Oct 31,2022 20:44

ముంబయి : డిజిటల్‌ కరెన్సీ ప్రయోగాత్మక ప్రాజెక్టుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) సిద్దమయ్యింది. నవంబర్‌ 1 నుంచి డిజిటల్‌ రూపీని వినియోగించడాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్‌బిఐ సోమవారం వెల్లడించింది. దీన్ని తొలుత ఎంపిక చేసిన టోకు అవసరాలకు వినియోగించడానికి వీలు కల్పించనున్నట్లు పేర్కొంది. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలకు అనుమతించనున్నట్లు తెలిపింది. వచ్చే నెల రోజుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో, పరిమిత సంఖ్యలో రిటైల్‌ అవసరాలకు సంబంధించిన లావాదేవీల్లోనూ డిజిటల్‌ రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టులో ఎస్‌బిఐ, బిఒబి, యుబిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌లు పాల్గననున్నాయని ఆర్‌బిఐ వెల్లడించింది.