Jul 15,2021 18:01

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా, రాజకీయ కార్యాచరణలో భాగంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే నెలలో ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె చేపట్టనున్న తొలి ఢిల్లీ పర్యటన ఇదే అవుతుంది. ఈ ఎన్నికల్లో బిజెపికి తిరుగులేని దెబ్బ తగిలినదడంలో అతిశయోక్తి లేదు. దీంతో 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిలో ఆమె రోల్‌ కీలకం కానుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు నాలుగు రోజుల పాటు ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రముఖ ప్రతిపక్ష నేతలు ..కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలవనున్నారని తెలుస్తోంది. ' ఎన్నికలయ్యాక నేను ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పుడు కోవిడ్‌ పరిస్థితులు మెరుగుపడ్డాయి. పార్లమెంట్‌ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, నా స్నేహితులను కలుస్తాను' అంటూ గురువారం మీడియాతో ఆమె వ్యాఖ్యానించారు. తనకు సమయం ఇస్తే ప్రధాని మోడీ, రాష్ట్రపతిని కలుస్తానని తెలిపారు. ఇంకా పర్యటన తేదీలు ఖరారు చేయలేదని చెప్పారు.