ప్రజాశక్తి - చిలమత్తూరు : జగనన్న చేదోడు లబ్ధిదారులు కుల, రాబడి ధృవీకరణ పత్రాల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేదోడుకు 27న చివరి తేదీ అని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్దిదారులు ధృవీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయానికి క్యూ కట్టారు. కుల ధృవీకరణ పత్రం కొత్తది జతచేయాలని కోరడంతో వాటి కోసం లబ్దిదారులు నానా హైరానా పడుతున్నారు. చివరి తేదీ గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని లబ్దిదారులు సచివాలయ వద్ద వాదనకు దిగుతున్నారు. మండల వ్యాప్తంగా గత సంవత్సరం 323 మంది లబ్దిదారులకు 'చేదోడు' అందింది. ఈ ఏడాది మరో వంద మంది దాక కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఏడాది అందరూ ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రం అందజేయాల్సుంది. దీంతో ధృవీకరణ పత్రాల అప్రూవల్ చేయించుకోవటానికి లబ్ధిదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.










