ముంబయి : ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో మనీష్ మల్హోత్రా ఒకరు. సినిమా తారల్లో ఎక్కువమందికి అభిమాన ఫ్యాషన్ డిజైనర్ కూడా. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖ హీరోయిన్లకు ఆయన దుస్తులను డిజైనింగ్ చేశారు. భారతీయ సినిమా రంగంలో ఆయన సుప్రసిద్ధులు. మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో అగ్రనటీమణులెందరో మెరిసిపోయారు. దాదాపు 800 చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ బాధ్యతల్ని మల్హోత్రా నిర్వహించారు.
చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న మల్హోత్రా... ఇప్పుడు డైరెక్టర్ దిశగా అడుగులేస్తున్నారు. అందుకు సన్నాహాలు చేపడుతున్నారు. పీరియడ్ డ్రామాగా ఓ ప్రేమ కథను తెరకెక్కించడానికి మల్హోత్రా కథను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆయన సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నట్టు సమాచారం. మరి ఫ్యాషన్ డిజైనర్‌గా అందరినీ మెప్పించిన మల్హోత్రా.. డైరెక్టర్‌గా కూడా మెప్పించనున్నారా ? చూడాల్సిందే.










