Oct 09,2023 15:53
  • కాజాకు చేరుకున్న యాత్ర

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్  :  ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం చేపట్టిన పాదయాత్ర సోమవారం మంగళగిరి మండలం కాజాకు చేరుకుంది. కాజాలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చిలువూరు నుండి కాజాకు వస్తున్న పాదయాత్ర బృందానికి కాజా గ్రామ నేతలు, కార్యకర్తలు ఎదురు వెళ్లి ఘన స్వాగతం పలికారు. వాటర్ ట్యాంక్ నుండి పూలు చల్లుతూ పూల వర్షం కురిపిస్తూ గ్రామం లోనికి ఆహ్వానించారు. తొలుత గ్రామ శివారులో సీపీఎం పాదయాత్ర బృందం పంట పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను, రైతులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పంటలకు సాగునీటి సమస్య వస్తున్నదని, ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడం, విత్తన సమయం లో వర్షాలు లేక బెట్టకు రావడం, వేసిన విత్తనాలు మొలవక పోవడం వెరసి రైతన్న ఇబ్బందులు పడుతున్నారని బృంద సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ హై లెవెల్ ఛానల్ పనులు పూర్తయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఫలితంగా హై లెవెల్ ఛానల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. 5 మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాలకు అందించాల్సిన సాగునీరు వెనుక పట్టు పట్టిందన్నారు. వెంటనే నిర్మాణ పనులను పూర్తి చేసి హై లెవెల్ ఛానల్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. 

గ్రామంలో ఏళ్ల తరబడి ఇళ్ళు వేసుకొని నివాసముంటున్న వారికి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంతో వారు భయాందోళనకు గురవుతున్నారని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలు లేక అవస్థలు పడుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నివాసం ఉన్నచోటే పేదలకు క్రమబద్ధీకరణ చేసి స్థలాల కేటాయించాలని ప్రభుత్వ జీవోలు ఉన్నప్పటికీ అమలకు నోచుకోవడం లేదన్నారు. దీనిని బట్టి పేదల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని పేర్కొన్నారు. పేదల నివాస ప్రాంతాలలో ఇళ్లను వేసుకొని నివాసముంటున్న వారికి రెగ్యులర్ చేసి పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సూర్యారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ములకా సాంబిరెడ్డి, జెట్టి బాలరాజు, ఎం. బాగ్యరాజు, జి. నాగేశ్వర రావు, దేవరకొండ శ్రీను, క్రాంతి, బైరగాని శ్రీనివాసరావు, రాజముని, కె. కరుణాకర్, ఈదా ప్రతాప రెడ్డి , ఆళ్ల సాంబిరెడ్డి, బి. కోటేశ్వరి, ఎస్. ఆదిశేఖర్, ఎస్. సుమ, ఎస్. నిర్మల, వి అనసూయ, సత్యమా రెడ్డి, గోపాల రెడ్డి, లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

  • పాదయాత్ర సాగుతుందిలా ... 

సీపీఎం చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర కు ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. గ్రామానికి చేరుకున్న బృంద సభ్యులు కు ఘన స్వాగతం పలుకుతూ సమస్యలను వివరిస్తూ వాటి పై అర్జీలను స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. పాదయాత్ర బృందం నకు సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు నాయకత్వం వహిస్తున్నారు. రూట్ మేనేజర్ గా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు వ్యవహరిస్తున్నారు. స్థానిక సమస్యలను అధ్యయనం చేస్తూ... ప్రజలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బృంద సభ్యులు ముందురోజు ముగించిన ప్రాంతం నుండే మరల పాదయాత్ర ను ప్రారంభిస్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం.. కాలా కృత్యాలు తీర్చుకొని.. పాదయాత్ర కు సిద్ధం కావడం ఆపై మొత్తం కాలినడకనే పాదయాత్ర ను కొనసాగించడం జరుగుతుంది. గ్రామస్తులే పాదయాత్ర బృందం సభ్యులకు అల్ఫహరాలను, మధ్యాహ్నం భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సీపీఎం చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటికి 7వ రోజు కు చేరుకుంది. అనేక సమస్యలపై బృంద సభ్యులకు ప్రజలు అర్జీలను అందించారు.