ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దాం : కలెక్టర్ గిరీష
ప్రజాశక్తి - రాయచోటి : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వివిధ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ గిరీష పిఎస్ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 84 పోలింగ్ కేంద్రాలున్నాయని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్చి 13న నిర్వహించబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఎన్నికల ఏజెంట్లు గంట ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సభలు సమావేశాలు నిర్వహించేందుకు 24 గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలన్నారు. బ్యానర్లు హోల్డింగులకు, బ్యానర్ల ప్రింటింగ్ తప్పక అనుమతి అవసరమన్నారు. . పోలింగ్‌కు 28 గంటల ముందు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు ఓటర్ స్లిప్‌తో పాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పోస్ పోర్టు, ఎంప్లారు ఐడి కార్డు, ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పేపర్ బ్యాలెట్ సిస్టం ఉంటుందని, పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోను, పెన్నులు తీసుకురాకూడదన్నారు. ఓటర్లు ఓటు వేసే విధానం గురించి కలెక్టర్ వివరించారు.
నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి : ఎస్‌పి
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ ఎన్నికలలో ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన రోజు నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎంసిసి నిబంధనలను, తప్పక పాటించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వివిధ పార్టీల అభ్యర్థులు కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయనేతలు ప్రవర్తించకూడదన్నారు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదన్నారు. మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి నిషిద్ధమన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధమని తెలిపారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదన్నారు. వెహికల్ పరిమిషన్ తీసుకున్నవారు. ఎక్కడా డబ్బులు పంపిణీ చేయకూడదని, ఓటర్లను ప్రభావితం చేసే ఎటు వంటి పనులు చేయరాదన్నారు. ఎంసిసి వైలేషన్స్ జరిగినట్లు తమ దష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి చిన్న సమస్యలు తలెత్తిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.










