ఐరోపా దేశమైన డెన్మార్క్‌లో నవంబర్ 16న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. దేశ రాజధాని కోపెన్‌హెగన్‌లో వామపక్ష పార్టీ అయిన 'రెడ్ గ్రీన్ అలయన్స్' అత్యధిక ఓటింగ్ తెచ్చుకున్న ఏకైక పార్టీగా నిలిచింది. డెన్మార్క్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 13 పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు పోటీ పడగా కమ్యూనిస్టు పార్టీ అయిన రెడ్ గ్రీన్ అలయన్స్ 24.6 శాతం ఓట్లను తెచ్చుకొని అగ్రభాగాన నిలిచింది. మితవాద పార్టీలను వెనక్కి నెట్టి మధ్యేవాద వామపక్ష పార్టీ, అధికార పార్టీ అయిన సోషల్ డెమోక్రాట్లను అధిగమించి అత్యధిక ఓటింగ్ శాతం తెచ్చుకున్న పార్టీగా నిలిచింది. కోపెన్‌హెగన్‌కు పక్కనే ఉన్న మరో మున్సిపాల్టీ ఫ్రెడరిక్‌బర్గ్‌లో సోషల్ డెమోక్రాట్ల కన్నా ఆరు శాతం అదనపు ఓటింగ్‌తో పూర్తి స్థాయి మెజార్టీని సాధించింది. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే ఈసారి 12 శాతం అదనంగా ఓటింగ్‌ను తెచ్చుకుంది. అంతేకాక మొత్తం మున్సిపాల్టీల్లో 14 అదనపు స్థానాలను కూడా గెలుచుకుంది.
రెడ్ గ్రీన్ అలయన్స్‌లో వున్నదెవరు ?
కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మిక సంఘాల నాయకులు, పర్యావరణ ఉద్యమకారుల సమూహమే రెడ్ గ్రీన్ అలయన్స్. 1989లో డెన్మార్క్ కమ్యూనిస్టు పార్టీ, డెన్మార్క్ కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ, లెఫ్ట్ సోషలిస్ట్స్, సోషలిస్ట్ వర్కర్స్ పార్టీలు కలిసి రెడ్ గ్రీన్ అలయన్స్ పార్టీగా ఏర్పడ్డాయి. పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి విప్లవాన్ని సాధించాలనేది ఈ పార్టీ లక్ష్యం. అందు కోసం ఎన్నికలను ఉపయోగించుకోవాలనేది వీరి వైఖరి. 179 స్థానాలు ఉన్న డెన్మార్క్ పార్లమెంట్‌లో వీరికి 13 స్థానాలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో వీరికి ఏడు శాతం ఓటింగ్ లభించింది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరికి 7.3 శాతం ఓటింగ్ లభించింది. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే 12 శాతం అదనంగా ఓటింగ్ వచ్చింది. ఈ అదనపు ఓటింగ్ ముఖ్యంగా కోపెన్‌హెగన్, ఫ్రెడరిక్‌బర్గ్ మున్సిపాల్టీల్లోనే వచ్చింది. చరిత్రలో మొదటిసారిగా దేశ రాజధాని కోపెన్‌హెగన్‌లో సోషల్ డెమోక్రాట్లను వెనక్కి నెట్టి అత్యధిక ఓటింగ్ వచ్చిన ఏకైక పార్టీగా నిలిచింది.
అందరికీ ఇళ్లు ప్రధాన ఎజెండా
ప్రపంచంలోని ఇతర నగరాల్లో మాదిరే కోపెన్‌హెగన్ పరిస్థితులు ఉన్నాయి. విదేశీ నిధులు వెల్లువలా వచ్చి ఆస్తుల ధరలను అమాంతం పెంచేశాయి. ప్రజలకు ఉద్యోగాలు పోయాయి. అసమానతలు పెరిగాయి. ఇళ్ల అద్దెలు పెరిగిపోయాయి. ప్రజలు దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఈ సమయంలో రెడ్ గ్రీన్ అలయన్స్ సరైన ఎజెండాతో ముందుకు వచ్చింది. అత్యధిక మందికి పబ్లిక్ హౌసింగ్ కావాలనే డిమాండ్ పెట్టింది. ఈ డిమాండ్‌పై సోషల్ డెమోక్రాట్స్ పార్టీ విమర్శలు చేసింది. ఇప్పటికే పబ్లిక్ హౌసింగ్ ఉండగా అదనంగా ఎందుకనే వాదనను ముందుకు తెచ్చింది. అద్దె నియంత్రణ ఇళ్లు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయితే ఇప్పటికే ఉన్న పబ్లిక్ హౌసింగ్ సరిపోదని, అత్యధిక మందికి ప్రయోజనం కలిగేలా హౌసింగ్ పాలసీ ఉండాలని రెడ్ గ్రీన్ అలయన్స్ ప్రజల్లోకి వెళ్లింది. కొత్తగా కడుతున్న ఇళ్లలో 75 శాతం ఇళ్లకు అద్దె నియంత్రణ ఉండాలని డిమాండ్ చేసింది. అందుబాటు ధరల్లో ఇళ్లు అమ్మకాలకు ఉండాలని కోరింది. ఈ డిమాండ్లతో మధ్యతరగతి యువకులను సమీకరించింది. పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాలకు ఎన్నికల్లో ఫలితం వచ్చింది.
