ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు, తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వం హామీలిచ్చి మాట తప్పిందని విమర్శించారు. ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని తెలిపారు. పైపెచ్చు విజయవాడ వస్తున్న అంగన్‌వాడీలను రాష్ట్రవ్యాపితంగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, నిర్భంధించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌లలోకి తీసుకెళ్ళారని తెలిపారు. విజయవాడలో రైల్వే స్టేషన్ నుండి వస్తున్న వందలాది మందిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.
అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి, రాష్ట్ర నాయకులు ఎన్‌సిహెచ్.సుప్రజ, ట్రేడ్ యూనియన్ నాయకులు వి.ఉమామహేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు పోలారి, ఎఐటియుసి నాయకులు ఓబులేసు తదితరులను ముందస్తు అరెస్టు చేశారని విమర్శించారు.. అనేక మంది నాయకులను గృహ నిర్బంధం చేశారని తెలిపారు.
మహిళలనే విచక్షణ కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. రోడ్డునపోయే ప్రజలను బస్‌స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లలో సామాన్య ప్రజల్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు, ఉద్యోగులు, కార్మికుల గొంతునొక్కడం పచ్చి నిరంకుశత్వం తప్ప మరొకటి కాదని వెల్లడించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల కోర్కెలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.










