Aug 08,2022 21:44

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2016 నుంచి ఇప్పటి వరకు35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సోమవారం ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 11 మహారత్న, 13 నవరత్న, 74 మినిరత్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని, అందులో 3 మహారత్న, 5 నవరత్న, 18 మినిరత్న, 10 ఇతర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. అందులో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఎయిర్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

  • రూ.2,91,168 కోట్ల బ్యాంకు మోసాలు

గత ఎనిమిదేళ్లలో టాప్‌ 100 ఖాతాలకు సంబంధించి రూ.2,91,168 కోట్ల బ్యాంకు మోసాలు జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖరాడ్‌ తెలిపారు. బిఎస్‌పి ఎంపి రితీష్‌ పాండే అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.2,13,523 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.77,645 కోట్లు మోసాలు జరిగినట్లు తెలిపారు. అలాగే రూ.వంద కోట్లకుపై బడి అప్పులు తీసుకున్న వారి ఎన్‌పిఎలు కింద ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.31,75,361 కోట్లు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.25,91,203 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.5,84,158 కోట్లు ఉన్నాయని తెలిపారు.

  • ఇఎస్‌ఐసిలో 357 పోస్టులు ఖాళీలు

ఇఎస్‌ఐసిలో 357 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఉపాధి, కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. సోమవారం ఒక ప్రశుకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జులై 28 నాటికి 357 డిప్యూటీ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
వివిధ జీవిత బీమా పథకాల్లో 2017-18 నుంచి 2020-21 వరకు పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకొని మొత్తం రూ.1,72,320 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు51,447 ఫిర్యాదులు అందగా, 37,640 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అనంతపురం ఎంపి తలారి రంగయ్య అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
దేశంలో 2017లో రూ.28.10 కోట్ల నకలీ కరెన్సీనిసీజ్‌ చేయగా, 2020లో రూ.92.18 కోట్లు సీజ్‌ చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. కర్నూలు ఎంపి సింగారి సంజీవ్‌ కుమార్‌ అడిగిన ప్రశుకుకేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016-17లో బ్యాంకింగ్‌ వ్యవస్థ రూ.43.36 కోట్లు నకిలీ నోట్లను గుర్తించగా, 2021-22 నాటికి అది రూ.8.25 కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.
వైద్య పర్యాటకం కింద 2021లో దేశానికి 3,03,526 మంది విదేశీయులు రాగా, అందులో అత్యధికంగా బంగ్లాదేశ్‌ నుంచి 1,86,633 మంది, మాల్దీవుల నుంచి 22,798 మంది ఉన్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు