నిమ్మనపల్లి : మండల కేంద్రంలోని ఎంఆర్‌సి భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మదనపల్లి ఆర్‌డిఒ ఎంఎస్.మురళి బుధవారం తనిఖీ చేశారు. ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని, అందుకు పోలింగ్ కేంద్రాలలో తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని తహశీల్దార్ మంజుల, ఎంపిడిఒ లీలామాధవి, ఎంఇఒ రాజగోపాల్, ఎస్‌ఐ ఫాతిమాలకు సూచించారు. అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 726 మంది పట్టభద్రులు, ఐదుగురు ఉపాధ్యాయ ఓటర్లుగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండల అధికారులు ఓటింగ్ సరళిపై ఓటర్లకు విస్తత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌లో నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు-(1) గుర్తును తప్పనిసరిగా వేయాలని, ఆ తర్వాత క్రమంగా ప్రాధాన్యత కలిగిన సంఖ్యను ఇతర అభ్యర్థులకు ఇవ్వాలని అన్నారు. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించటానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా నేర చరిత్ర కలిగిన వారిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఎస్‌ఐ ఫాతిమాకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరిధర్ నాయక్, విఆర్‌ఒ రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. కలికిరి : ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆర్‌డిఒ మురళి తనిఖీ చేశారు. ఈనెల 13న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కలికిరి ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని బుధవారం తహశీల్దార్ భాగ్యలత తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గంగయ్య, ఎస్‌ఐ లోకేష్ రెడ్డి, విఆర్‌ఒ విశ్వనాధ్ పాల్గొన్నారు.