కొత్త వర్గాల మద్దతు
ఈసారి రెడ్‌గ్రీన్ అలయన్స్ కొత్త వర్గాల ప్రజల మద్దతు చూరగొన్నది. సిరియా దుర్భర పరిస్థితుల నుండి పారిపోయి డెన్మార్క్‌కు చేరుకున్న కాందిశీకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. మితవాద పార్టీల ప్రచారానికి భయపడి సోషల్ డెమోక్రాట్ పార్టీ కాందిశీకుల పట్ల కొంత వ్యతిరేక ధోరణి ప్రదర్శించింది. కానీ రెడ్ గ్రీన్ అలయెన్స్ మాత్రం కాందిశీకులకు సంపూర్ణ మద్దతు నిచ్చింది. వారికి అండగా నిలిచింది. దీంతో వారి పట్ల సానుభూతితో ఉన్న స్థానిక ప్రజల మనస్సును గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో యువకులు, విద్యార్థుల్లోనూ రెడ్ గ్రీన్ అలయన్స్ విశేష కృషి చేసింది. ప్రతి రోజు ఉదయాన్నే ఇంటి ఇంటికి కరపత్రాలు పంచింది. సాయంత్రం వేళల్లో యూనివర్శిటీల్లో పిజ్జా ఈవినింగ్స్ పేరుతో చర్చాగోష్టులు జరిపింది. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆకర్షితులయ్యారు. ఎన్నికల్లో అభ్యర్ధులను నిలిపే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సులు, టీచర్లు, యువ పర్యావరణ ఉద్యమకారులు, ఫెమినిస్టులు...ఇలా వేర్వేరు రంగాలకు చెందినవారిని ఎన్నికల బరిలోకి దించింది. వీరి ప్రచార హోరుకు హడలెత్తిపోయిన అధికార పార్టీ...రెడ్ గ్రీన్ అలయన్స్ పై దుష్ప్రచారం సాగించింది. వీరు గెలిస్తే దేశాన్ని సోవియట్ యూనియన్‌లా మారుస్తారని ప్రచారం చేసింది. అయినప్పటికీ రెడ్ గ్రీన్ అలయన్స్ తన ప్రధాన ఎజెండా నుండి వెనక్కి తగ్గలేదు.
నర్సుల సుదీర్ఘ సమ్మె
తమకు కేవలం ఐదు శాతం మాత్రమే జీతాలు పెంచుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 75 వేల మంది నర్సులు సమ్మె చేపట్టారు. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ సమ్మె ఆగస్టు వరకు కొనసాగింది. ఈ సమ్మెపై ప్రభుత్వం అణిచివేత చర్యలు చేపట్టింది. నర్సులకు ఫెనాల్టీలు విధించింది. ఈ సమయంలో వీరికి రెడ్ గ్రీన్ అలయన్స్ అండగా నిలిచింది. డెన్మార్క్ చరిత్రలో అత్యంత సుదర్ఘీంగా సాగిన సమ్మెగా నర్సుల సమ్మె చరిత్రకెక్కింది. వీరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో రెడ్ గ్రీన్ అలయన్స్ కీలకంగా వ్యవహరించింది. అంతేకాక ఆరోగ్య రంగ వేతనాల్లో ఉన్న వివక్షకు వ్యతిరేకంగా మహిళలకు పురుషులతో సమాన వేతనం ఇవ్వాలని కూడా పోరాటం చేసింది. ఈ పోరాట ఫలితాలు అన్ని కలిసి దేశ రాజధానిలో వామపక్ష పార్టీ విజయం సాధించడానికి దోహదపడ్డాయి.
/ వ్యాసకర్త సెల్ : 9701330013 /
గమిడి శ్రీనివాస్










