Dec 31,2022 15:36

ప్రజాశక్తి-నెల్లూరు : వివిధ కారణాలతో ఇప్పటివరకు వస్తున్న సామాజిక పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన వారందరికి  పించన్లు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్ చేసింది.  శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో పింఛన్లు రద్దు పై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పింఛన్దారులకు అర్హులని వారందరికీ పింఛన్లు మంజూరు చేసిందని ప్రస్తుతం ప్రభుత్వం 2750 రూపాయలు పింఛన్లు పెంచుతున్నట్టుగా ప్రకటించి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ కారణాలతో పింఛన్లను కోత కోయడం దుర్మార్గం అన్నారు. సంవత్సరంలో ఎప్పుడు ఒక నెలలో 300 యూనిట్లు విద్యుత్ వాడారని, గృహ నిర్మాణాలు 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్నాయని, లేని పొలం ఉన్నట్టుగా చూపిస్తూ కొద్దిమందికి, రూపాయి ఆధాయం లేని వారికి కూడా ఆదాయం పన్నులు కడుతున్నట్లు రకరకాల కారణాలు చూపించి పింఛన్లను తగ్గించడాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఎంపీడీవో నరసింహారావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి గండవారపు శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంబి రమణయ్య, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి గరికపాటి సురేష్ సి ఐ టి యు మండల కార్యదర్శి మల్లికార్జున నాయకులు ఖాదర్ బాషా, వెంకోజి ,జానీ బాషా, బాలు కోటయ్య, దత్తళ్రీ కోటయ్య, ఆరి మాల్యాద్రి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.