గత వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 'సంస్కృతి, శాంతి' అన్న అంశంపై ఐరాస అలయెన్స్ ఆఫ్ సివిలైజేషన్ (యుఎన్‌ఒఎసి) ప్రతిపాదించిన తీర్మానంపై భారత ప్రతినిధి చేసిన ప్రకటన ఆరెస్సెస్ విద్వేషపు భావజాలాన్ని ప్రతిబింబించేదిగా ఉండడం చాలా శోచనీయం. 193 సభ్య దేశాలు ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి ఉపయోగించిన భాష, వ్యక్తం చేసిన భావం మన దేశ హుందాతనాన్ని తగ్గించేదిగా ఉంది. ఇతర మతాల కన్నా అబ్రహామిక్ మతాలు అదే ఇస్లాం, క్రిస్టియన్, జుడాయిజం మతాల పరిరక్షణకే ఐరాస ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని, హిందూ, సిక్కులు, బౌద్ధులు, జైనులు మైనార్టీలుగా ఉన్న చోట వారిపై జరిగిన దాడుల గురించి ఎందుకు ప్రస్తావించరు అంటూ ప్రభుత్వం తెచ్చిన వాదన గురివింద గింజ సామెతనే గుర్తుకు తెస్తోంది. భారత్, పాకిస్తాన్ కర్తారాపూర్ గురుద్వారా కారిడార్ ను ఐరాస స్వాగతిస్తుంది. కానీ, శిక్కుల మందిరాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న విషయం గురించి మాట్లాడదంటూ పరుషమైన పదజాలాన్ని ఉపయోగించింది. నాగరికతల మధ్య ఘర్షణను నివారించి , సమాజం- సంస్కృతుల మధ్య విభజనకు బదులు శాంతి సామరస్యాలను పెంపొందించే ఉద్దేశంతో 2005లో ఏర్పడిన యుఎన్‌ఎఓసిని కూడా మోడీ ప్రభుత్వం వదలలేదు. మైనార్టీలు ఏ మతానికి చెందినవారైనా వారిని మిగతా పౌరులతో సమంగా చూడాల్పిందే. దీనిపై రెండో మాటకు తావు లేదు. ఇక్కడ విడ్డూరమేమిటంటే ఈ దేశంలో మైనార్టీలపై దాడులు చేస్తున్నవారే ఇతర దేశాల్లో మైనార్టీల గురించి మాట్లాడడం. అందులోనూ మూడు మతాలకు చెందినవారిపైనే దాడులు జరుగుతున్నాయన్నట్లు చెప్పడం. ఇది మోడీ ప్రభుత్వ కపట నాటకాన్ని బయటపెడుతున్నది. భారత్‌లో బిజెపి అధికారంలోకి వచ్చాక మైనార్టీ ముస్లింలపై దాడులు ఎలా పెరిగిపోతున్నవి చూస్తున్నాము.
యుఎన్ భద్రతా మండలిలో రెండేళ్ల పాటు సభ్యురాలిగా కొనసాగనున్న భారత్ యుఎన్‌ఒఎసి, ఇతర ఐక్యరాజ్యసమితి అంగాల తీర్మానాలను అడ్డుకోవడానికి ఒక పథకం ప్రకారం యత్నిస్తున్నది. సిఎఎ సవరణను యుఎన్‌హెచ్‌ఆర్‌సి ఖండించడం, సిఎఎ నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఫిబ్రవరిలో సాగించిన మత మారణ కాండను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆక్షేపించడం మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే ప్రపంచ సంస్థ విశ్వసనీయతపైనే తన దాడిని ఎక్కుపెట్టింది. బిజెపి ప్రభుత్వ తీరు చూస్తుంటే తాను చేసే దురాగతాలను ఐరాసతో సహా ఎవరూ ప్రశ్నించరాదన్నట్టుగా ఉంది.
ఇతరులకు నీతులు చెప్పే ముందు మోడీ ప్రభుత్వం దేశీయంగా తన రికార్డు ఏమిటో సరిచూసుకోవాలి. పౌరసత్వం త్వరితగతిన మంజూరు చేసే విషయంలో ప్రత్యేకించి ముస్లింలను ఒక్కరినే పక్కనపెట్టడం మైనార్టీలను వేధించడం కాదా? సిఎఎను నిరసించినందుకు దేశ రాజధానిలో గత ముప్పయ్యేళ్లలో ఎన్నడూ లేని విధంగా భయానక మత మారణకాండ సృష్టించినవారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా బిజెపి నాయకులు ప్రపంగాలు చేస్తే వారిపై ఎలాంటి కేసులు లేవు. పైగా బాధితులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేశారు. భారత దేశంలో ముస్లింలు మెజార్టీగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌ను ముక్కలు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి దిగజార్చడాన్ని ఏమనాలి. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్ వంటి చట్టాలను తెచ్చి మతాంతర వివాహాలు చేసుకునేవారిపై దాడులు చేస్తున్నాయి. తమ దేశంలో మైనార్టీ ముస్లింలను వేధిస్తే అది సాధారణ అంశంగా పరిగణించే ప్రభుత్వం, ఇతర దేశాల్లో మైనార్టీల గురించి మొసలి కన్నీరు కార్చుతున్నది. మతం పేరుతో మనుషుల మధ్య చీలికలు తెచ్చి మధ్య యుగాలనాటి ఆటవిక సంస్కృతి వైపు సమాజాన్ని నెట్టాలని చూసే ఇటువంటి శక్తులకు చెక్ పెట్టాలి. బహుళత్వ సంస్కృతిని రాజ్యాంగంలో నిబిడీకృతమై ఉన్న సెక్యులర్ జీవన విధానాన్ని పరిరక్షించుకోవడం మన అందరి కర్తవ్యం.










