ్చు. అనేకమంది భారతీయులకు సంస్కృత రచనలు అందుబాటులో వుండకపోవచ్చు. అయినప్పటికీ ఆ రచనలు భారతీయ విలువల వ్యవస్థ పైన, హిందువుల లోని కొన్ని పెద్ద సెక్షన్ల పైన ప్రభావం చూపుతాయి. జర్నలిస్టు అక్షయ ముకుల్ తన 'గీత ప్రెస్ మేకింగ్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో హిందువుల మనసులపై ప్రచురణ సంస్థ ఎంత ప్రభావం చూపిందో వివరించారు. గీత ప్రచురణ సంస్థ స్టోరుకు వెళ్తే, తక్కువ ఖరీదులో అచ్చయిన పుస్తకాలు, పెద్ద సంఖ్యలో దర్శనమిస్తాయి. ప్రజలకు అవి మనువు విలువలను ఏ విధంగా స్పష్టంగా తెలియజేస్తాయో వివరిస్తాయి. హిందూ మహిళల విధులపై...సాధారణ ప్రజల భాషలో ప్రచురితమైన అలాంటి ఒక రచన మనుస్మృతి వివరణ తప్ప వేరే ఏదీ కాదు. ఇంకా అవాక్కయ్యే విషయం ఏమిటంటే, ఈ పుస్తకాన్ని ఐదు రూపాయల ధరతో, కొన్ని లక్షల కాపీలు అచ్చు వేశారు.
అంబేద్కర్ 'హిందూ వ్యతిరేకి' కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఈ విషయంలో స్వయంగా ఆయన మాటలు, ఇంతకు ముందు మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాయి. తాను హిందువుగా పుట్టినప్పటికీ, హిందువుగా మరణించనని వాగ్దానం చేసి, దానిని నిలబెట్టుకున్నారు. నేటి పాలక పార్టీ లక్ష్యమైన హిందూ రాజ్య స్థాపన మీద కూడా ఆయనకు అవే అభిప్రాయాలు ఉన్నాయి. దేశ విభజనపై ఆయన చేసిన రచనలో ''ఒకవేళ హిందూ రాజ్య స్థాపనే నిజమైతే, ఈ దేశానికి అది పెద్ద విపత్తు కావడంలో ఎటువంటి సందేహం లేదు. హిందువులు ఏమనుకున్నా ఉపయోగమేం లేదు. హిందూ మతం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఒక పెద్ద ప్రమాదం. ఆ కారణంగా హిందూ మతానికి ప్రజాస్వామ్యంతో పొసగదు. ఏ విధంగానైనా హిందూ రాజ్యాన్ని అడ్డుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు.
అలాంటి సూత్రీకరణలు వున్నప్పటికీ, బిజెపి రాజకీయ వ్యూహంలో అంబేద్కర్‌ను కీర్తిస్తూనే, ఆయన ఆలోచనలను బలహీనపర్చి, సామాజికంగా ఆయన చర్యలపై పోరాటం చేయడానికి కొన్ని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు. కానీ హిందూత్వ శిబిరానికి, వారికి సంతృప్తినిచ్చే వ్యవస్థతో రాజ్యాంగాన్ని భర్తీ చేయాలని ఉంది. క్షేత్ర స్థాయిలో దళితులలో ప్రభావం చూపేందుకు వారు బహుముఖ వ్యూహాలను అవలంబిస్తున్నారు. అంబేద్కర్ ''కుల నిర్మూలనకు'' పిలుపునిస్తే...ఆర్‌ఎస్‌ఎస్ ఆ పిలుపుకు వ్యతిరేకంగా, హిందూ సమాజానికి కుల వ్యవస్థే బలం, అన్ని కులాలు సమానమే, కానీ అవి పోషించే పాత్రలు భిన్నమైనవిగా నిర్ణయం చేశారనే సందేశాన్ని ప్రచారం చేసే ''సామాజిక్ సమరస్త మంచ్''ను స్థాపించింది.
దళితులను హిందూత్వలో భాగం చేసేందుకు, హిందూ జాతీయవాద రాజకీయాలలో వారిని పదాతి దళం (ఫూట్ సోల్జర్స్)గా సిద్ధం చేసేందుకు, వారి రాజకీయ విశ్వాసాలకు అనుగుణమైన ''సామాజిక మార్పు'' కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. కొందరు దళిత నాయకులు అధికారానికి ఆకర్షితులై హిందూత్వలో భాగం అయ్యేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ఈ విషయాన్ని, ఇటీవల కాలంలో, తనను తాను ''మోడీకి హనుమంతుడినని'' ప్రకటించుకున్న లోక్ జనశక్తి పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ బాగా వ్యక్తీకరించారు.
అంబేద్కర్ భావజాలం, సామాజిక పోరాటాలకు అనుగుణంగా...దళిత నాయకులలో ఒక వర్గానికి చెందినవారు, సామాజిక కార్యకర్తలు...దళితుల గౌరవం, దళితుల సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. అలాంటి నాయకులు చాలా తక్కువగా ఉండడం, వారి ప్రయత్నాలను బలహీన పర్చడం ప్రధానమైన అడ్డంకిగా మారింది. సామాజిక న్యాయం, బాబా సాహెబ్ కలలను నిజం చేసే దిశగా కదం తొక్కడానికి ముందు అధిగమించాల్సిన సవాళ్ళు అనేకం వారి ముందున్నాయి. ఆయన మనుస్మృతిని తగులబెట్టడానికి దారితీసిన కారణమదే.
రామ్ పునియాని, వ్యాసకర్త
నేడు డా|| బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి ్య
('న్యూస్ క్లిక్' సౌజన్యంతో)











